• facebook
  • whatsapp
  • telegram

యుద్ధ సామ‌గ్రి త‌యారు చేసేస్తారా?

గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ ట్రేడుల్లో ఎయిర్‌మెన్ పోస్టులు

నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విన్యాసాలు. కానీ బాంబులు, వాటి విధ్యంస‌క ప‌రిక‌రాలు, ఆయుధ సామ‌గ్రి, క్షిప‌ణులు, రాడార్ వ్య‌వ‌స్థ‌, చిన్న‌, భారీ వాహ‌నాలు, మిస్సైల్స్‌, ఇంజిన్లు, ఆటోమొబైల్స్‌, డిజిట‌ల్‌, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు ఇలా ఇంకా ఎన్నో ఉంటాయి. వాటిని చూసిడ‌ప్పుడ‌ల్లా మ‌నంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. వీటిని ఎక్క‌డ, ఎలా త‌యారు చేస్తారు? ఎలా వినియోగిస్తారు? వాటి ఉప‌యోగం ఏమిటి? అనే ఆలోచ‌న‌లు మ‌న మ‌న‌సులో మెదులుతాయి. ఎలాగైనా వాటి గురించి తెలుసుకోవాల‌నే కుతూహ‌లం క‌లుగుతుంది. ఇప్పుడు ఆ సందేహాల‌న్నింటికీ సమాధానం తెలుసుకునే అవ‌కాశం వచ్చేసింది. ఆ విధులను గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ ట్రేడుల విభాగాల్లో ఎయిర్ మెన్ ఉద్యోగులు నిర్వహిస్తారు. వాట‌న్నింటిని త‌యారు చేసే, నిర్వ‌హ‌ణ వీరే చూసుకుంటారు. అలాంటి కొలువుల్లో చేరాలనుకునే వారికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

కనీస అర్హతలు 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి అవివాహిత యువకులు మాత్రమే అర్హులు. వ‌య‌సు 21 ఏళ్లు మించ‌కూడ‌దు. అంటే 16 జ‌న‌వ‌రి, 2001 నుంచి 29 డిసెంబ‌రు, 2004 మ‌ధ్య‌లో జ‌న్మించి ఉండాలి. గ్రూపు ‘X’ (ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ ట్రేడు మిన‌హాయించి) పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ 10+2/ త‌త్స‌మాన విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌లో ఏదైనా విభాగంలో 50 శాతం మార్కుల‌తో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేయాలి. గ్రూపు ‘Y’ (ఐఏఎఫ్(ఎస్‌), మ్యూజిషియ‌న్ ట్రేడులు మిన‌హాయించి) పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులూ 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ 10+2/ త‌త్స‌మాన విభాగంలో ఉత్తీర్ణ‌త సాధించాలి. లేదా రెండు సంవ‌త్స‌రాల వొకేష‌న‌ల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. గ్రూపు ‘Y’ మెడిక‌ల్ అసిస్టెంట్ ట్రేడ్‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కూడా ఇంట‌ర్మీడియ‌ట్/ 10+2/ త‌త్స‌మాన ప‌రీక్ష‌లో అర్హులు కావాల్సి ఉంది. వీరంద‌రికీ ఇంగ్లిష్ స‌బ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరి.

గ్రూపు ‘X’ ప‌రీక్ష‌కు అర్హులైన అభ్య‌ర్థులు గ్రూపు ‘Y’ ప‌రీక్ష‌కూ అర్హులే. ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్‌లో ఒకేసారి రెండు ట్రేడ్‌ల‌కూ ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంటుంది. సాధార‌ణంగా ద‌ర‌ఖాస్తుదారులు 152.5 సెంటిమీట‌ర్ల ఎత్తు ఉండాలి. ఐఏఎఫ్(పి) ట్రేడ్ అభ్య‌ర్థులు 165 సెం.మీ(నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాలు, ప‌ర్వ‌త ప్రాంతాలు), ఇత‌ర రాష్ట్రాల వారు 175 సెం.మీ, ఆటో టెక్‌ట్రేడ్ అభ్య‌ర్థులు 162.5 సెం.మీ (నేపాలీలు, ఈశాన్య రాష్ట్రాలు, ప‌ర్వ‌త ప్రాంతాలు), ఇత‌ర రాష్ట్రాల వారు 165 సెం.మీ ఉండాలి. ఛాతీ క‌నిష్ఠంగా 5 సెం.మీ విస్త‌రించాలి. దృష్టిదోషం ఉండ‌రాదు. వినికిడి సామ‌ర్థ్యం స్ప‌ష్టంగా ఉండాలి. ఆప‌రేష‌న్స్ అసిస్టెంట్ ట్రేడులు క‌నిష్ఠంగా 55 కేజీల బ‌రువు ఉండాలి. నేపాలీలు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు విధానం

ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ 22 జ‌న‌వ‌రి, 2021న ప్రారంభ‌మై 07 ఫిబ్ర‌వ‌రి 2021న ముగుస్తుంది. సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప‌రీక్ష రుసుం రూ.250 ఆన్‌లైన్‌లో లేదా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచిలో చ‌లానా రూపంలో చెల్లించ‌వ‌చ్చు. ఆన్‌లైన్ ‌ప‌రీక్ష 18 ఏప్రిల్, 2021 నుంచి 22 ఏప్రిల్‌, 2021 తేదీల‌ మ‌ధ్య‌లో ఉంటుంది. అక్టోబ‌రు 31న మెరిట్ లిస్ట్ వెలువ‌డుతుంది. శిక్ష‌ణ‌కు ఎంపికైన‌వారి వివ‌రాలు డిసెంబ‌రు 10న ప్ర‌క‌టిస్తారు.

ఎయిర్‌మెన్ విభాగాలు

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ ఉద్యోగాల్లో గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ ట్రేడులు ఉంటాయి. ఇందులోనూ టెక్నిక‌ల్, నాన్ టెక్నిక‌ల్ అ‌ని విభాగాలున్నాయి. గ్రూపు ‘X’ టెక్నిక‌ల్ విభాగంలో ఆటోమొబైల్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రానిక్స్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఫిట్ట‌ర్, మెకానిక‌ల్ సిస్ట‌మ్ ఫిట్ట‌ర్‌, స్ట్ర‌క్చ‌ర్స్ ఫిట్ట‌ర్‌, ఫ్రొప‌ల్ష‌న్ ఫిట్ట‌ర్‌, వ‌ర్క్‌షాప్ ఫిట్ట‌ర్ (స్మిత్‌), వ‌ర్క్‌షాప్ ఫిట్ట‌ర్ (మెకానిక‌ల్‌), వెప‌న్ ఫిట్ట‌ర్ ఉద్యోగాలు ఉంటాయి. నాన్‌టెక్నిక‌ల్ విభాగంలో ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ ఉద్యోగం ఉంటుంది. గ్రూపు ‘Y’ టెక్నిక‌ల్ విభాగంలో క‌మ్యూనికేష‌న్ టెక్నీషియ‌న్లు‌, ఆటోమొబైల్ టెక్నీషియ‌న్లు ఉంటారు. నాన్ టెక్నిక‌ల్ విభాగంలో అసిస్టెంట్లు (అడ్మిన్, యాక్ట్స్, మెడిక‌ల్, లాజిస్టిక్, ఇన్విరాన్‌మెంట్ స‌పోర్ట్ స‌ర్వీస్‌, ఒపీఎస్, మెట్రోలాజిక‌ల్‌, గ్రౌండ్ ట్రైనింగ్‌), ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌(పోలీస్‌, సెక్యూరిటీ), మ్యూజిషియ‌న్ ఉంటారు. 

ఎంపిక ఎలా?

సెంట్ర‌ల్ ఎయిర్‌మెన్ సెల‌క్ష‌న్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతుంది. అభ్య‌ర్థుల‌ను రాత‌ప‌రీక్ష‌, శ‌రీర‌దార్ఢ్య ప‌రీక్ష‌, మెడిక‌ల్ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ప్ర‌శ్న‌లు అబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్య‌మంలో ఇస్తారు. గ్రూపు ‘X’ ప‌రీక్ష‌కు 60 నిమిషాల స‌మ‌యం కేటాయించారు. ప్ర‌శ్న‌లు 10+2 సీబీఎస్ఈ సిల‌బ‌స్‌లోని ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ‌మేటిక్స్ నుంచి వ‌స్తాయి. గ్రూపు ‘Y’ ప‌రీక్ష‌కు 45 నిమిషాల స‌మ‌యం ఇస్తారు. ఇందులో రీజ‌నింగ్ & జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్, 10+2 సీబీఎస్ఈలోని ఇంగ్లిష్ స‌బ్జెక్టు నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. గ్రూపు ‘X’, గ్రూపు ‘Y’ రెండు ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు 85 నిమిషాల స‌మ‌యం కేటాయించారు. వీరికి 10+2 సీబీఎస్ఈలోని ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, రీజ‌నింగ్ & జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ నుంచి ప్ర‌శ్న‌లుంటాయి.

ఒక‌ప్ర‌శ్న‌కు ఒక మార్కు. త‌ప్పుగా గుర్తించిన స‌మాధానికి 1/4 మార్కు కోత విధిస్తారు. ఇందులో ఎంపికైన వారికి ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌కు అర్హ‌త ల‌భిస్తుంది. ఇక్క‌డ 1.6 కి.మీ దూరాన్ని 6 నిమిషాల 30 సెక‌న్లలో పూర్తి చేయాలి. అలాగే నిర్ణీత వ్య‌వ‌ధిలో 10 పుష్అప్స్‌, 10 సిట్అప్స్‌, 20 స్క్వాట్స్ పూర్తి చేయాలి. ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో అర్హ‌త సాధించిన వారికి అడాప్ట‌బిలిటీ టెస్టు-1 నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగానికి స‌రిపోతాడో లేదో తెలుసుకోవ‌డానికి అబ్జెక్టివ్ త‌ర‌హాలో రాత ప‌రీక్ష ఉంటుంది. ఇందులో అర్హ‌త సాధించిన వారికి అడాప్ట‌బిలిటీ టెస్ట్-2 ఉంటుంది. ఇక్క‌డ అభ్య‌ర్థి వాయుసేన వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డ‌తాడా? లేదా? అని ప‌రిశీలిస్తారు. వీటిలో ఉత్తీర్ణ‌త సాధిస్తే మెడిక‌ల్ టెస్ట్‌ల‌కు పంపిస్తారు. అన్ని ప‌రీక్షల్లో ఎంపికైన వారికి సంబంధిత ట్రేడుల్లో జ‌న‌వ‌రి, 2022 నుంచి బెళ‌గ‌వి (క‌ర్ణాట‌క‌) ప్రాథ‌మిక శిక్ష‌ణ కేంద్రంలో త‌ర్ఫీదు నిర్వ‌హిస్తారు. అనంత‌రం అభ్య‌ర్థుల‌ను సంబంధిత ట్రేడ్ శిక్ష‌ణ కేంద్రాల‌కు పంపుతారు. ఆ ట్రేడుల్లో విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు.

జీతభ‌త్యాలు 

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ కాలంలో నెల‌కు రూ.14,600 స్టైపెండ్ ఇస్తారు. శిక్ష‌ణ అనంత‌రం గ్రూపు ‘X’ట్రేడు (ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ ట్రేడు మిన‌హాయించి)ల‌కు నెల‌కు రూ.33,100 వేత‌నం ఉంటుంది. గ్రూపు ‘Y’ ట్రేడు (ఐఏఎఫ్(ఎస్‌), మ్యూజిషియ‌న్ ట్రేడులు మిన‌హాయించి)ల‌కు రూ.26,900 ఇస్తారు. వీరికి జీతంతో పాటు ఇత‌ర అల‌వెన్సులు ఉంటాయి. విధుల్లో కొన‌సాగే వారు భ‌విష్య‌త్తులో ప‌దోన్న‌తుల ద్వారా మాస్ట‌ర్ వారెంట్ ఆఫీస‌ర్ (ఎండ‌బ్ల్యూవో) స్థాయి వ‌ర‌కు చేరుకోవ‌చ్చు. స‌ర్వీసులో కొన‌సాగుతూ కొన్ని ప‌రీక్ష‌ల్లో అర్హ‌త‌లు సాధించిన వారు క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్లు కావ‌డానికీ అవ‌కాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తూనే నిర్ణీత వ్య‌వ‌ధితో ఉన్న‌త విద్య కొన‌సాగించ‌డానికీ అనుమ‌తిస్తారు. 57 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు ఉద్యోగంలో  కొన‌సాగే అవ‌కాశం ఉంది. ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత పింఛ‌ను, ఇత‌ర సౌక‌ర్యాలు అందుతాయి.

వెబ్‌సైట్లు: www.airmenselection.cdac.in, www.careerindianairforce.cdac.in
 

Posted Date : 15-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌