• facebook
  • whatsapp
  • telegram

బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

10+2 క్యాడెట్‌ ఎంట్రీ ప్రకటన విడుదల

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం ప్రకటన వెలువడింది. జేఈఈ మెయిన్స్‌ ర్యాంక్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. ఈ అవకాశం వచ్చినవారికి ఇంజినీరింగ్‌ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితంగానే దక్కుతాయి. చదువు, శిక్షణ పూర్తయిన వెంటనే విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే లక్ష రూపాయలు వేతనం పొందవచ్చు.  

ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు నేవీ 10+2 కేడెట్‌ ఎంట్రీ స్కీంకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జేఈఈ మెయిన్‌లో ర్యాంకు తప్పనిసరి. అందులో సాధించిన ర్యాంకుతో మెరిట్‌ ప్రకారం వచ్చిన దరఖాస్తులను మదింపు చేస్తారు. ఖాళీలకు అనుగుణంగా కొంతమందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఎక్కడైనా మార్చి నుంచి ఏప్రిల్‌ లోపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి. 

తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైనవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు.  

చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ కేటాయిస్తారు. వీరికి లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.56,100 అందుతుంది. మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలిపి గరిష్ఠంగా రూ.లక్ష వరకు వేతనరూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు... మొదలైన ప్రోత్సాహాలెన్నో పొందవచ్చు. 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు లభిస్తాయి. 

శిక్షణ ఇలా...

ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జూన్‌ 2023 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాళ (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు... అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అనంతరం వీరిని సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. 

గమనించండి...

ఖాళీలు: మొత్తం 35. (30 ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌లో, 5 ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో).  

విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌-2022లో అర్హత సాధించాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

వయసు: జనవరి 2, 2004 - జులై 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 12.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్‌)

‣ గెయిల్‌లో కొలువులు

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (తెలంగాణ)

Posted Date : 30-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌