• facebook
  • whatsapp
  • telegram

ఆనుపానులు తెలిస్తే మార్కులు

విద్యా దృక్ప‌థాలు

మొత్తం తెలిస్తే సూక్ష్మం సులభగ్రాహ్యం- ఇదీ విద్యా దృక్పథాలు విభాగ స్ఫూర్తి. మొత్తం అంటే- విద్యారంగం, సూక్ష్మం అంటే తాను నిర్వహించవలసిన పాత్ర. స్థూలంగా- భారతీయ విద్యారంగంపై విశాల అవగాహన ఏర్పరచుకున్న ఉపాధ్యాయుడు రేపు తరగతి గదిలో తన పాత్రను శక్తిమంతంగా నిర్వర్తించగలడు. విద్యా దృక్పథాలు విభాగాన్ని ఈ కోణం నుంచి అర్థం చేసుకున్నట్లయితే సిలబస్‌లో పొందుపరిచిన అంశాలను మొక్కుబడిగా కాక ఆసక్తిగా, మన విద్యారంగ ఆనుపానులు అవగతం చేసుకునే అవకాశంగా అభ్యర్థి భావించే స్థితికి చేరతాడు. విద్యా దృక్పథాలు సిలబస్‌లో భారతదేశ విద్యా వ్యవస్థ పూర్వరంగం- వర్తమానానికి సంబంధించిన అంశాలను కేవలం అయిదు యూనిట్లలో పొందుపరిచారు. అంటే అయిదు యూనిట్ల నుంచి 20 బిట్లను అభ్యర్థి ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే పాఠ్యాంశాలన్నీ విద్యా కమిటీలు, కమిషన్లు, వాటి సిఫారసులు, విద్యా చట్టాలు, ఉపాధ్యాయుల పాత్ర- బాధ్యతలు, వృత్తి వాతావరణం, విద్యా రంగంలో వర్తమాన ప్రక్రియలు, అనుబంధ విషయాలు వాటి చుట్టూనే అల్లుకుని ఉన్నాయి.

విద్యా వ్యవస్థ చరిత్ర
గతాన్ని అవగతం చేసుకుంటేగానీ వర్తమానం అవగాహనకు రాదు. అందుకే విద్యా దృక్పథాలు మొదటి యూనిట్‌గా భారతీయ

విద్యా వ్యవస్థ మూలాలను స్పృశించారు.
* పూర్వ వేదకాల విజ్ఞానాన్వేషణ నుంచి వేదవిజ్ఞాన ప్రసారమే ప్రాతిపదికగా జరిగిన వేదయుగ ప్రాచీన విద్యాభ్యాసంపై అవగాహన అవసరం దీనిపై విషయప్రధాన ప్రశ్నలకు ఆస్కారం ఉంటుంది.
* ఆధునిక విద్యా విధానానికి బీజాలు పడిన బ్రిటిష్‌ పాలనా కాలంలో 1854 నుంచి 1944 వరకు సాగిన విద్యా విధానానికి ప్రాతిపదికలు 9 కమిషన్లు- కమిటీలు, వాటి సిఫారసులు, తమ అవసరాలు, ఆలోచనల దృష్ట్యా రూపొందించిన బ్రిటిష్‌ విద్యావిధానంపై ఒకటి, రెండు ప్రశ్నలకు అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన డీఎస్‌సీలో..
* స్వాతంత్య్రానంతరం 1948-49 రాధాకృష్ణన్‌ కమిషన్‌ నుంచి 1992 పీఓఏ- విద్యా కార్యచరణ ప్రణాళిక వరకు 9 కమిటీలు, కమిషన్లు అధ్యయనం చేశాయి. నాటి సిఫారసులను అమలు చేశారు.

1986 నూతన జాతీయ విద్యావిధానాన్ని సమీక్షించడానికి నియమించిన కమిటీ ఏది?
1. ఆచార్య రామ్మూర్తి కమిటీ
2. కస్తూరి రంగన్‌ కమిటీ
3. ప్రొ॥ రామిరెడ్డి కమిటీ
4. ప్రొ॥ యశ్‌పాల్‌ కమిటీ
జవాబు: 1
ఈ కోణంలో నాలుగు కమిటీలు- సిఫారసులు వాటిలో కార్యచరణలోకి వచ్చి దీర్ఘకాలం అమల్లోకి వచ్చిన ప్రతిపాదనలను చదవాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయ సాధికారత
విద్యార్థి కేంద్రంగా విద్యా విధానాలు, విద్యాభ్యాసాలు ఉండాలని అందరూ అంగీకరించినప్పటికీ తరగతిలో ప్రధాన భూమిక ఉపాధ్యాయుడిదే. విద్యార్థి కోణం నుంచి బోధించాల్సింది ఉపాధ్యాయుడే కాబట్టి వారికి ప్రేరణ, వృత్తిపరమైన ఎదుగుదల, ఉపాధ్యాయ విద్యను అందించే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలు, పాఠశాలలో నిర్వహించాల్సిన రికార్డులు, రిజిస్టర్లు తదితర అంశాలను ఈ యూనిట్‌లో చేర్చారు. సిలబస్‌ రీత్యా చిన్న యూనిట్‌ అయినా 3-4 ప్రశ్నలకు ఆస్కారం ఉంది.

ఉపాధ్యాయ వృత్తిపరత్వం (ప్రొఫెషనలిజం) అంటే ఏమిటి?
1.వృత్తిపర నియమావళికి అనుగుణంగా నడుచుకోవడం
2. నియామకానికి ముందే వృత్తిపర కోర్సు పూర్తిచేయడం
3. వేతనాలు పొందడానికి బోధించడం
4. అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయడం
జవాబు: 1

సమకాలీన భారతదేశంలో విద్యారంగ అంశాలు
సిలబస్‌లో ఎక్కువ అంశాలు కనిపిస్తూ ఎక్కువ ప్రశ్నలకు అవకాశమున్న యూనిట్‌ ఇది. దీనిలో పదికిపైగా అంశాలను చదవాల్సి ఉంటుంది. దీనిలో ప్రధానంగా
1. పర్యావరణ విద్య
2. విద్య-ప్రజాస్వామ్యం
3. విద్యా ఆర్థిక కోణం
4. విద్యా-మానవ వనరుల అభివృద్ధి
5. జనాభా-విద్య
6. సమ్మిళిత విద్య
7. విద్య-విలువలు
8. మధ్యాహ్న భోజన పథకం, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్‌, కస్తూరిబాయి గాంధీ బాలికా విద్యాలయాలు, సక్సెస్‌ స్కూల్స్‌.
వీటిలో కనీసం నాలుగైదు అంశాలపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఈ అంశాలతోపాటు ప్రస్తుతం ప్రభుత్వం దృష్టిపెడుతున్న పాఠశాల- పరిశుభ్రత, గౌరవ గదులు (టాయిలెట్స్‌), బాలికా పాఠశాలలు, పాఠశాలల్లో విద్యార్థి భద్రత వంటి తాజా అంశాలపై ప్రభుత్వ చొరవలను గమనించాలి.

హక్కులు- చట్టాలు
ఉపాధ్యాయులు కావాలనుకునే ఉద్యోగార్థులకు బాలల హక్కులు, వారికి నిర్దేశించిన చట్టాలపై ఏమేరకు అవగాహన ఉందో తెలుసుకోవడం ఈ యూనిట్‌ ఉద్దేశం. చిన్న యూనిట్‌గా కనిపిస్తూ 3, 4 ప్రశ్నలకు అవకాశమున్న అధ్యాయం. ఇందులో భాగంగా బాలల ఉచిత విద్యాహక్కు, నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009, సమాచార హక్కు చట్టం-2005, బాలల హక్కులు, మానవ హక్కులు చదవాల్సి ఉంటుంది.

ఉచిత నిర్బంధ విద్య, బాలల హక్కుల చట్టం-2009 ప్రకారం తల్లిదండ్రులు 6-14 ఏళ్ళ పిల్లలను బడిలో చేర్పించడం...
1. విధి
2. ఐచ్ఛికం
3. తప్పనిసరి
4. ఏదీ కాదు
జవాబు: 1
ఈ యూనిట్‌లో అంశాలు పరిమితంగా ఉన్నందున క్షుణ్ణంగా చదవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం
చివరి అధ్యాయం. కీలక అంశం. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యావిధానానికి ప్రాతిపదిక. అందువల్ల ఈ యూనిట్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది. దేశంలోని కోట్లాది పిల్లలు అనుసరిస్తున్న పాఠ్యప్రణాళిక చట్రాన్ని పునస్సమీక్షిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖమంత్రి పార్లమెంటులో ప్రకటించిన తరువాత ఆ బాధ్యతను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ)కి అప్పగించారు. భారంలేని అభ్యసనం నివేదిక (1993) వెలుగులో పాఠశాల విద్యకోసం జాతీయ ప్రణాళిక చట్రాన్ని సమీక్షించాలని కోరారు. ఫలితంగా ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌ అధ్యక్షుడిగా జాతీయ సారథ్య సంఘం ఏర్పడింది. ఈ సంఘం అధ్యయనం అనంతరం రూపొందించిందే జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం. విద్యాధృక్పథాల్లో అయిదో యూనిట్‌ మొత్తం ఈ నివేదికలోని అంశాలే. అయిదు ప్రధాన అంశాలుగా రూపొందించిన ఈ నివేదికను ఎన్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. మొత్తం మీద ఈ విభాగం భారతీయ విద్యావ్యవస్థ, విద్యావిధానం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఆసక్తిగా అవగాహన చేసుకుంటే 20 ప్రశ్నల్లో గరిష్ఠంగా సరైన సమాధానాలు గుర్తించవచ్చు. మిగతా విభాగాల స్కోరుకు దీనిని జత చేయడం ద్వారా ఉపాధ్యాయ పోస్టును ఖాయం చేసుకోవచ్చు.

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌