• facebook
  • whatsapp
  • telegram

ఇంగ్లిష్‌లో పట్టు సాధిస్తే ఇక టీచరు మీరే

ఆంగ్ల మాధ్యమానికి పెరిగిన ప్రాధాన్యం దృష్ట్యా ఏపీ టెట్‌ కం టీఆర్‌టీలో ఇంగ్లిష్‌ భాషకు ఎక్కువ ప్రాముఖ్యాన్నిచ్చారు. అన్ని కేటగిరీల పోస్టుల్లో ఈ భాషకు ఎస్‌జీటీలో 35 మార్కులు, స్కూలు అసిస్టెంట్లకు 30 మార్కులు కేటాయించారు. పోస్టు ఏదైనా అందులో విజయాన్ని ఖాయం చేసేది అభ్యర్థి ఆంగ్లభాషా పరిజ్ఞానమే!

                డీఎస్‌సీ - 2008లో మొదటిసారి అన్ని కేటగిరీల పోస్టులకు ఆంగ్ల సబ్జెక్టును ప్రవేశపెట్టారు. అప్పుడు ఎస్‌జీటీలో 15 మార్కులకు, స్కూలు అసిస్టెంట్‌లో 20 మార్కులకు మాత్రమే ఆంగ్లం ఉండేది. ఆ తరువాత 2011 నుంచి టెట్‌ వచ్చింది. అందులో ఇంగ్లిష్‌కు 30 మార్కులు ఉన్నా, అది కేవలం అర్హత పరీక్షే కావడం, అందులో సాధించే మార్కులకు చివరి విభాగంలో 20% వెయిటేజీ ఇవ్వడం వల్ల అభ్యర్థులకు అంతగా శ్రమ పడాల్సిన అవసరం రాలేదు.ఈసారి టెట్‌ కం టీఆర్‌టీలో సాధించే మార్కులకు 100% వెయిటేజీ ఉండడం వల్ల అవి అర్హతను సాధించడానికే కాకుండా తుది ఎంపికను నిర్థారిస్తాయి. ఇంతకుముందు టెట్‌లో 30 మార్కులకు 30 సాధిస్తే అందులో 20 శాతం... అంటే కేవలం 6 మార్కులు తుది ఎంపికలో కలిసేవి. ఈసారి టెట్‌ కం టీఆర్‌టీలో అన్ని మార్కులూ అంటే 30 కలుస్తాయి. పోటీలో విజయాన్ని నిర్థారించేది ఇంగ్లిష్‌ మార్కులే కనుక అభ్యర్థి ఇప్పటినుంచే రోజూ కొంత సమయాన్ని ఆంగ్లానికి కేటాయించి ప్రణాళికాబద్ధంగా చివరివరకూ అధ్యయనం చేయాలి.

సిలబస్‌ ఒకటే
సిలబస్‌ విషయానికొస్తే అన్ని కేటగిరీలకూ ఒకే రకమైన సిలబస్‌ ఉంది. లాంగ్వేజ్‌తోపాటు ఆంగ్ల బోధనా పద్ధతుల్లో కూడా ప్రశ్నలు ఉంటాయి. ఒక భాషా బోధకుడికి ఉండాల్సిన నైపుణ్యాలన్నింటినీ పరీక్షించే వ్యాకరణం, వకాబ్యులరీ, ఫొనెటిక్స్‌, కాంపొజిషన్‌, కాంప్రహెన్షన్‌- ఈ ఐదు విభాగాలనూ సిలబస్‌లో చేర్చారు. 2008 డీఎస్‌సీ, గత నాలుగు టెట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలస్థాయి చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ప్రాథమిక, మధ్యస్థ, ఉన్నత- ఈ మూడు స్థాయుల్లోనూ ప్రశ్నలిచ్చారు. మధ్యస్థ, ఉన్నత స్థాయిల్లో ఎక్కువ ప్రశ్నలున్నాయి. ప్రాథమిక స్థాయిలో ఒకటి రెండు ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీఎడ్‌ ప్రవేశపరీక్ష, ఎంఏ ఇంగ్లిష్‌ ప్రవేశ పరీక్షల్లో ఆంగ్లం మాదిరి కాకుండా ఉపాధ్యాయ పరీక్షల్లో అభ్యర్థి తన విషయ పరిజ్ఞానాన్ని వాడుకలో ఎంతమేరకు ఉపయోగించుకోగలుగుతాడో పరీక్షించేవిధంగా ప్రశ్నలున్నాయి. అందువల్ల సాంప్రదాయిక వ్యాకరణంతోపాటు ఫంక్షనల్‌ గ్రామర్‌లోనూ పట్టు సాధించాలి. సంప్రదాయ వ్యాకరణం సూత్రాలనూ, వాక్య నిర్మాణ పద్ధతులనూ బోధిస్తుంది. ఫంక్షనల్‌ గ్రామర్‌ ఏ భావాన్ని వ్యక్తీకరించడానికి ఏ నిర్మాణం అవసరమవుతుందో తెలియజేస్తుంది.

భాషాభాగాలపై శ్రద్ధ
వ్యాకరణ అధ్యయనంలో భాషాభాగాలు (Parts of speech) గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే మిగిలిన అంశాలను నేర్చుకోవడం తేలిక. భాషాభాగాల్లో ఇచ్చే పదాల భాషాభాగాన్ని గుర్తించమన్నపుడు పదం form ను కాకుండా వాక్యంలో దాని ఉపయోగాన్ని బట్టి అది ఏ భాషాభాగానికి చెందుతుందో నిర్ధారించాలి.
* She is at home- ఈ వాక్యంలో home అనే పదం preposition తరువాత వచ్చింది కాబట్టి దాన్ని nounగా గుర్తించాలి.
* He gave me a lift home అనే వాక్యంలో homeముందు prepositionగానీ determinerగానీ లేదు. అందువల్ల దాన్ని adverbగా గుర్తించాలి.
* చాలా పదాలు వాక్యంలో ఎక్కడ వచ్చినా వాటి భాషాభాగం మారదు. Home, before, after, fly, play, water లాంటి పదాలు వాక్యంలో వాడిన పద్ధతిని బట్టి ఒక్కోసారి ఒక్కో భాషాభాగానికి చెందుతాయి. ఇలాంటి పదాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ఏయే పుస్తకాలు మేలు?
ఇంగ్లిష్‌ సబ్జెక్టులో పట్టు సాధించాలంటే వ్యాకరణానికి రెన్‌ అండ్‌ మార్టిన్‌ రాసిన వ్యాకరణ పుస్తకాన్ని చదవాలి. ఫొనెటిక్స్‌కు బాలసుబ్రహ్మణియన్‌, మెథడ్స్‌కు డీఈడీ, బీఈడీ పాఠ్యపుస్తకాలను, కాంపోజిషన్‌కు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పాఠ్యపుస్తకంలోని ఆ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అప్పుడే ఎక్కువ మార్కులు స్కోరు చేయగలుగుతారు. వకాబ్యులరీ, కాంప్రహెన్షన్ల కోసం 8, 9, 10 తరగతుల ఆంగ్ల పాఠ్యపుస్తకాలు కొత్తవీ, పాతవీ చదివితే ఉపయోగకరం. 2008 డీఎస్‌సీలో ఇచ్చిన అన్ని కేటగిరీల ఇంగ్లిష్‌ పత్రికలనూ గతంలో జరిగిన నాలుగు టెట్‌ పేపర్లను సాధన చేస్తే ప్రయోజనకరం.ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, పీఈటీలకు ఒకే రకమైన సిలబస్‌ ఉంది. పరీక్షా విధానం కూడా ఒకేవిధం. కంటెంట్‌ (గ్రామర్‌)లో 80%, మెథడాలజీలో 20% బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. అంటే ఎస్‌జీటీ 35 మార్కుల ప్రశ్నపత్రంలో కంటెంట్‌లో 28 ప్రశ్నలు, మెథడాలజీలో 7 ప్రశ్నలుంటాయి. స్కూల్‌ అసిస్టెంట్స్‌, భాషా పండిట్‌లు, పీఈటీ 30 మార్కుల పేపర్లో కంటెంట్‌లో 24 ప్రశ్నలు, మెథడాలజీలో 6 ప్రశ్నలు వస్తాయి.

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌