• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకు కొలువులు అందుకోండి.. అరుదైన అవకాశం!

‣ 14,046 ఖాళీలకు ప్రకటనలు విడుదల

‣ మూడు పరీక్షలకు ఉమ్మడి ప్రిపరేషన్‌

బ్యాంకుల్లో వరుసగా 3 అవకాశాలు  బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఒక ప్రకటన విడుదలైందంటే.. అది నిరుద్యోగులకు శుభవార్తే. అలాంటిది క్లరికల్, పీఓ పోస్టుల నియామకానికి వరుసగా మూడు ప్రకటనలు విడుదలయ్యాయంటే.. సంతోషం మూడు రెట్లయినట్టే! 

ఐబీపీఎస్‌ క్లరికల్, ఎస్‌బీఐ పీఓల ప్రకటనల తర్వాత  తాజాగా విడుదలైన బ్యాంకు ఉద్యోగ ప్రకటన... ఐబీపీఎస్‌ పీఓ/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల నియామకానికి సంబంధించినది. అంటే..  మూడు ద్వారాలు తెరుచుకున్నాయి. అరుదైన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మూడు  పరీక్షలకూ పోటీ పడొచ్చు. బ్యాంకు కొలువు కలను సమగ్ర వ్యూహంతో నిజం చేసుకోవచ్చు! 

వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనెల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేసుకుంటారు. 

దేశవ్యాప్తంగా 4,135 ఖాళీలను తాజా ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఇండియన్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులు ఇంకా తమ ఖాళీల వివరాలను ఐబీపీఎస్‌కు తెలియజేయలేదు. వాటిని కూడా తెలియజేస్తే ఈ ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

బ్యాంకులో పీఓగా చేరిన తర్వాత నిబంధనలకు అనుగునంగా అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), ఛైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) క్రమంలో కెరియర్‌లో ఎదిగే అవకాశం ఉంది.

ఇప్పటికే ఐబీపీఎస్‌.. క్లరికల్‌ పోస్టుల నియామకానికీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2,056 ప్రొబేెషనరీ ఆఫీసర్ల నియామకానికీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ రకంగా ప్రస్తుతం బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులకు 14 వేలకు పైగా పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అరుదుగానే వస్తుంది ఇలాంటి అవకాశం! దీన్ని అభ్యర్థులు అంది పుచ్చుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి.  

మూడింటికీ కలిపి.. 

ఒకే సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ మూడు నోటిఫికేషన్లలోని పరీక్షలు కాస్త అటూఇటుగా ఒకే సమయాల్లో జరగనున్నాయి. పరీక్ష విధానం కూడా ప్రిలిమినరీకి ఒకే విధంగా ఉంటుంది. ఐబీపీఎస్‌ పీఓ, ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. ఐబీపీఎస్‌ క్లర్క్‌ మెయిన్స్‌ పరీక్షా విధానంలో కాస్త భేదమున్నా సబ్జెక్టులు మాత్రం అవే. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు పరీక్షలకూ కలిపి ఉమ్మడిగా ప్రిపరేషన్‌ కొనసాగిస్తే సమయం, శ్రమ అన్నీ ఆదా అవుతాయి. 

సన్నద్ధత ఏ విధంగా?

‣ ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్‌ 4, 11 తారీఖులలో జరగనుంది. ఎస్‌బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌ చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. ఐబీపీఎస్‌ కర్క్‌ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్‌ నెలలో పీఓ పరీక్ష తర్వాత జరగనుంది. 

‣ వీటిలో మొదటగా జరిగే ఎస్‌బీఐ పీఓ పరీక్ష సమయానికే ప్రిపరేషన్‌ పూర్తయ్యే విధంగా చూసుకోవాలి. 

‣ ఇంతకుముందు నుంచే ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు అదేవిధంగా వారి సన్నద్ధతను కొనసాగించాలి. 

‣ కొత్తగా పరీక్ష రాసే అభ్యర్థులు  ఎస్‌బీఐ పీఓ పరీక్ష కూడా రాస్తుంటే ఆ సమయానికి (లేకపోతే.. ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష సమయానికి) పూర్తయ్యేలా ప్రిపరేషన్‌ ప్రణాళికను రచించుకోవాలి. 

‣ ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటికీ కలిపి సమగ్రమైన  ప్రణాళిక అవసరం.

హెచ్చు స్థాయిలో...

అయితే బ్యాంకు పరీక్షలన్నింటిలో ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్‌ పీఓ పరీక్షలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. వీటికి సన్నద్ధమయితే ఇతర పరీక్షలు తేలికగా రాసే అవకాశముంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో  నాలుగు సబ్జెక్టులున్నాయి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌. వీటిలో ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. దానికి తగినట్లుగా సమయాన్ని కేటాయించాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌: ప్రిలిమ్స్‌ పరీక్షను చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో, మెయిన్స్‌ను గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తారు.

తెలంగాణ: ప్రిలిమ్స్‌ పరీక్షను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో, మెయిన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.  

నోటిఫికేషన్‌ ముఖ్యాంశాలు 

‣  ఖాళీల సంఖ్య     : 4,135

‣  విద్యార్హత     : ఏదైనా డిగ్రీ (01.10.21 నాటికి)      

‣  వయసు (జనరల్‌ అభ్యర్థులు)    : 20-30 సంవత్సరాలు 10.11.21 నాటికి)  

‣ దరఖాస్తు ఫీజు    : రూ. 175 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ) రూ.850 (ఇతరులు)

‣ దరఖాస్తుకు చివరి తేదీ    : 10.11.2021

‣ ప్రిలిమినరీ పరీక్ష     : 04/11 డిసెంబర్‌ 2021

‣ మెయిన్స్‌ పరీక్ష     : జనవరి 2022

‣ ఇంటర్వ్యూ     : ఫిబ్రవరి/ మార్చి 2022 

‣ వెబ్‌సైట్‌     : www.ibps.in

ప్రిప‌రేష‌న్ ప్రణాళిక

ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమ్స్‌కు నెలన్నర, మెయిన్స్‌కు సుమారు రెండు నెలలు స‌మ‌యం ఉన్నందున ఇప్పటి నుంచే స్పష్టమైన అవ‌గాహ‌న‌తో ముందుకు సాగాలి. ఈ క్రమంలోనే పరీక్షతీరు, ఏయే స‌బ్జెక్టుల నుంచి ఎలాంటి ప్రశ్నలు వ‌స్తాయి..వాటి స్థాయి ఏమిటి అనే అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు విడివిడిగా కాకుండా రెండింటీకి క‌లిపి సిద్ధమవ్వాలి. మోడ‌ల్, మాక్‌ పరీక్షలు రాయ‌డంపైనే శ్రద్ధ పెట్టాలి. మోడ‌ల్ పరీక్షలు రాయ‌డం వ‌ల్ల ఎంత స‌మ‌యంలో ఎన్ని స‌మాధానాలు గుర్తిస్తున్నారో తెలుస్తుంది. దాన్ని బ‌ట్టి ముందు రోజుల్లో వేగంగా స‌మాధానాలు సాధించేలా ప్రయత్నం చేయ‌వ‌చ్చు. ముఖ్యంగా షార్ట్‌క‌ట్స్ ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తే పరీక్షలో ఎంతోస‌మ‌యం ఆదా అవుతుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్ పరీక్షల్లో కొన్ని స‌బ్జెక్టులు ఒకే త‌ర‌హాలో ఉన్నప్పటికీ ప్రశ్నల్లో తేడా ఉంటుంద‌నే విష‌యం గుర్తుంచుకోవాలి. పరీక్ష సన్నద్ధంలో భాగంగా వీలైనంత మేర ఎక్కువ‌ పాత ప్రశ్న ప‌త్రాల‌ను సాధిస్తే పరీక్షలో కూడా ఎలాంటి హ‌డావుడి, భ‌యం లేకుండా స‌మాధానాలు గుర్తించ‌గ‌లుగుతారు. 

ఇంగ్లిష్ లాంగ్వేజీ: ఈ విభాగంలో మార్కులు సాధించాలంటే ఆంగ్లంపై క‌నీస అవ‌గాహ‌న‌ అవ‌స‌రం. గ్రామ‌ర్‌పై ప‌ట్టు సాధించాలి. సెంటెన్స్ అరెంజ్‌మెట్స్‌, సెంటెన్స్ కరెక్షన్‌, జంబుల్డ్ సెంటెన్సెస్, రూట్ వర్డ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి. కాంప్రహెన్షన్‌ ప్యాసేజీలు ఇచ్చి ప్రశ్నలకు స‌మాధానాలు గుర్తించ‌మంటారు. రోజూ ఏదైనా ఆంగ్ల ప‌త్రిక చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. విధి నిర్వహణలో భాగంగా ఆంగ్లంలో వచ్చే రకరకాల పత్రాలను సరిగా అర్థం చేసుకోడానికి ఇంగ్లిష్ అవసరం. ఇందుకోసమే నియామక పరీక్షల్లో ఈ ప్రశ్నలు ఇస్తారు. 

రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌: అభ్యర్థుల తార్కిక ఆలోచ‌నా, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని ప‌రిశీలించ‌డం ఈ విభాగం ఉద్దేశం. సంఖ్యలు, డిజైన్ల మధ్య సంబంధాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో చూస్తారు. కోడింగ్, డీ-కోడింగ్, అనాలజీ, సిరీస్, డైరెక్షన్స్, సీటింగ్ అరెంజ్ మెంట్స్, రక్తసంబంధాలు, మిర్రర్ ఇమేజెస్, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కంప్యూట‌ర్ విభాగాలు, సీపీయూ, ఇన్‌పుట్‌/అవుట్‌పుట్ డివైజెస్‌తోపాటు ఇంట‌ర్నెట్‌, ఫైల్స్ అండ్ సిస్టమ్స్‌, డేటా క‌మ్యూనికేష‌న్‌, క్యారెక్ట‌ర్స్‌, ఫ్రాక్షన్స్‌, బైన‌రీ అండ్ హెక్సాడెసిమ‌ల్స్ రిప్రజెంటేషన్‌, బైన‌రీ అరిథ్‌మెటిక్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 

జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: తాజా జాతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పై ప‌ట్టు పెంచుకోవాలి. ఇందుకోసం నిత్యం పత్రికలు చ‌దవాలి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, క్రీడా టోర్నమెంట్లు, పుస్తకాలు, రచయితలు, బ్యాంకింగ్, ఆర్థిక నిబంధనలు, అంతర్జాతీయ సంస్థలు, ద్రవ్య, ఆర్థిక విధానాలపై దృష్టి పెట్టాలి. 

డేటా అనాలసిస్‌, ఇంటర్‌ ప్రిటేషన్‌: అభ్యర్థుల్లోని తార్కిక, విశ్లేషనాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు. సమస్యలను పరిష్కరించ‌డంలో సామ‌ర్థ్యం, అంకెలు, సంఖ్యలపై పట్టు, గణిత నైపుణ్యాలను ప‌రిశీలిస్తారు. బార్‌గ్రాఫ్‌, పై చార్ట్‌, లైన్‌గ్రాఫ్స్‌, కేస్‌లెట్‌, డేటా కంపారిజన్‌ తదితర అంశాల నుంచి ఈ విభాగంలో ప్రశ్నలు అడుగుతారు. గణితంలో కీలక భావనలైన కూడికలు, తీసివేతలు, భాగహారాల వంటి వాటిపై పట్టు సాధించాలి. నిష్పత్తులు, శాతాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, లాభ-నష్టాలు మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రాక్టీస్ చేయాలి. 

మూడు పరీక్షలకూ కలిపి ఉమ్మడిగా ప్రిపరేషన్‌  కొనసాగిస్తే సమయం, శ్రమ అన్నీ ఆదా అవుతాయి. 

బ్యాంకుల వారీగా ఖాళీలు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 588, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 620 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 98, యుకో బ్యాంక్‌లో 440, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400, కెనరా బ్యాంక్‌లో 650, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్‌లో 427, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 912 కలిపి మొత్తం 4135 ఖాళీలు భర్తీ చేయనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాళీల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కామన్‌ ప్రిపరేషన్‌ అవసరం

ఐబీపీఎస్‌ క్లర్క్‌, ఎస్‌బీఐ పీఓ, ఐబీపీఎస్‌ పీఓ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాల్సింది.. ప్రిలిమ్స్‌ పరీక్షలన్నీ ఒకే తరహాలో ఉంటాయి. క్లర్క్‌ నుంచి పీఓ పరీక్షల వరకూ ప్రశ్నల స్థాయి పెరుగుతోంది. కానీ సిలబస్‌లో పెద్దగా మార్పుండదు. జనరల్‌/ బ్యాంకింగ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ మినహా ప్రిలిమ్స్‌ మెయిన్స్‌ పరీక్షల్లో ఒకటే విభాగాలు ఉంటాయి. వీటికి కామన్‌ ప్రిపరేషన్‌ అవసరం. 

‣  పరీక్షలన్నీ దాదాపు ఒకే సమయంలో నిర్వహించనున్నారు. ఐబీపీఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు అదే ప్రిపరేషన్‌ ఎస్‌బీఐ పీఓ పరీక్షక్కూడా కొనసాగించాలి. అయితే ఈ పరీక్షల పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి ప్రశ్నల మధ్య తేడా గమనించాలి. 

‣  బ్యాంకింగ్‌ పరీక్షపై ఎలాంటి అవగాహన లేకుండా మెదటిసారిగా పరీక్ష రాసే అభ్యర్థులు ప్రాథమికాంశాలు(బేసిక్స్‌) నేర్చుకోవడం నుంచి సన్నద్ధత ప్రారంభించాలి.

‣  అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, ఆప్టిట్యూడ్‌ టాపిక్‌ల కాన్సెప్ట్‌లు నేర్చుకుంటూ తేలిక, మధ్యస్థ స్థాయి నుంచి హెచ్చు స్థాయిలో ఉండే ప్రశ్నలు బాగా సాధన చేయాలి.

‣  కాన్సెప్ట్‌లు నేర్చుకోవడంపై దృష్టి పెడుతూ ఆపై ప్రశ్నలు వేగంగా సాధన చేసేలా ప్రిపేర్‌ అవ్వాలి. వేగంగా సమస్యలను సాధించే వివిధ పద్ధతులను నేర్చుకోవాలి.

ఎల్‌.పి.టి. సూత్రం తెలుసా?

1.  పరీక్షల్లో విజేతగా నిలవాలంటే ప్రిపరేషన్‌లో LPT సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి. Learning (నేర్చుకోవడం), Practicing (సాధన చేయడం), Test (మాదిరి పరీక్షలు రాయడం) ఒకే సమయంలో జరగాలి. 

2. సబ్జెక్టుల్లోని టాపిక్స్‌ నేర్చుకుని, వాటిలో వివిధ స్థాయుల్లోని ప్రశ్నలను బాగా సాధన చేయాలి. అదే సమయంలో మాదిరి ప్రశ్నపత్రాలు కూడా ప్రతిరోజూ రాయాలి. అప్పుడే వివిధ సబ్జెక్టుల్లో భిన్న స్థాయుల ప్రశ్నలను నిర్ణీత సమయంలో ఏ విధంగా సాధించాలో అలవాటవుతుంది. 

3. నెల రోజుల సమయం సరిపోతుందా లేదా అనే సంశయాన్ని వదిలిపెట్టాలి. ఆ సమయం కచ్చితంగా సరిపోతుందనే సానుకూల దృక్పథంతో సన్నద్ధత మొదలుపెట్టాలి. 

4.  ఒకవేళ ఎస్‌బీఐ పీఓ పరీక్ష సరిగా రాయలేకపోతే ఆ తర్వాత ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష ఉంటుంది. దాని తర్వాత ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్ష కూడా ఉంది. కాబట్టి వాటిని రెట్టింపు ఉత్సాహంతో రాసే అవకాశం ఉంటుంది. 

5. ఒకే సమయంలో మూడు బ్యాంకు నోటిఫికేషన్లు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సరైన ప్రణాళికతో మూడు పరీక్షలకు కలిపి ఉమ్మడిగా సిద్ధమైతే ఏదో ఒక పరీక్షలో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.

డా. జీఎస్‌ గిరిధర్‌ డైరెక్టర్‌, RACE

Posted Date : 21-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌