• facebook
  • whatsapp
  • telegram

సివిల్ సర్వీసెస్ ఎఫ్ఏక్యూ

ఏ టు జ‌డ్ ఎబౌట్ సివిల్స్‌

సివిల్స్ పేరెత్తగానే...రోజుకి 15 గంట‌లు చ‌ద‌వాలి, ఇంగ్లిష్ మీడియంలో రాస్తేనే ప్రయోజ‌నం, ప్రముఖ సంస్థల్లో చ‌దివిన వారికే అవ‌కాశాలు, గ్రామీణ విద్యార్థులు ఇంట‌ర్వ్యూ ఎదుర్కోవ‌డం క‌ష్టం, కోచింగ్ తీసుకున్నవారిదే విజ‌యం...ఇలా ప‌లు ర‌కాల సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఇవ‌న్నీ కేవ‌లం అపోహ‌లు మాత్రమే. మ‌రికొద్ది రోజుల్లో సివిల్ స‌ర్వీసెస్ ప్రక‌ట‌న వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో సందేహాలపై స‌మ‌గ్ర స‌మాచారం....

Frequently Asked Questions
సివిల్స్‌ లక్ష్యం...ఎవరికి సముచితం? ఈ పరీక్షను ఎందుకు రాయాలి?
మనదేశంలో అత్యున్నత హోదాల్లోకి చేరటానికి ఇది ప్రవేశద్వారం! దీంతోపాటు ఉద్యోగభద్రతను ఇస్తుంది. (ప్రైవేటురంగంలో ఇది దుర్లభం). అవసరాల్లో ఉన్న ప్రజలకు సాయపడే అవకాశాన్ని కూడా ఇస్తుంది. వ్యక్తిగత స్థాయిలో మన వనరులు చాలా పరిమితం. కానీ ప్రభుత్వం కోసం పనిచేసేటపుడు ఇతరులకు ఎన్నోవిధాల సహాయపడవచ్చు. సమాజంలో చెప్పుకోదగ్గ మార్పును సాధించవచ్చు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే... ఉద్యోగ భద్రత, చిన్న వయసులోనే అధికార హోదా, ప్రజలకు ఉపకారం చేసే అవకాశం... సివిల్స్‌ రాయటానికి ఇవి మీకు ప్రధాన ప్రేరకాలుగా ఉండాలి.

సమాజంలో ప్రధాన మార్పు రావటానికి ఇదొక్కటే మార్గమా? ఇతర వృత్తుల్లో అది సాధ్యం కాదా?
దేశ భావి తరాలపై గట్టి ప్రభావం కలిగించాలంటే మూడు వృత్తుల వల్ల సాధ్యమవుతుందని అందరూ అంగీకరిస్తారు. రాజకీయాలు, న్యాయశాస్త్రం, సివిల్‌ సర్వీసులు. రాజకీయాంటే కుట్రలుంటాయి. ఒక కీలక హోదాకు చేరుకోవాలంటే చాలా కాలం పడుతుంది. దీనికి రాజకీయ నేపథ్యం, లౌక్యం, ఎత్తుకు పైఎత్తులు వేయటం లాంటి బహుళ నైపుణ్యాలు అవసరం. న్యాయశాస్త్రం విషయానికొస్తే... దానికి విద్యాపరమైన నైపుణ్యాలతో పాటు నేపథ్యం అవసరం. ప్రముఖ స్థానం చేరటానికి చాలాకాలం పడుతుంది. కేవలం సివిల్స్‌ ద్వారానే చిన్నవయసులో అధికార హోదాలభిస్తుంది. 30- 40 ఏళ్ళ వయసుకే సమాజానికి గణనీయమైన సేవ చేసే వీలుంటుంది.

ప్రతి విషయానికీ ప్రజలు అధికారవర్గాన్ని (బ్యూరోక్రసీ) తప్పు పడుతుంటారు. మరి ఆ వ్యవస్థలో భాగమవటం సరైన నిర్ణయమేనా?
ఇతర వృత్తుల్లోలాగే బ్యూరోక్రసీలో కూడా మంచి అధికారులూ, దీనికి భిన్నంగా ఉండేవారూ ఉంటారు. అయితే ఈ వ్యవస్థలో భాగస్వాములై గొప్ప ప్రజోపయోగాలు చేసిన అధికారులున్నారు. ఐటీలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా హైదరాబాద్‌ను తయారుచేయటంలో రెంటాల చంద్రశేఖర్‌, ఆయన బృందం (జె. సత్యనారాయణ, అజయ్‌సాహ్నీ, రణదీప్‌ సుడాన్‌...) కృషి ఉంది. అలాగే ఐ.వి. సుబ్బారావు అమలుచేసిన ప్రధాన మార్పుల మూలంగా తిరుమలలో సామాన్యుడు కూడా దర్శనం తేలిగ్గా చేసుకోగలిగేలా మారింది. నిత్యం పర్యాటకులు పెరిగే తిరుమలలో ఇలాంటి అధికారుల ప్రయత్నాలు లేకుండా పరిస్థితి ఎంత కష్టమో కదా? చెన్నై మెట్రో కోసం టి.వి. సోమనాథన్‌, బెంగళూరు మెట్రో కోసం శివశైలంలు చేసిన కృషి శ్లాఘనీయం. సూరత్‌ అత్యంత పరిశుభ్రంగా మార్చిన అధికారి ఎస్‌.ఆర్‌. రావు పాత్రను విస్మరించలేం. ఇలాంటి అధికారులెందరినుంచో స్ఫూర్తి పొంది ఈ సివిల్‌ సర్వీసు గురించి ఆలోచించాలి.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసేది కలెక్టర్‌ అవడానికో లేకపోతే సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అవటానికో మాత్రమే. ఇది సరైన అభిప్రాయమేనా?
చాలామందికి భావించేది ఇదే. కానీ వాస్తవానికి ఈ పరీక్ష ద్వారా 25 సర్వీసులకు ఎంపికవుతారు. ప్రతి ఒక్క సర్వీసూ విభిన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. దేనికదే ప్రత్యేకతలూ, పరిమితులూ కలిగినది. పరీక్షకు హాజరయ్యేముందే ఇవన్నీ తెలుసుకోవాలి. నిర్దిష్ట సర్వీసులో చేరాలనే ప్రేరణ చాలా కీలకమైనది. అభ్యర్థిని లక్ష్యం వైపు నడిపించేదీ, విజయాన్ని సాధించటానికి వూతమిచ్చేదీ ఇదే!

ఈ పరీక్షను కంబైన్డ్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్ష అని ఎందుకు పిలుస్తారు?
భారత ప్రభుత్వానికి చెందిన దాదాపు 25 సర్వీసుల్లో నియామకం కోసం సివిల్స్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాసేవారు సాంకేతికంగా చూస్తే... వీటిలో ఏ సర్వీసుకైనా ఎంపికవటానికి అవకాశముంది. అభ్యర్థి ర్యాంకు, ఒక్కో సర్వీసులో ఖాళీల సంఖ్యను బట్టి నిర్దిష్ట సర్వీసును కేటాయిస్తారు.

ప్రకటనలో పేర్కొన్న వరస సర్వీసుల ప్రాధాన్యక్రమమా?
లేదు. అది సర్వీసుల ప్రాధాన్యక్రమాన్ని ఏమీ సూచించదు. ఉన్నవాటిలో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ప్రముఖమైనవిగా పరిగణిస్తారు. మిగిలినవన్నీ గ్రూప్‌-ఎ సర్వీసులు. ఒకటి రెండు గ్రూప్‌-బి సర్వీసులను కూడా చేర్చవచ్చు.

ఏ సర్వీసు ... దేనికి?
1. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌: ప్రభుత్వ విధానాల అమలు, పర్యవేక్షణ వీరి విధులు. పేరు ప్రఖ్యాతులు, ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే, అమలు చేసే అవకాశం. జిల్లా, రాష్ట్రం, దేశం- ఈ మూడు స్థాయుల్లోనూ పనిచేయగల ఏకైక సర్వీసు.

2. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌: విదేశాల్లో భారతీయ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత. ప్రధాన విధులు... సత్సంబంధాల పెంపు, విధానాలకు రూపకల్పన. దౌత్యహోదా, దేశ ప్రతినిధిగా పనిచేయగలగటం ద్వారా సంతృప్తి.

3. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌: శాంతిభద్రతల నిర్వహణ, నిఘా, నేరధోరణుల విశ్లేషణ వీరి ప్రధాన విధులు. మరే రంగంలోనూ వీలు కాని అత్యాధునిక ఆయుధాల వినియోగం, గుర్రపుస్వారీ లాంటి నైపుణ్యాలు. ఐదేళ్ళ స్వల్పవ్యవధిలోనే ఎస్పీగా పదోన్నతికి అవకాశం.

4. ఇండియన్‌ రెవిన్యూ (ఇన్‌కంటాక్స్‌) సర్వీస్‌: వ్యక్తుల, కార్పొరేట్‌ సంస్థల పన్ను రిటర్నుల మదింపు వీరి విధి. ఫైనాన్స్‌ నిర్వహణపై లోతైన శిక్షణ లభిస్తుంది. ప్రధాన పట్టణాలూ, నగరాల్లోనే పోస్టింగ్‌. పదవీవిరమణ తర్వాత కూడా చాలా అవకాశాలు.

5. ఇండియన్‌ రెవిన్యూ (కస్టమ్స్‌-సెంట్రల్‌ ఎక్సైజ్‌) సర్వీస్‌: రవాణా తనిఖీ, ఎగుమతి దిగుమతుల డిక్లరేషన్‌, పరోక్ష పన్నుల సేకరణ ప్రధాన విధులు. మాక్రో ఎకనమిక్స్‌పై లోతైన శిక్షణ లభిస్తుంది. ముఖ్య నగరాలూ, పట్టణాల్లోనే పోస్టింగ్‌.

6. రైల్వే ట్రాఫిక్‌/అకౌంట్స్‌ సర్వీస్‌: ట్రాఫిక్‌ నియంత్రణ, రైల్వే ఆస్తులకు రక్షణ, సిబ్బంది నియామకం, అకౌంట్ల నిర్వహణ వీరి విధులు. దేశవ్యాప్తంగా పర్యటించే అవకాశం. గృహ, వైద్య సేవలు, ప్రయాణాల్లో రాయితీలు మొదలైనవి లభిస్తాయి.

7. ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌: తమ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాలు బాగా పనిచేసేలా చర్యలు తీసుకోవటం ముఖ్య విధి. గ్రామీణ భారతంతో అనుసంధానమయ్యే అవకాశం. నిర్వహణ విషయంలో స్వేచ్ఛ, డెప్యుటేషన్‌పై ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో పనిచేసే వీలు.

సివిల్స్‌ నోటిఫికేషన్‌ ఏటా ఒకే సమయానికి వస్తుందా?
గతంలో సివిల్స్‌ పరీక్షకు ఆరునెలల ముందు యూపీఎస్‌సీ ప్రకటన వెలువరించేది. పాలనా సంస్కరణల కమిషన్‌ (ఏఆర్‌సీ) పరీక్ష నిర్వహణ వ్యవధిని తగ్గించాలని సిఫార్సు చేసింది. దీంతోపాటు ఈ-దరఖాస్తు రూపంలో వచ్చిన సాంకేతిక సౌలభ్యం మూలంగా కూడా నిర్వహణ వ్యవధిని యూపీఎస్‌సీ తగ్గించగలిగింది. కాబట్టి వచ్చే ఏడాది నుంచీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్‌ మే నెలలోనే విడుదలవుతుంది.

దరఖాస్తును పోస్టు ద్వారా పంపవచ్చా?
లేదు. ఈ-మెయిల్‌ ద్వారానే పంపాల్సివుంటుంది.

ఈ ఏడాది అమలయ్యే వయసు మినహాయింపులు కొనసాగుతాయా? ఇవి వచ్చే రెండేళ్ళకే పరిమితమా?
మొదట ప్రకటించినపుడు పాత పరీక్ష పద్ధతిలో రాసిన సీనియర్‌ అభ్యర్థుల డిమాండ్ల మేరకు రెండేళ్ళకు మాత్రమే వర్తించే తాత్కాలిక మినహాయింపు అనే భావించారు. కానీ ఇప్పుడిది శాశ్వత అంశంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి అన్ని కమిషన్లూ గరిష్ఠ వయః పరిమితి 28 సంవత్సరాలే ఉండాలని సిఫార్సు చేశాయి. కానీ గరిష్ఠ పరిమితిని తగ్గించే ప్రయత్నం క్లిష్టమైన అంశం. దీన్ని ఏ ప్రజా ప్రభుత్వమూ చేయలేదు కాబట్టి ఇప్పుడున్న గరిష్ఠ పరిమితి కొనసాగుతుందని భావించవచ్చు.

ఇలాంటి గరిష్ఠ వయసు పరిమితులు గతంలోనూ ఉన్నాయా?
ఒక్క 1992లో మాత్రం 33 సంవత్సరాలకు పెంచారు. కానీ ప్రయత్నాల సంఖ్యను మాత్రం అప్పుడు ఐదుకే ఉంచారు. ఆరు ప్రయత్నాలకు పెంచటం ఇదే తొలిసారి!

దరఖాస్తు చేయటానికి డిగ్రీలో కనీస మార్కులను నిర్దేశించారా?
లేదు. యూపీఎస్‌సీ ఎలాంటి కనీస మార్కులనూ ప్రస్తావించలేదు. గుర్తింపు పొందిన డిగ్రీలో ఉత్తీర్ణత సాధిస్తే ఎవరైనా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లు కాబోయేవారు (ఫైనలియర్‌ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసేవారు) కూడా అర్హులే!

స్థూలంగా పరీక్ష పద్ధతి ఎలా ఉంటుంది?
సివిల్స్‌ పరీక్షను మనం మూడు దశలుగా చెప్పుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్‌.- సీశాట్‌గా వ్యవహరించే ప్రిలిమినరీలో రెండు పేపర్లుంటాయి. ఒకటి జనరల్‌స్టడీస్‌; రెండోది ఆప్టిట్యూడ్‌.- మెయిన్‌ పేపర్లో 9 పేపర్లుంటాయి. రెండు క్వాలిఫైయింగ్‌ (అర్హతా) పేపర్లు, ఒక ఎస్సే పేపర్‌, జనరల్‌స్టడీస్‌పై నాలుగు పేపర్లు, ఎంచుకున్న సింగిల్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుపై రెండు పేపర్లు.- పర్సనాలిటీ టెస్టు (ఇంటర్‌వ్యూ)లో కనీస అర్హతా మార్కులేమీ ఉండవు.

ప్రిలిమినరీ పరీక్ష స్వభావం, తీరు ఎలా ఉంటుంది?
ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి.
1) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌- 1: చరిత్ర నుంచి భౌగోళికశాస్త్రం, జనరల్‌ సైన్స్‌ వరకూ విభిన్నమైన అంశాలుంటాయి. దీనిలో 100 ఆబ్జెక్టివ్‌ టైపు బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కు చొప్పున తగ్గిస్తారు.

2) జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2: అభ్యర్థి అభిరుచి ఏ తీరులో ఉందో (ఆప్టిట్యూడ్‌) పరీక్షించే పేపర్‌ ఇది. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. 80 ఆబ్జెక్టివ్‌ టైపు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికీ 2.5 మార్కులు. తప్పు సమాధానానికి 0.33 మార్కును తగ్గిస్తారు.

రుణాత్మక (నెగిటివ్‌) మార్కింగ్‌ హేతుబద్ధత ఏమిటి?
2007 సంవత్సరంలో ఈ నెగిటివ్‌ మార్కులను ప్రవేశపెట్టారు. జవాబులు రాసేటపుడు సబ్జెక్టు ఏమీ తెలియనప్పటికీ ఊహించి ఏదో ఒక జవాబు గుర్తించే అవకాశముంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేనట్లయితే ఆ వూహాత్మక సమాధానాలకు మార్కులు వస్తాయి. తప్పయినా నష్టం ఉండదు.
ప్రిలిమినరీ పరీక్ష ఉద్దేశమే సమర్థులైన, సివిల్‌ సర్వీసులపై శ్రద్ధ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయటం. కాబట్టి తప్పు జవాబులకు నెగిటివ్‌ మార్కులను ప్రవేశపెట్టాల్సివచ్చింది. దీనివల్ల బాగా పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం! పైపైన చదివి, కేవలం జవాబులను ఊహించి రాసే అభ్యర్థులను తొలగించే వీలూ ఏర్పడుతుంది. సారాంశంలో అంత శ్రద్ధలేని అభ్యర్థులను పోటీలోంచి తొలగించటం ఈ నెగిటివ్‌ మార్కుల వల్లనే సాధ్యమవుతుంది. ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకుండా వదిలివేస్తే అది అభ్యర్థి నిజాయతీకి గుర్తు; తనకు తెలియని జవాబును తెలుసని చెప్పుకోవటం లేదు. అందుకని.. ఇలా ప్రశ్నను వదిలివేసినందుకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు!

ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్‌కు అర్హత పొందుతారు?
ఈ కనీస మార్కు అనేది పోటీ స్థాయిని బట్టి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే... జనరల్‌ అభ్యర్థులు 230/400 మార్కులు తెచ్చుకుంటే మెయిన్స్‌కు అర్హులవుతారని చెప్పొచ్చు.

 ప్రిలిమినరీకి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయా?
చాలామంది అభ్యర్థులు ప్రిలిమినరీ స్థాయిలో రిజర్వేషన్లు వర్తించవనే పొరబాటు అభిప్రాయంతో ఉన్నారు. అన్ని వర్గాలకూ తగిన ప్రాతినిధ్యం ఉండేలా వ్యవహరించే రాజ్యాంగబద్ధ బాధ్యత యూపీఎస్‌సీకి ఉంది. అందుకని రిజర్వేషన్లు వర్తిస్తాయి.

పోటీ చాలా అధికంగా ఉంటుందట. ఈ రిస్కు తీసుకోవటం మంచిదేనా?
మేలైనది ఏది ఉన్నా దానికి పోటీ తప్పనిసరిగా ఉంటుంది కదా? ఉన్నత హోదాకు చేరుకోవటానికి దేశ ప్రజల్లో అత్యధికులకు ఇదే ప్రవేశ ద్వారం. దీంతో ఈ పరీక్షపై అవగాహనా, తగిన శక్తియుక్తులూ ఉన్న యువత దీనిపై ఆసక్తి చూపుతారు. అయితే 4.5 లక్షలమంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తారు కానీ, వాస్తవానికి రాసేది 2.5 లక్షలమంది మాత్రమే!

సగం మందే రాయటానికి కారణం?
21 ఏళ్ళు నిండిన గ్రాడ్యుయేట్లు సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తు చేయటానికి అర్హులు. అందుకే ఎంతోకొంత ఆసక్తి ఉన్న ప్రతివారూ యథాలాపంగా దరఖాస్తు చేసేస్తారు. కానీ వీరిలో చాలామంది పరీక్ష రాయరు. ఏదో సరదాకు దరఖాస్తు చేయటమో, పూర్తిగా సంసిద్ధం కాకపోవటమో దీనికి కారణం. పరీక్ష రుసుము కూడా తక్కువ కాబట్టి ఎంతోమంది దరఖాస్తు పెడుతుంటారు. రాసే 2.5 లక్షలమందిలో కూడా పరీక్షపై నిజమైన శ్రద్ధ ఉండే అభ్యర్థులు లక్షమంది మాత్రమే! వాస్తవమైన పోటీ వీర మధ్యనే!

నేను సాధారణ విద్యార్థిని. నా చదువంతా సగటుగానే సాగింది. డిగ్రీ ఎలాగోలా పూర్తిచేశాను. సివిల్స్‌ పరీక్షలో నాకు విజయావకాశం ఉంటుందా?
ఈ పరీక్షలో నెగ్గటానికి అసాధారణమైన తెలివితేటలేమీ అవసరం లేదు. మీ తెలివితేటల కంటే మీ సహనం, పట్టుదలలను ఎక్కువగా పరీక్షిస్తుంది సివిల్స్‌. ఇది అకడమిక్‌ పరీక్ష కాదు. కనీస లోకజ్ఞానం, పరిజ్ఞానం దీనికి చాలా అవసరం. ఇదంతా విద్యాపరంగా మాత్రమే రాదు. అసలీ పరీక్ష ఎందుకు రాయాలనుకుంటున్నారనే దానిపై స్పష్టత ఉండాలి. దీనిలో విజయవంతం కావటానికి మొదట కావాల్సింది
మొట్టమొదట- సగటు విద్యార్థిని అనో, సగటు కంటే కిందిస్థాయి అనో, అసాధారణ విద్యార్థిని అనో ముద్ర వేసుకోకూడదు మీకంటే ఈ పరీక్ష గురించి బాగా తెలిసినవారి సాయం తీసుకోవాలి. వారినుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరుల బలహీనతలూ, లోపాలపై కాకుండా వారి బలాలపై దృష్టి పెట్టండి. మీకు సౌకర్యంగా ఉండే స్థలం (ఇల్లు, ఊరు, బస్తీ) వదిలి మీలాంటి జీవితాశయాలున్నవారుండే చోటుకు మారటం దీనిలో భాగమే! మార్గదర్శనం. ఈ పరీక్షపై చక్కని అవగాహనఉన్నవారి సూచనలు పొందటం. అది స్నేహితులైనా కావొచ్చు; ఉపాధ్యాయులైనా కావొచ్చు. పరీక్ష రాసి దాని గురించి తెలుసుకోవటం. దీనివల్ల వాస్తవం ఏమిటన్నది స్వానుభవంతో గ్రహించవచ్చు.

‣ సివిల్స్‌కు ఎన్ని సంవత్సరాల ప్రిపరేషన్‌ అవసరం?
మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పాసవ్వొచ్చు. మెయిన్స్‌లో నెగ్గటానికి కనీసం రెండు ప్రయత్నాలు అవసరం కావొచ్చు. గణాంకాలను పరిశీలిస్తే... రెండో ప్రయత్నంలోనో, మూడోప్రయత్నంలోనే విజేతలుగా నిలిచినవారే ఎక్కువమంది. అంటే కనీసం రెండు సంవత్సరాల సంసిద్ధత! అయితే తొలి ప్రయత్నంలో ఎవరూ విజేతలు కాలేరని కాదు దీని అర్థం. ఇలాంటివారూ ఉంటారు.
చాలామంది విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ పాత విద్యాపరమైన రికార్డులను బట్టి విజయావకాశాల శాతాన్ని సాధారణీకరిస్తుంటారు. 'ఐఐటీ ప్రవేశపరీక్షలో తొలి ప్రయత్నంలోనే ర్యాంకు తెచ్చుకున్నా. అలాంటపుడు సివిల్స్‌లో మొదటిసారే ఎందుకని నెగ్గలేను?' అంటుంటారు. చాలామందికి ఒకసారి పరీక్ష రాశాక గానీ ఈ పరీక్షలో నెగ్గటానికి ఏమేం అవసరమో, రాసే తీరులో ఏ మార్పులు అవసరమో బోధపడవు. బహుశా సహనాన్నీ, చిక్కుల్నుంచి త్వరగా పుంజుకోవడాన్నీ కూడా సివిల్స్‌ పరీక్షిస్తుంది. 35 ఏళ్ళ సర్వీసులో రెండేళ్ళ కాలం ఏపాటి?

సరే, పరీక్ష రాయటానికి నిశ్చయించుకున్నాను. ఎలా మొదలుపెట్టాలి?
మొదట సిలబస్‌ను సేకరించండి. ఈ దశలో మెయిన్స్‌ పరీక్ష గురించి పట్టించుకోవద్దు. కేవలం ప్రిలిమ్స్‌ కోసం సిలబస్‌ను ఒకచోటకు చేర్చండి. మీరు శ్రద్ధ చూపాల్సిన అంశాలను గుర్తించండి. తర్వాత మీరు ప్రత్యేకించి పట్టించుకోనక్కర్లేని అంశాలేమిటో కూడా గుర్తించండి.

ప్రిలిమినరీలో కొత్త పరీక్షావిధానం నుంచి ఏం గ్రహించాలి?
ఇది రెండేళ్ళ క్రితమే అమల్లోకి వచ్చింది. ఫలితాల విశ్లేషణ ఏం చెబుతోందంటే- అర్హత పొందిన ఎక్కువమంది మంచి ఇంగ్లిష్‌ నేపథ్యం ఉన్నవారని. కొత్త విధానంలో ఈ భాషకున్న ప్రాముఖ్యాన్ని ఇది సూచిస్తోంది. మూడు నాలుగు నెలల కోచింగ్‌ వల్ల సాధించగలిగేది కాదు ఆంగ్ల భాషాజ్ఞానం. దానికి పునాది ఏర్పరచుకోవాలి. గ్రామర్‌ పుస్తకాలనుంచి మొదలుపెట్టాలి. లేఖనా (రైటింగ్‌) నైపుణ్యాలు పెంచుకోవటం, ఇంగ్లిష్‌లో జనరల్‌ పుస్తకాలు చదువుతుండటం చేయాలి. కాల్పనిక సాహిత్యం (ఫిక్షన్‌)తో ప్రారంభించవచ్చు. ఇవి ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి ఏదో పరీక్ష కోసం చదువుతున్నట్టు అన్పించదు. నిఘంటువు (డిక్షన్‌రీ) పక్కన పెట్టుకుని కొత్త మాటలకు అర్థాలు గ్రహించాలి. ఇక్కణ్నుంచి వార, మాస పత్రికలకు పఠనం విస్తరించాలి. తర్వాత కరంట్‌ అఫైర్స్‌తో ఉన్న జనరల్‌ పుస్తకాలను చదవటం కొనసాగించాలి. సబ్జెక్టు ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ చదవటం ఆపవద్దు. నిఘంటువును విస్తృతంగా ఉపయోగిస్తుండాలి. ఇప్పుడు సొంతంగా రాయటం మొదలుపెట్టాలి. మీకంటే మెరుగ్గా ఇంగ్లిష్‌ వచ్చినవారిని మీ రాతలను సరిచేయమని అడగాలి. పొరపాట్లను సవరించుకోవాలి. సివిల్‌సర్వీసులకు విజయవంతంగా చేర్చే మార్గంలో కొద్దికాలానికే మీరు అడుగుపెట్టగలుగుతారు!

మొదటిసారి పరీక్ష రాసినవారి అనుభవాలు ఎలా ఉంటాయి?
సాధారణంగా మొదటిసారి సివిల్స్‌ పరీక్ష రాసేవారు తమ ప్రయాణాన్ని అతి విశ్వాసంతో ప్రారంభిస్తారు. అంతకుముందు రాసిన పరీక్షల్లో చాలా బాగా ప్రతిభ చూపివుండటమే దీనికి కారణం. మొదటి కొన్ని నెలల తర్వాత ఈ పరీక్ష విభిన్నమని గుర్తిస్తారు. ప్రిలిమినరీలో అర్హత పొందలేకపోయానని తెలిసినపుడు మొదటి పాఠం అనుభవంలోకి వస్తుంది. తొలి ప్రయత్నంలోనే అర్హత పొందగలిగేది దేశవ్యాప్తంగా రెండు శాతం మాత్రమే! దీనికి చాలా కారణాలు. విద్యానేపథ్యం, ప్రిపరేషన్‌కు తీసుకున్న వ్యవధి, కొంత అదృష్టం (అనుకోని అనుకూలత) కూడా!

సివిల్స్‌ విజేతలు ఏ పంథాను అనుసరించివుంటారు?
సుస్పష్టత: ప్రారంభించేముందు సాధించాల్సిందేమిటో రాసుకోవాలి. మళ్ళీమళ్ళీ వాటిని రాయాలి. వైఫల్యానికీ, ప్రేరణలేమికీ ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి- లక్ష్యాలపై అస్పష్టత. మీకు కావాల్సింది కేవలం ఉద్యోగభద్రతేనా? లేకపోతే ఎక్కడికు వెళ్ళినా ప్రజల నుంచి వచ్చే గుర్తింపా? సమాజానికి మేలు చేసి, జనం మనసుల్లో నిలిచిపోవాలనే ఆకాంక్ష ఉందా? ఉద్యోగ భద్రతను మించిన కారణాలుంటేనే ప్రేరణకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
ముందస్తుగా: టైమ్‌టేబుల్‌ని ఎలా తయారుచేసుకోవాలనేది చాలామంది అభ్యర్థుల ప్రశ్న. కాగితమ్మీద ఆలోచించమని నేను సూచిస్తుంటాను. ప్రణాళికలో మీరు వెచ్చించే ప్రతి నిమిషమూ అమలులో ఐదు పదినిమిషాలను ఆదాచేస్తుంది. అందుకే మొదట మీకున్న వ్యవధిని గంటలుగా రాసి, ప్రతి గంటలో ఏమేం చేయాలనుకుంటున్నారో రాతపూర్వకంగా నమోదు చేయండి. ఇలా చేస్తే పనులూ పూర్తవుతాయి; సమయపాలనా సాధ్యమవుతుంది.
ఆరంభానికి ముందు: మొదలుపెట్టేముందే అవసరమైనవన్నీ దగ్గర ఉంచుకోవాలి. అన్ని పేపర్లు, రెఫరెన్స్‌ సమాచారం, వర్క్‌ మెటీరియల్స్‌ మొదలైనవన్నీ. చదవటానికి కూర్చుని దేనికోదానికోసం లేచి వెళ్ళటం ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కూర్చున్న అరగంట గడిచేదాకా ఏ పనికోసమూ లేవకూడదని నిశ్చయించుకోవాలి.
విలువను బట్టి: విస్తారమైన సిలబస్‌లో ప్రతి సూక్ష్మ అంశమూ చదవటం సాధ్యం కాదు కాబట్టి తక్కువ విలువైనవాటిని కావాలనే వదిలెయ్యవచ్చు. దీంతో నిజంగా విలువైనవాటికి అధిక సమయం వెచ్చించవచ్చు. దీన్ని creative procrastination అనొచ్చు.
అత్యవసరత: పఠనీయం అంశాలను చకచకా అధ్యయనం చేసి, గ్రహించి, వేగంగా పూర్తిచేసే అలవాటు చేసుకోవాలి. పఠనం త్వరగానూ, అర్థవంతంగానూ ఉండేలా జాగ్రత్తపడాలి.
స్వీయ స్ఫూర్తి: ప్రతి సందర్భంలోనూ సానుకూలత చూడగలగాలి. సమస్యపై కాకుండా పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. నిరంతరం నిర్మాణాత్మకంగా, ఆశావహంగా ఉండాలి.

దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశాను. నేను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి అర్హుడినేనా?
డిగ్రీ దూరవిద్యలో చదివినవాళ్లు సివిల్స్ రాయడానికి అర్హులే. మీరు చదివిన డిగ్రీకి గుర్తింపు ఉంటేచాలు. సివిల్స్ రాసుకోవచ్చు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు కూడా సివిల్స్ రాయడానికి అర్హులే.

టెన్త్ తర్వాత ఇంటర్ చదవకుండా డైరెక్ట్‌గా డిగ్రీ చదివాను. సివిల్స్ రాయడానికి అర్హత ఉందా?
పదోతరగతి తర్వాత ఇంటర్ లేకపోయినా పర్వాలేదు. డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఇతర ఏ విద్యార్హతలూ లేకపోయినప్పటికీ కేవలం డిగ్రీ ఉంటే చాలు సివిల్స్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షకు దరఖాస్తు చేసుకుని హాజరుకాకపోతే ఒక అటెంప్ట్ వృథా అయినట్టేనా?
ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకుని పరీక్షకు హాజరుకాకపోతే మీ అటెంప్ట్ వృథా కానట్టే. అయితే ప్రిలిమ్స్‌లో పేపర్-1 పరీక్షకు హాజరై, పేపర్-2కు హాజరుకాకపోయినా మీరు అటెంప్ట్ చేసినట్టుగానే పరిగణిస్తారు. ఇలాంటి సందర్భంలో మాత్రం మీ అటెంప్ట్ వృథా అయినట్టే.

సివిల్స్ రాయడానికి ఉండాల్సిన సాధారణ విద్యార్హతలేంటి?
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉంటేచాలు సివిల్స్ రాయొచ్చు. కోర్సు ఆఖరు సంవత్సరం చదువుతున్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్షను ఎన్నిసార్లు రాయొచ్చు?
తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ అభ్యర్థులు 6, ఓబీసీలైతే 9, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్త్లెనా సివిల్స్ రాయొచ్చు.

కేటగిరీల వారీ గరిష్ఠ వయోపరిమితి వివరాలు తెలపండి?
తాజా నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లకు పెంచారు. దీని ప్రకారం జనరల్ అభ్యర్థులు 32, ఓబీసీలైతే 35, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవాళ్లు 37 ఏళ్ల వరకు సివిల్స్ రాసుకోవచ్చు.

దరఖాస్తు నింపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సివిల్స్ ఆన్‌లైన్ దరఖాస్తు నింపే క్రమంలో పుట్టిన తేదీ వివరాలను సరిగా నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో మార్పులకు అవకాశం ఉండదు. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ముందుగా మీరు నమోదు చేసుకునే తేదీనే యూపీఎస్‌సీ కచ్చితమైన పుట్టిన తేదీగా పరిగణిస్తుంది.

ఆప్షనల్ సబ్జెక్టును మార్చుకునే అవకాశం ఉంటుందా?
ప్రిలిమినరీ పరీక్ష కోసం వివరాలు నింపే క్రమంలో మెయిన్స్ ఆప్షనల్ సబ్జెక్టు గురించి అడుగుతారు. అయితే దీన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తే మళ్లీ విడిగా మెయిన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు నచ్చిన ఆప్షనల్ సబ్జెక్టును ఎంచుకోవచ్చు. దీని తర్వాత దశలో మార్చుకోవడం మాత్రం సాధ్యం కాదు.

మెయిన్స్ పరీక్షలు తెలుగులోనూ రాయొచ్చా?
సివిల్స్ మెయిన్స్ పరీక్షలన్నీ తెలుగులోనూ రాసుకునే వెసులుబాటు ఉంది. అయితే ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోనే ఉంటుంది. ప్రశ్నలను అర్థం చేసుకోగలిగితే చాలు.

తెలుగులో మెయిన్స్ రాయడం వల్ల ప్రతికూలతలేమిటి?
తెలుగులో స్టడీ మెటీరియల్ లభ్యత తక్కువగా ఉంటుంది. ఇంగ్లిష్ వ్యాసాలు చదివి అర్థం చేసుకుని తెలుగులో నోట్సు రాసుకోగలిగే సామర్థ్యం ఉండాలి.

తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి విజయం సాధించినవాళ్లు ఉన్నారా?
మరీ ఎక్కువ కాకపోయినా ఇలాంటి వాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. గతంలో భానుప్రకాష్ అనే అభ్యర్థి తెలుగు మీడియంలో పరీక్ష రాసి అఖిల భారత స్థాయిలో 9వ ర్యాంకు సాధించారు.

ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడవచ్చా?
ఇంటర్వ్యూ ముఖ్య లక్ష్యం మీకు అంగ్ల పరిజ్ఞానం ఉందా లేదా పరీక్షించడానికి కాదు. మీ భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. కాబట్టి తెలుగులోనూ మాట్లాడవచ్చు. మీ సమాధానాన్ని ఇంటర్వ్యూ బోర్డుకు చెప్పడానికి మధ్యలో సంధానకర్త ఉంటారు.

నేను మొదటి ప్రయత్నంలో డిగ్రీ పాస్ కాలేదు. రెండేళ్ల తర్వాత దాన్ని పూర్తిచేశాను. ఈ అంశం ప్రతిబంధకంగా మారుతుందా?
అలా భయపడాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్, ఇంటర్వ్యూల్లో మీ ప్రతిభనే కొలమానంగా తీసుకుంటారు. మీ అకడమిక్ రికార్డుతో పనిలేదు.

సాధారణ కళాశాలల్లో చదివే అభ్యర్థులతో పోల్చితే ఐఐటీలు, ఐఐఎంల్లో చదివినవాళ్లకు ప్రాధాన్యం ఉంటుందా?
ఇలా భావించడం కేవలం అపోహ మాత్రమే. ప్రముఖ సంస్థల్లో డిస్టింక్షన్ మార్కులతో డిగ్రీలు పూర్తిచేసి, సివిల్స్‌లో వైఫల్యం చెందినవాళ్లూ ఉన్నారు. అలాగే అట్టెసరు మార్కులతో పెద్దగా పేరూ, ఊరూ లేని కళాశాలల్లో చదివి విజయం సాధించినవాళ్లూ ఉన్నారు. కేవలం పరీక్ష, ఇంటర్వ్యూల్లో మీరు చూపిన ప్రతిభనే ఎంపికకు కొలమానంగా తీసుకుంటారు. మీరు చదివిన సంస్థ స్థాయి ఎలాంటిదో తెలుసుకోవాల్సిన అవసరం యూపీఎస్‌సీకి లేదు.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌