• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ చేస్తూ... సివిల్స్‌పై గురిపెట్టాలంటే?

ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి?

సివిల్‌ సర్వీసెస్‌ను లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నవారిలో ఇంజినీరింగ్‌ నేపథ్యమున్న విద్యార్థులే ఎక్కువమంది. మానవ శాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఉండే ఈ పరీక్షలో సాంకేతిక అభ్యర్థుల హవా విలక్షణమైనదే! ఇంజినీరింగ్‌ విద్యార్థులు సివిల్స్‌లో విజయవంతం కావాలంటే.. డిగ్రీ స్థాయినుంచే ఎలా ముందుకు సాగాలో, ఏ వ్యూహం అనుసరించాలో తెలుసుకుందాం!

తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కువమంది విద్యార్థుల ప్రాధాన్యం సాంకేతిక కోర్సులకే. ఇటీవల జరిగిన అధ్యయనం దీన్నే ధ్రువీకరిస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఏటా సుమారు 1,50,000 మంది ఇంజినీరింగ్‌ను ఎంచుకుంటన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సివిల్స్‌కు అర్హత సాధిస్తున్నవాళ్లలో 65 శాతం మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులే!  

ఇంజినీరింగ్‌ చదువుతోన్న ఎంతోమంది విద్యార్థులు సివిల్స్‌పై మొగ్గు చూపడానికి రెండు కారణాలున్నాయి. 

1) ఇంజినీరింగ్‌ చదవడం వల్ల ప్రొఫెషనల్‌ డిగ్రీ చేతికి వస్తుంది. ఇది వృత్తిపరమైన ఎన్నో అవకాశాలకు మార్గాన్ని చూపుతుంది. 

2) అధికారం చెలాయించే స్థితిలో ఉండి ఎంతోమంది ప్రజలను సానుకూలంగా ప్రభావితం చేయగల స్థాయికి చేరుకోవడం. 

ప్రజలంతా ఏదో ఒకవిధంగా ప్రభుత్వ విధానాల వల్ల ప్రభావితమవుతున్నారనే విషయంలో నేటి యువతకు స్పష్టమైన అవగాహన ఉంది. నచ్చిన విధంగా జీవించడం, ఇష్టమైన విద్యను అభ్యసించడం లేదా వ్యాపారం చేయడం, దేశంలోని ఏ ప్రదేశంలోనైనా స్వేచ్ఛగా జీవించే అవకాశం... ఇలా జీవితంలోని ప్రతి దశలోనూ ప్రభుత్వ ప్రభావం ఉంటోంది. ప్రభుత్వ పాత్ర గురించి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాళ్లు కూడా.. కరోనా మహమ్మారి విజృంభించిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని గుర్తించే ఉంటారు. ప్రభుత్వంలో సివిల్‌ సర్వీసెస్‌కు ముఖ్య ప్రాధాన్యం ఉంటుందనేది తెలిసిందే. అందుకే ఎంతోమంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ ఏ విభాగంలో చేసినప్పటికీ సివిల్‌ సర్వీసెస్‌లోకి ప్రవేశించాలనే అభిలాషతో ఉంటున్నారు. 

సివిల్స్‌లో విజయం సాధించిన చాలామంది పరీక్షలో నెగ్గడానికి రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటున్నారు. పరీక్ష పరిధి విస్తృతంగా ఉండటం వల్ల. అధ్యయనం చేయాల్సిన అంశాలు ఎక్కువ. ప్రతి అభ్యర్థీ త్వరగా సర్వీస్‌ సాధించాలని కోరుకుంటారు. అందుకని గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న సమయంలోనే దీని కోసం సన్నద్ధతను మొదలుపెడతారు. ఇదే సరైన వ్యూహం. 

ఆప్షనల్‌ ఎంపిక విధానం

క్లుప్తంగా చెప్పాలంటే అభ్యర్థి.. ఒక ఆప్షనల్, జనరల్‌ స్టడీస్‌ పేపర్, జనరల్‌ ఎస్సే పేపర్‌లకు సన్నద్ధం కావాలి. దానికి ప్రణాళిక ఎలా ఉండాలో చూద్దాం. 

గ్రాడ్యుయేషన్‌లో చదువుతోన్న సబ్జెక్టులనే  ఆప్షనల్స్‌గా ఎంచుకోవచ్చా? అంటే.. ఎంచుకోవచ్చనే చెప్పొచ్చు. విద్యా ప్రతిభను పాలనలోకి బదలాయించాలనే సూత్రం మీదే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షను రూపొందించారు. కాబట్టి యూపీఎస్‌సీ నిర్దేశించిన ఆప్షనల్స్‌ జాబితాలో చాలా సబ్జెక్టులను నిర్దేశించారు (టూరిజం, కంప్యూటర్స్‌ లాంటి ఒకేషనల్‌ కోర్సులు తప్ప). సాధారణంగా సివిల్స్‌కు ముందుగానే సన్నద్ధం అయ్యేటప్పుడు... గ్రాడ్యుయేషన్‌లో చదువుతోన్న సబ్జెక్టులనే ఆప్షనల్స్‌గా ఎంచుకోవడం మంచిది. ఇది ముందు దశలోనే ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు గ్రాడ్యుయేషన్‌లో దృఢమైన పునాదినీ వేస్తుంది. ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌నే ఆప్షనల్‌గా తీసుకున్నట్లయితే.. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. 

ఇంజినీరింగ్‌తో సంబంధం లేని ఆప్షనల్స్‌?

డిగ్రీ సబ్జెక్టుల నేపథ్యంతో సంబంధం లేకుండా ఆప్షనల్‌ను ఎంచుకోవచ్చు. నిజానికి అలా చేస్తున్నవారే ఎక్కువమంది. ఇంజినీరింగ్‌ నేపథ్యమున్న అభ్యర్థుల్లో 85 శాతం మంది హ్యుమానిటీస్‌ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకుంటున్నారు. అంటే సివిల్స్‌కు సిద్ధమయ్యేటపుడు తమ డిగ్రీ సబ్జెక్టులకు కాకుండా ఇతర ఆప్షనల్స్‌ను ఎంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు.  

ఇలా చేయడానికి ప్రాథమిక కారణం.. ఆ సబ్జెక్టులో స్టడీ మెటీరియల్‌ అందుబాటులో లేకపోవడమే. అంతేకాకుండా హ్యుమానిటీస్‌ ఆప్షనల్స్‌తో ఎక్కువ స్కోరింగ్‌ సాధ్యమనే నమ్మకం. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ.. లాంటి ఆప్షనల్స్‌ జనరల్‌ స్టడీస్‌లో పునరావృతం కావడమూ ఈ నిర్ణయానికి దోహదపడుతోంది.  

గ్రాడ్యుయేషన్‌తో సంబంధంలేని ఆప్షనల్‌ను ఎంచుకోవాలనుకుంటే డిగ్రీ చివరి సంవత్సరం నుంచే సన్నద్ధత మొదలుపెట్టాలి. మొదటి మూడు సంవత్సరాలూ ఇంజినీరింగ్‌లోని సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టడం మంచిది. 

ఈ నాలుగూ ముఖ్యం

1.  ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం రోజుల నుంచీ ఒక జాతీయ దిన పత్రికనూ, ఒక ప్రాంతీయ దినపత్రికనూ చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరెంట్‌ అఫైర్స్‌ మీద పట్టు సాధించగలుగుతారు. 

2.  ప్రాథమిక పాఠ్య పుస్తకాలను చదివి మీకు అవగాహన ఉన్న అంశాలపై మరింత పట్టు పెంచుకోవచ్చు. ఫలానా సబ్జెక్టును సిలబస్‌లో ఎందుకు చేర్చారో అర్థం చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరంలోనే సబ్జెక్టును అర్థం చేసుకోవాలి. రెండో సంవత్సరంలో అదే సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయాలి. ఈ విధానం సివిల్స్‌ పరీక్షకు అవసరమైన సబ్జెక్టు స్పష్టతకు తోడ్పడుతుంది.

3.  ఏ మాత్రం అవగాహన లేని విషయాలను ప్రాథమిక స్థాయి నుంచి మొదలుపెట్టి ఉన్నత స్థాయి వరకు తెలుసుకోవాలి. 

4.  ఆ తర్వాతి దశలో ఆప్షనల్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకుని సన్నద్ధతను ప్రారంభించాలి.

మూడు దశల్లో... 

నాలుగేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సు చదువుతూనే కింది మార్గాల ద్వారా సివిల్స్‌కు ఎలా సన్నద్ధం కావాలో చూద్దాం. 

పరీక్ష విధానంపై అవగాహన: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష గురించి ప్రతి విద్యార్థికీ స్థూలంగా అవగాహన ఉంటుంది. కానీ ఎక్కువమంది పరీక్ష విధానంపై తగినంతగా దృష్టి కేంద్రీకరించరు. పరీక్షలో ప్రిలిమినరీ (ఇది గేట్‌కీపర్‌ లాంటిది), మెయిన్‌ (డిస్క్రిప్టివ్‌ విధానం), చివరిగా ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ఈ మౌఖిక పరీక్ష అభ్యర్థి వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తుంది. 

సబ్జెక్టుల తీరు గ్రహించడం: ప్రిలిమినరీలో ఉండే సబ్జెక్టులు మెయిన్‌లోనూ పునరావృతం అవుతాయి. మరికొన్ని సబ్జెక్టులు అదనంగా చేరతాయి. ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్‌ విధానంలో, మెయిన్‌ సబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్‌లో సంబంధిత సబ్జెక్టుల్లోని తాజా పరిణామాలతోపాటు కొన్ని వ్యక్తిగత ప్రశ్నలూ ఉంటాయి. కాబట్టి ఏకకాలంలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలకు సన్నద్ధం కావాల్సివుంటుంది.  

ప్రతి దశలోనూ సబ్జెక్టులపై స్పష్టత: పరీక్ష సిలబస్‌లోని అన్ని అంశాలపై అవగాహనను స్పష్టం చేసుకోవాలి. పూర్తి అవగాహన ఉన్న అంశాలు, పరిజ్ఞానం ఉన్న అంశాలు, అసలు ఏ విధమైన అవగాహనా లేని అంశాలను పట్టిక రూపంలో రాసుకోవాలి. 

ఇవి పాటించాలి

యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి ఆప్షనల్‌ సిలబస్‌ను సంపాదించాలి. 

దీన్ని గ్రాడ్యుయేషన్‌లోని సిలబస్‌తో సరిపోల్చాలి. అప్పుడు 80 శాతం సిలబస్‌ ఒకేలా ఉన్న విషయాన్ని గుర్తిస్తారు. 

సిలబస్‌లోని ఏ అంశాలు మొదటి, రెండు, మూడు.. సంవత్సరాల్లో కవరయ్యాయో గుర్తించాలి.

సబ్జెక్టు అంశం సన్నద్ధత.. తరగతి బోధన- ఇవి ఏకకాలంలో జరిగేలా చూసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన అంశాన్ని తరగతిలో బోధించారు అనుకోండి. అదే అంశం యూపీఎస్‌సీ సిలబస్‌లో కూడా ఉంటే మరింత మెరుగ్గా దాంట్లో సన్నద్ధం కావచ్చు. సంబంధిత సబ్జెక్టులో పునాదీ గట్టిపడుతుంది.

ఆ టాపిక్‌ను ముందుగా గ్రాడ్యుయేషన్‌కు నిర్దేశించిన పాఠ్యపుస్తకాల నుంచి తీసుకోవాలి. 

ఇదే సబ్జెక్టుతో సివిల్స్‌ పరీక్ష సన్నద్ధమవ్వాలనుకుంటున్నారనే మీ ఉద్దేశాన్ని అధ్యాపకులకు చెప్పాలి. అదనపు రిఫరెన్స్‌లను వారినే అడిగి తెలుసుకోవాలి. 

అధ్యాపకులు సూచించిన రెఫరెన్స్‌ పుస్తకాలన్నీ కాలేజీ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. 

ఆయా పుస్తకాలను చదివి సొంతంగా నోట్సు తయారుచేసుకోవాలి. గ్రాడ్యుయేషన్‌ పరీక్ష కోసం రాస్తున్న నోట్సుకు అదనంగా ఈ నోట్సును సిద్ధం చేసుకోవాలి. 

నోట్సు రాసిన తర్వాత అది ఎంతవరకు సరిగా ఉందో అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలి. గ్రాడ్యుయేషన్‌ పరీక్షకు సరిపోతే ఉపయోగించుకోవాలి. 

ఆప్షనల్‌ సబ్జెక్టు సంబంధించిన యూపీఎస్‌సీ పాత ప్రశ్నపత్రాలను సంపాదించాలి. వాటికి సరైన సమాధానాలను రాయగలుగుతున్నారో లేదో పరీక్షించుకోవాలి. 

మొదటిసారి చూడగానే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయగలమని అనిపించవచ్చు. మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్స్‌ సిలబస్‌ ప్రిలిమినరీ సిలబస్‌ను కూడా కవర్‌ చేస్తుంది. మెయిన్స్‌లో వివరణాత్మక సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలను చదవడం వల్ల ప్రిలిమినరీలోని మల్టిపుల్‌ ఛాయిస్‌ సమాధానాలూ గుర్తించడం సులువు.

సమాధానాలు రాసిన తర్వాత వాటిని దిద్దిపెట్టమని మీ అధ్యాపకులను కోరవచ్చు. దిద్దిన వాటిని సరిచూసుకుని మెరుగుపడాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. 

ఇదే పద్ధతిని గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేలోపు ప్రతి సంవత్సరం అనుసరించాలి.  

ఈవిధంగా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం ఒక ఆప్షనల్‌ను పూర్తిచేయాలి. ఇలా ఒకపక్క సివిల్స్‌ సన్నద్ధతను కొనసాగిస్తే మరోపక్క  గ్రాడ్యుయేషన్‌లో మార్కుల స్కోరు కూడా  గణనీయంగా పెరుగుతుంది.

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌