• facebook
  • whatsapp
  • telegram

సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం.. సమాధానాల్లో నేర్పరితనం

సివిల్స్‌ సాధనలో కీలకమంటున్న 13వ ర్యాంకర్‌ ప్రియంవద మదాల్కర్‌

సివిల్స్‌లో నెగ్గాలంటే... ఒకే అంశంలో నైపుణ్యం కాకుండా అన్ని విభాగాల్లోనూ పట్టు సాధించాలనీ, సన్నద్ధతలో అన్ని సబ్జెక్టులకూ సమప్రాధాన్యం ఇవ్వాలనీ చెబుతున్నారు తాజా ఫలితాల్లో 13వ ర్యాంకు సాధించిన ప్రియంవద] మదాల్కర్‌. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూలో సన్నద్ధత, ఇతర అంశాలపై ఆమె అనుసరించిన సూత్రాలూ.. రేపటి అభ్యర్థులకు ఆమె సూచనలూ.. ఇవిగో!  

మూడు కీలక దశలకు ఎలా సన్నద్ధమయ్యారు.?

2020లో జరిగిన సివిల్స్‌ పరీక్షనూ రాశాను. అప్పటికి నేను సన్నద్ధత ప్రారంభించి రెండు నెలలే అయింది. అందుకే ఈ పరీక్ష నాకు ఒక అనుభవంగా ఉపయోగపడుతుందని ప్రయత్నించా. పరీక్ష విధానం, ప్రశ్నల సరళి, సమయపాలన.. ఇలాంటి విషయాలపై ప్రాథమిక అవగాహన వచ్చింది. ఆ తర్వాత 2021 సివిల్స్‌ లక్ష్యంగా సన్నద్ధత ప్రారంభించాను. ఐచ్ఛికంగా సోషియాలజీ ఎంచుకున్నా. దీనికి దిల్లీలోని ఓ కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఆన్‌లైన్‌లో మూడు నెలలు శిక్షణ తీసుకున్నా. 

తర్వాత నేనే సన్నద్ధమయ్యా. మిగిలిన సబ్జెక్టులన్నీ సొంత ప్రిపరేషన్‌తోనే చదివా.  రోజుకు 9-10 గంటలు కచ్చితంగా కేటాయించేదాన్ని. మధ్యలో కొంత సమయం గతంలో టాపర్స్‌గా నిలిచిన అభ్యర్థుల ప్రిపరేషన్‌ వ్యూహాలకు సంబంధించి వీడియోలు చూశాను. వారి వ్యూహాలు ఎలా ఉన్నాయో ఒక అంచనాకు వచ్చి.. దానికి తగ్గట్టుగా నా ప్రణాళికలు వేసుకునేదాన్ని. గత విజేతల సూచనల ప్రకారం ముందుగా పుస్తకాలు సిద్ధం చేసుకున్నా. దాని ప్రకారం నేను కేటాయించే 9-10గంటల్లో ఒక్కొక్క సబ్జెక్టుకు ఎంత సమయం ఇవ్వాలో నిర్ణయించుకున్నా.

ఏ దశలో ఏ విధంగా? 

ప్రిలిమ్స్‌: ప్రిలిమ్స్‌కు బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ ఛాయిస్‌) ప్రశ్నలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని నిర్దేశిత సమయంలోగా జవాబులు రాయాలి. కచ్చితంగా తెలియకపోతే.. నెగిటివ్‌ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే జవాబు కచ్చితంగా తెలిస్తేనే రాయాలి. ప్రశ్నలు నేరుగా ఉండవు కనుక.. ముందుగా ఏం అడిగారో అర్థం చేసుకోవాలి. దానికి తగ్గ జవాబు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇందుకు మాక్‌ టెస్టులు ఎక్కువగా రాశాను. ప్రశ్నలు అర్థం చేసుకోవడం.. జవాబులు గుర్తించడం.. సమయపాలన.. ఈ మూడు అంశాలకూ మాక్‌ టెస్టులు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. 

మెయిన్స్‌: ఇందులో మూడు గంటల్లో 20 ప్రశ్నలు రాయటమనేది అతిపెద్ద సవాల్‌. అందుకే రాయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. చదవడానికి అభ్యర్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మెయిన్‌ పరీక్షలో చదవడానికే కాకుండా రాయడం కూడా ఎంతో ముఖ్యమని గుర్తుంచుకోవాలి. రోజూ రాయడంపై రెండు.. మూడు గంటలు సాధన చేశాను. ఏదైనా ప్రశ్నకు జవాబు రాయాలని లక్ష్యంగా పెట్టుకుని.. సమయమూ నిర్దేశించుకునేదాన్ని. అలా వేగంగా రాయడం నేర్చుకున్నా. ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్‌ మధ్య ఎక్కువగా మాక్‌ టెస్టులు రాస్తూ అన్నింటికీ జవాబులు రాయడానికి ప్రయత్నించా. ఈ ప్రాక్టీసు వేగంగా రాయడానికి ఉపయోగపడింది. కేవలం నిర్దేశిత సమయంలో రాయడమే కాకుండా.. ఆకట్టుకునేలా ఉండాలి. పాయింట్ల వారీగా రాయాలి. అవసరమైన చోట బొమ్మలు వేస్తే ప్రజెంటేషన్‌ బాగుంటుంది. 

ఇంటర్వ్యూ: మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యా. వర్తమాన వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యాను.

సివిల్స్‌ చదవాలనే లక్ష్యం ఎప్పుడు కలిగింది..? ఆ దిశగా ఎలా వెళ్లారు?

సివిల్స్‌ చదివి ఐఏఎస్‌ కావాలనేది నా చిన్ననాటి కల. మా నాన్న అశోక్‌ మదాల్కర్‌ మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి.ఆయన్ను చూసి స్ఫూర్తి పొంది.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో సివిల్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా. దీన్ని నెరవేర్చుకోవాలంటే.. ముందు ఆర్థిక సుస్థిరత సాధించాలి. సివిల్స్‌ రాయాలంటే ఏడాది లేదా రెండేళ్ల సమయం కేటాయించాలి. ఒకరిపై ఆధారపడకుండా నా కాళ్ల మీద నేను నిలబడాలని ఉండేది. అందుకే ముంబయిలోని వీజేటీఐ నుంచి గ్రాడ్యుయేషన్‌ అవ్వగానే.. ఐఐఎం(బెంగళూరు)లో ఎంబీఏ పూర్తి చేశా. ఆ వెంటనే బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలో ఆరేళ్లపాటు పనిచేసి ఆర్థికంగా స్థిరత్వం సాధించాను. ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. నా లక్ష్యాన్ని మరిచిపోలేదు. 2020 జులైలో ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్స్‌ వైపు అడుగులు వేశాను. ఈ నా ప్రయాణంలో భర్త విద్యాధర్‌ శ్రీధర్‌ సహకారం ఎంతో ఉంది.

అభ్యర్థులు ఏయే పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ చదివితే మంచిది?

పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ విషయంలో అభ్యర్థులు తమ సన్నద్ధత ప్రారంభించే ముందే స్పష్టమైన అవగాహన తెచ్చుకోవడం ఉత్తమం. దానివల్ల అనవసర ఆందోళన పడకుండా ఉండొచ్చు. ప్రాథమికాంశాలపై పట్టు సాధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు పుస్తకాలు చదివి.. ఎప్పటికప్పుడు నోట్స్‌ సిద్ధం చేసుకుంటే మంచిది. సబ్జెక్టుల వారీగా కొన్ని ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి. స్పెక్ట్రమ్‌ ఫర్‌ మోడర్న్‌ హిస్టరీ, పాలిటీ(లక్ష్మీకాంత్‌), ఎకానమీ(మృణాల్‌.. ఆన్‌లైన్‌లో వీడియోలు అందుబాటులో ఉన్నాయి), ఎథిక్స్‌ కోసం లక్‌మ్యాన్‌ ఐఏఎస్‌ నోట్సు చదివా. జీఎస్‌ కోసం శూన్య ఐఏఎస్‌ నోట్సు చదివాను.

తొలి ప్రయత్నంలో సాధ్యమే! 

మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించాలనుకునే అభ్యర్థులకు మీరిచ్చే సూచనలు?

ముందస్తు ప్రణాళికతో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించడం సాధ్యమే. ఇందుకు సరైన వ్యూహం, అవసరమైన పుస్తకాలు ఉండాలి. కొన్నిసార్లు ఒక సబ్జెక్టుకు ఒకటి కంటే ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాం. అలా కాకుండా ప్రతి సబ్జెక్టుకూ ఒక ప్రామాణిక పుస్తకాన్ని నిర్దేశించుకోవాలి. రెండు, మూడు సార్లు అదే పుస్తకాన్ని చదివి.. పూర్తిగా ఆపోశన పట్టాలి. తొలుత ప్రిలిమ్స్, మెయిన్‌.. ఇలా అనుకోకుండా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. నేను హిస్టరీ, జాగ్రఫీ కోసం ఆ పుస్తకాలే చదివాను. ఆ సిలబస్‌ పూర్తి చేశాక.. 

ప్రిలిమ్స్‌కు రెండు, మూడు నెలల ముందు నుంచి సన్నద్ధతతోపాటు మాక్‌ టెస్టులు రాయడం ప్రారంభించా. ప్రిలిమ్స్‌- మెయిన్స్‌ మధ్య 87 రోజుల వ్యవధి ఉంది. ఆ సమయంలో ఎక్కువగా జవాబులు రాయడానికి ప్రాధాన్యమిచ్చా.

ప్రతిదీ ముఖ్యం అనుకోవాలి

అభ్యర్థులు ఏయే తప్పులు చేస్తుంటారు?

సివిల్స్‌ సన్నద్ధతకు అంతం అనేది ఉండదు. ప్రతి అంశమూ ముఖ్యమనుకునే చదవాలి. అభ్యర్థులు ఏదైనా ఆసక్తి ఉన్న సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటా యించడంతో, మిగిలిన వాటి¨ సన్నద్ధతకు వ్యవధి సరిపోదు. దీంతో ఆయా సబ్జెక్టుల పరంగా మార్కులు స్కోర్‌ చేసే అవకాశం పోతుంది. మనకు ఇష్టం లేకపోయినా.. అన్ని సబ్జెక్టులకూ సమ ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. ఒకే అంశంలో నైపుణ్యం సాధించడం కాకుండా అన్ని అంశాలపై (టాపిక్స్‌) పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్టులో ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండాలి. ఇది ప్రిలిమ్స్‌ సన్నద్ధతలో ఎంతో ఉపయోగపడుతుంది.

కరోనా కాలంలో ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఉపయోగపడిందా?

ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఎంతో ఉపయోగపడింది. ముఖ్యంగా ఐచ్చికంగా ఎంచుకున్న సోషియాలజీ కోసం ఆన్‌లైన్‌ కోచింగ్‌పైనే ఆధారపడ్డా. ఆన్‌లైన్‌లో చెప్పిన అంశాలు ఎప్పటికప్పుడు నోట్స్‌ రాసుకుని ప్రిపేర్‌ అయ్యా. వర్తమాన వ్యవహారాలకు (కరెంట్‌ అఫైర్స్‌) సంబంధించి పత్రికలు చదివాను. ఒక్కొక్కసారి పత్రికలు చదవడానికి సమయం సరిపోనప్పుడు కోచింగ్‌ సెంటర్ల వీడియోలను చూసి విషయాలు తెలుసుకునేదాన్ని.

ఇంటర్వ్యూ.. సన్నద్ధత 

మెయిన్‌ పరీక్ష ముగిశాక ఇంటర్వ్యూ కోసం ఎంపికైనట్లు కాల్‌ వచ్చింది. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ ఇంటర్వ్యూ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపులో చేరాను. ఆయన ఇచ్చిన సలహాలూ, సూచనలూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇంటర్వ్యూ ప్రక్రియలో సమగ్ర దరఖాస్తు పత్రం (డాఫ్‌) నింపడం ముఖ్యం. దానిలో పూర్తిగా వ్యక్తిగత అంశాలుంటాయి. 

ఇంటర్వ్యూ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్తిగా అభ్యర్థి వ్యక్తిగత వివరాలపై ఉంటుంది.  మన పేరుకు అర్థం, స్వస్థలం, అక్కడి చుట్టుపక్కల పరిస్థితులు, చరిత్ర, సాంస్కృతిక వ్యవహారాలు తెలుసుకుని ఉండాలి. రెండోది వర్తమాన అంశాలకు సంబంధించి ఉంటుంది. ఇందుకు నిత్యం రెండు పత్రికలు రెండు, మూడు గంటలకు తగ్గకుండా క్షుణ్నంగా చదివి.. నాకు నేనుగా విశ్లేషించుకునేదాన్ని. 

ఇంటర్వ్యూలో సాగదీస్తూ జవాబు చెప్పడం చేయకూడదు. దానివల్ల బోర్డు సభ్యుల్లో మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కేవలం మాట్లాడటం కాదు.. జవాబు చెప్పడం ముఖ్యమని భావించాలి.

నా పరంగా ఇంటర్వ్యూ ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, పని అనుభవం, సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలపై సాగాయి. ఉదాహరణకు ‘స్వయం సహాయక సంఘాలు అంటే ఏమిటి?’ అనే ప్రశ్న అడిగారు. ‘‘మహిళలను సంఘటితమై ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఏర్పాటు చేసినవే ఈ బృందాలు. ఇందులో పొదుపు చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నాయి..’’ అని చెప్పాను.

Posted Date : 04-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌