• facebook
  • whatsapp
  • telegram

Civils: సివిల్స్‌లో మెరిసిన హైదరాబాద్‌ యువత 

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, ముషీరాబాద్‌: సివిల్స్‌- 2021 ఫలితాల్లో నగరానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. అఖిల భారత స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా కష్టించి.. లక్ష్యాన్ని సాధించారు. ఒకరు సొంతంగా ప్రిపేర్‌ కాగా.. మరొకరు ఆన్‌లైన్‌ వనరులు వినియోగించుకున్నారు.. ఇంకొకరు ఉద్యోగం చేస్తూ సన్నద్ధమవ్వగా.. మరొకరు ఉద్యోగం మానేసి సిద్ధమయ్యారు. సివిల్స్‌ సాధించి కేంద్ర సర్వీసులోకి ప్రవేశించి సమాజానికి తమ వంతు సేవ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన పలువురి ప్రస్థానం ఇలా...

ఐపీఎస్‌ అవ్వాలనేది నా కల: ఎస్‌.చిత్తరంజన్, 155వ ర్యాంకు

మా స్వస్థలం వరంగల్‌ అయినప్పటికీ.. హైదరాబాద్‌లోనే స్థిరపడ్డా. ఇది నా చివరి ప్రయత్నం. ఐపీఎస్‌ సాధించాలన్న కల నెరవేర్చుకోవాలని ప్రయత్నించా. ఈ ర్యాంకుతో ఐపీఎస్‌ సాధిస్తానన్న నమ్మకం ఉంది. 2016లో రాసినప్పుడు 357వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నా. అంతకుముందు 2012 నుంచి 2016 వరకు దిల్లీ, అసోంలలో ఇంటిలిజెన్స్‌ బ్యూరోలో పనిచేశా. మా నాన్న జస్టిస్‌ రాధాకృష్ణమూర్తి న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. అమ్మ పేరు హేమలత. నేను ఫార్మసీ చదివినా.. కేంద్ర సర్వీసులకు వెళ్లాలనే ఆలోచన ఉండేది. అందుకే సివిల్స్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నా. సిక్కింలో పనిచేసినప్పుడు గిరిజనుల సంస్కృతికి ఆకర్షితుడినయ్యా. అందుకే ఆప్షనల్‌గా ఆంత్రోపాలజీని ఎంచుకున్నా. సొంతంగా నోట్సు రాసుకుని ప్రిపేర్‌ అయ్యా.

నాన్న స్ఫూర్తితో సాధించా: ప్రత్యూష్, 183వ ర్యాంకు 

నాన్న రిటైర్‌ ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం. ఆయన స్ఫూర్తితోనే సివిల్స్‌ వైపు మళ్లా. నా విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఇంటర్‌ వరకు నగరంలో చదివాక ఐఐటీ చెన్నైలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేశా. ఐఐఎం అహ్మదాబాద్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తయ్యాక సివిల్స్‌ వైపు అడుగులు వేశా. 2019లో రాసిన పరీక్షలో 216వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం నాగ్‌పుర్‌లో ఆదాయపు పన్ను విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌(ట్రైనీ)గా పనిచేస్తున్నా. 

పట్టు వదలకుండా ప్రయత్నించా: ఎం.అనన్య ప్రియ, 544వ ర్యాంకు

చిన్నప్పటి నుంచి సివిల్స్‌ నా కల. ఆరో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. ఒకానొక దశలో ప్రయత్నం విరమిద్దామని భావించినా.. తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అర్కిటెక్చర్‌ చదివాను. మాది వరంగల్‌ జిల్లా. మా చదువుల కోసం అమ్మనాన్నలు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న అజయ్‌కుమార్‌ కుడా స్టాండింగ్‌ కౌన్సిల్‌లో పనిచేస్తున్నారు. అమ్మ రేవతిదేవి న్యాయవాది. - 

ఒకవైపు వైద్యం.. మరోవైపు సాధన: డాక్టర్‌ సయ్యద్‌ముస్తఫా హష్మి, 162వ ర్యాంకు

నాకు వైద్య వృత్తి అంటే చాలా ఇష్టం. అందుకే ముందుగా వైద్యవిద్యను అభ్యసించా. డాక్టరుగా ఉంటే ఒక కుటుంబానికే వైద్యం చేయగలను.. అదే సివిల్స్‌ రాసి సర్వీసులోకి వెళితే సమాజానికి సేవ చేయగలని భావించి పరీక్ష రాశా. మాది మాసాబ్‌ట్యాంకు. 2010లో ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించా. మైనార్టీ విభాగంలో మొదటి ర్యాంకు. ఆ తర్వాత ఎంబీబీఎస్‌ చేసి... ఉస్మానియాలో ఎంఎస్‌(జనరల్‌ సర్జన్‌) అయ్యాక కింగ్‌ కోఠి జిల్లా ఆసుపత్రిలో పనిచేశా. ఒకవైపు కొవిడ్‌ విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యా. పరీక్షకు వారం రోజులు ముందు సెలవు పెట్టి చదివా. ఇది నా రెండో ప్రయత్నం. నాన్న సయ్యద్‌ ఖాలీద్‌ కిర్బి బిల్డింగ్‌ సిస్టమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అమ్మ అసిమున్నీసా అప్పట్లో ఎమ్మెస్సీ బీఈడీ చేసినా.. పిల్లలను ఉన్నతంగా పెంచాలని కెరీర్‌ను త్యాగం చేశారు. 

తప్పుల నుంచి నన్ను నేను మెరుగుపరుచుకున్నా: రంజిత్‌కుమార్, 574వ ర్యాంకు

మాది స్వస్థలం వరంగల్‌ జిల్లా. మూడేళ్లుగా నగరంలోనే ఉంటూ సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నా. నాన్న కృష్ణంరాజు ఫైనాన్సింగ్‌ వ్యాపారం చేస్తుంటారు. అమ్మ మాధవి. 2018లో ఎన్‌ఐటీ రాయ్‌పుర్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యింది. తర్వాత రెండేళ్లపాటు బెంగళూరులో బిజినెస్‌ అనలిస్ట్‌గా పనిచేశా. ఇది నా మూడో ప్రయత్నం. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లా. గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లినా.. ర్యాంకు సాధించలేకపోయా. అయినప్పటికీ నిరాశ పడకుండా ఎక్కడెక్కడ తప్పులు చేశానో గుర్తించి నన్ను నేను మెరుగుపరుచుకున్నా. 

ఐపీఎస్‌ వస్తుంది... ఐఏఎస్‌ లక్ష్యం: మౌనిక, 637 ర్యాంకు

హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో జీఎంగా చేస్తున్న రాంకుమార్, భద్రాచలంలో పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్న వాణీకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె మౌనిక హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. బీ-ఫార్మసీ పూర్తయ్యాక ఏడాది పాటు జర్మనీలో రీసెర్చ్‌ పని మీద వెళ్లారు. తర్వాత సివిల్స్‌పై దృష్టి సారించి బెంగళూరులో శిక్షణ తీసుకున్నారు. ఐదుసార్లు ప్రయత్నించినా ఇంటర్వ్యూలోనో, మెయిన్స్‌లోనో వెనుకబడ్డారు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆరోసారి విజయం సాధించారు. నాన్న కల నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాంకు కు ఐపీఎస్‌ వస్తుంది. ఇందులో చేరి సేవలు అందిస్తూనే ఐఏఎస్‌ కొరకు ప్రయత్నిస్తా

విజేతలకు రాచకొండ సీపీ అభినందనలు 

తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సివిల్స్‌ విజేతలుగా నిలవటం సంతోషంగా ఉందని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. 2021 సివిల్స్‌ పరీక్షల్లో 685 ఎంపికైతే వారిలో 100 మందికిపైగా ఏపీ, తెలంగాణ వాళ్లే ఉండటం ఎంతో స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. విజేతలు, వారి తల్లిదండ్రులు, దిశానిర్దేశకులకు అభినందనలు తెలిపారు. 275 మార్కుల సివిల్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యే వారికి వాట్సాప్‌ గ్రూపులు, వర్చువల్‌ పద్దతుల్లో తాను, మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ శైలేంద్ర డియోలంకర్‌ అంతర్జాతీయ సంబంధాలు, ఆదాయపన్నుశాఖ విశ్రాంత కమిషనర్‌ రాజీవ్, సహచర ఐఏఎస్, ఐపీఎస్‌ ఇతర సర్వీసుల్లో ఉన్న అధికారులు దిశానిర్దేశకులుగా పనిచేయటం ఆనందంగా ఉందన్నారు. గొప్ప ఆశయంతో చేపట్టిన కొత్త మార్గంలో ఎంతోమంది యువతీ, యువకులను సివిల్స్‌ విజేతలుగా నిలవటం గొప్ప అనుభూతి ఇస్తుందని సీపీ మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు. కొత్తగా సర్వీసులోకి అడుగేయబోతున్న విజేతలు సేవాదృక్పథంతో ముందుకు సాగాలి. ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.

********************************************************

Study Material
 

 Polity
 Economics
 Geography
 General science
 PREVIOUS PAPERS
 MODEL PAPERS

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

 సివిల్స్‌-2021లో అమ్మాయిల‌కే టాప్ ర్యాంకులు

 పోలీసు ఉద్యోగ పరీక్షలకు ఇదీ సిలబస్‌!

 టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ సిలబస్‌, పరీక్షావిధానం, పోస్టుల వర్గీకరణ

 రాజ్యాంగంలో ఏవి ప్రధానం?

 నీట్‌లో ఏ సబ్జెక్ట్‌ ఎలా చదవాలి?

 బీటెక్‌ చదివినా.. గెలుపు ఆర్ట్స్‌తోనే!

 సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వ్యూహం సిద్ధం!

Posted Date : 31-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌