• facebook
  • whatsapp
  • telegram

సంక్షిప్తంగా... సమగ్రంగా?

సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షల్లో సమాధానాలు రాయడంపై మెలకువలు

సివిల్స్‌లో రాసే సమాధానాలు ఎలా ఉండాలి? కేవలం విస్తృత సమాచారం రాసేస్తే సరిపోదు. సమగ్రంగా, సంక్షిప్తంగా ఉండాలి జవాబులు. కుదించి రాసినా స్పష్టతకు లోపం రాకూడదు. ఇలా రాయటానికి ఏ మెలకువలు పాటించాలి?

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలో నెగ్గినవారందరూ తమ విజయానికి కారణం... సమాధానాలు రాయటం సాధన చేయటమేనని చెప్తుంటారు. ఎందుకంటే... అభ్యర్థి 20-25 ప్రశ్నలకు మూడు గంటల వ్యవధిలో నిర్దిష్ట పరిమిత స్థలంలో జవాబులు రాసేలా మెయిన్స్‌ను రూపకల్పన చేశారు. 2013 నుంచి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మార్పు చోటుచేసుకుంది. జనరల్‌ స్టడీస్‌లో పేపర్ల సంఖ్య పెరిగింది. ప్రతి పేపర్‌లోనూ వేర్వేరు సబ్జెక్టులు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, అంతర్జాతీయ సంబంధాలు, ఇతర సబ్జెక్టులపై అభ్యర్థులు సమాన పరిజ్ఞానంతో ఉండాలని సివిల్స్‌ పరీక్ష ఆశిస్తుంది. దీంతో పరీక్షకు సిద్ధంకావడం కఠినంగా తయారవటమే కాకుండా అభ్యర్థులు విభిన్న అంశాలను చదివి, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పైగా వీటిని నిర్ణీత వ్యవధిలో, కేటాయించిన స్థలంలో రాయాల్సి ఉంటుంది. 

యూపీఎస్‌సీ ఈ మార్పును తీసుకురావడానికి కారణం... మారిన పరిస్థితులకు అనుగుణంగా సివిల్‌ సర్వెంట్లు వైవిధ్యభరితమైన సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకుని.. సముచితమైన సమయంలో దాన్ని తగినవిధంగా ఉపయోగించాల్సివుంటుంది కాబట్టి.   సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలో నెగ్గడానికి సంక్షిప్తీకరణే మంత్రం. ఈ నైపుణ్యం అంత తేలిగ్గా అలవడదు. దీని కోసం ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది అవసరం. ప్రారంభ దశలోనే అభ్యర్థులు శాయశక్తులా, దీర్ఘకాలంపాటు కృషిచేయాల్సి ఉంటుంది. అప్పుడే దీంట్లో నిష్ణాతులు కాగలుగుతారు. ప్రెసీ రైటింగ్‌లో పట్టు పెంచుకోగలిగితే ఈ నైపుణ్యంలో తొలి అడుగులు వేసినట్టే! 

తక్కువ పదాలతో రాయడం నిజంగా కష్టమా?

సారాంశం చెడిపోకుండా.. సమాచారాన్ని కుదించి రాయాలంటే దీర్ఘకాల సాధన అవసరం. దీనిలోని క్లిష్టత అర్థం చేసుకోవడానికి కింది కసరత్తు ఉపయోగపడుతుంది.  

1. ముందుగా ఒక అంశాన్ని ఎంచుకుని దాని మీద పది పేజీల వ్యాసాన్ని రాయాలి. సరైన ఎత్తుగడ, ముగింపు ఉండేలా జాగ్రత్తపడాలి. 

2. పది పేజీలు రాయడం పూర్తయిన తర్వాత మూడోవంతుకు తగ్గించడానికి ప్రయత్నించాలి. పరిచయం, ముగింపు అలాగే ఉంచి మధ్యలో ఉండే మ్యాటర్‌ను తగ్గిస్తే సరిపోతుంది. 

3. ఆ తర్వాత విషయాన్ని సగానికి తగ్గించాలి. అయితే పూర్తి అర్థం చెడిపోకుండా జాగ్రత్తపడాలి. పరిచయం, ముగింపులో కూడా అవసరమైతే చిన్నచిన్న మార్పులు చేయొచ్చు. 

4. ఇప్పుడు మొత్తం విషయాన్ని నాలుగోవంతుకు తగ్గించాలి. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మార్పులు చేయాలి. 

5. చివరగా పది పేజీల వ్యాసాన్ని 1 1/2 పేజీలకు కుదించాలి. ఇప్పుడు అసలు వ్యాసంలోని పూర్తి సారాంశం చెడిపోకుండా, ముఖ్యాంశాలన్నీ వచ్చేలా వ్యాసాన్ని రాయగలిగారో లేదో చూసుకోవాలి. 

ఈ ప్రక్రియ అంతా చాలా కష్టంగా ఉంటుంది. కానీ సాధన ద్వారా దీనిపై పట్టు సాధించవచ్చు. సివిల్స్‌లోనే కాకుండా ఇతర పోటీ పరీక్షల్లోనూ ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి ముఖ్యమైన పాయింట్లు వచ్చేలా క్లుప్తంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఆలోచనలన్నింటినీ సంగ్రహంగా వెల్లడించాలంటే వ్యక్తీకరణలో పటిష్ఠమైన పునాది అవసరం. 

క్లుప్తంగా, సమర్థంగా రాయాలంటే...

ప్రముఖ రచయిత రాసిన ఓ పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని ఎంచుకోవాలి. అది ప్రచురితమైన ముద్రిత పుస్తకమై ఉండాలి. ఆ తర్వాత...  

అర్థం అయ్యేవరకూ...: సంక్షిప్తంగా రాయాలంటే ముందుగా అసలు ప్రతిని చదివి, క్షుణ్ణంగా అర్థంచేసుకోవాలి. కాబట్టి బాగా అర్థం అయ్యేంతవరకు ఎన్నిసార్లయినా చదవాలి. రచయిత వివిధ పదాల ద్వారా వ్యక్తపరిచిన భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. 

ప్రధానోద్దేశం: వ్యాసం రాయడం వెనుక ఉండే ప్రధాన ఉద్దేశాన్నీ, ఇతర ఆలోచనలనూ గుర్తించగలగాలి. ఒక పాసేజ్‌ చదివిన తర్వాత దాన్ని బాగా అర్థంచేసుకుని దాంట్లోని ఆలోచనలను పాయింట్లవారీగా రాసుకోవాలి. దీనివల్ల వాటిపై స్పష్టత ఏర్పడుతుంది. దాంతో కుదించి రాసేటపుడు ముఖ్యమైన పాయింట్లను విస్మరించకుండావుంటాము.

సొంత మాటల్లో..: అసలు వ్యాసంలో రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటినీ ప్రతిబింబిస్తూ ప్రెసీని మరింత ఆసక్తికరంగా రూపొందించాలి. అంటే రచయిత ఉద్దేశాన్ని మీ సొంత మాటల్లో వ్యక్తంచేయగలగాలి. దీనికోసం ముఖ్యమైన పాయింట్లను గుర్తించటమే కాకుండా పాసేజ్‌ సారాంశాన్ని అవగాహన చేసుకోవాలి. ఇందుకోసం రాసుకున్న ప్రతి పాయింట్‌పై దృష్టి పెట్టి వాటిని మీ సొంత మాటల్లో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల భావం చెడిపోకుండా, వ్యాసం అసలు ఉద్దేశాన్ని వక్రీకరించకుండా రాయడం సాధ్యమవుతుంది. 

సరిపోయే శీర్షిక: పాసేజ్‌ భావాన్ని అర్థంచేసుకుని, ముఖ్యమైన పాయింట్లను రాసుకుని, వాటిని మీ సొంత మాటల్లోకి మార్చుకోవాలి. అప్పుడు పాసేజ్‌లోని ప్రధాన ఉద్దేశాన్ని గ్రహించటం సాధ్యమవుతుంది. దాని ఆధారంగా కొత్త శీర్షిక పెట్టాలి. శీర్షిక కోసం గట్టిగా ఆలోచించడం, సరిగ్గా సరిపోయేలా శీర్షిక పెట్టడం ఎంతో అవసరం. వ్యాసంలోని అసలు ఉద్దేశాన్ని గ్రహిస్తేనే అర్థవంతమైన శీర్షిక సాధ్యమవుతుంది. 

తొలి చిత్తు ప్రతి: పాసేజ్‌లో చర్చించిన అసలు ఉద్దేశాన్ని గ్రహించిన తర్వాత ప్రెసీ కోసం మొదటి చిత్తుప్రతి (డ్రాఫ్ట్‌) తయారుచేయాలి. ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను తీసేయకుండా, అనవసరమైన విషయాలను జోడించకుండా జాగ్రత్తపడాలి. గమనించిన అంశాల మీద దృష్టిపెట్టి, అసలు వ్యాసంలోని సారం చెడిపోకుండా.. తక్కువ పదాలతో రాయాలి. 

సరిపోలుస్తూ..: మొదటి డ్రాఫ్ట్‌లోనే ప్రెసీ పూర్తిస్థాయిలో.. అన్ని హంగులతో సిద్ధం కాదు. రాసిన దాన్ని ఒకసారి మళ్లీ చదువుకోవాలి. రాసినదాన్ని అసలు వ్యాసంతో సరిపోల్చుతూ చదవాలి. అలా చేస్తున్నప్పుడు... రాసిన ప్రెసీ అసలు ప్రతిలోని సారాంశాన్ని సరిగా ప్రతిబింబించిందా? అసలు ప్రతిలో వెలిబుచ్చిన ఆలోచనలన్నీ ప్రెసీలో వచ్చాయా? ఏదైనా పాయింట్‌ను అనవసరంగా జత చేశానా? చెప్పిన విషయాన్నే తిరిగి చెప్పానా, ముఖ్యమైన ఆలోచనను తొలగించానా? ప్రెసీకి సమగ్ర స్వరూపం వచ్చిందా? వ్యక్తీకరణలో స్పష్టత, పొందిక ఉందా? పదాల, వాక్యాల మధ్య అనుసంధానం సరిగా ఉందా? అవసరమైన చోట్ల విరామ చిహ్నాలను పెట్టానా లేదా.. ఇవన్నీ గమనించుకోవాలి. ఈ దశలో ప్రెసీలో ఎన్ని పదాలను వాడారో లెక్కించాలి. ఈ నిడివిని అసలు వ్యాసంతో సరిపోల్చుకుని చూసుకోవాలి. అస్పష్టంగా, పునురుక్తిగా ఉన్న పదాలు తొలగించాలా? అదనంగా చేర్చాలా అనేది ఒకసారి చూసుకోవాలి. 

తుది రూపు: రాసిన ప్రెసీని విమర్శనాత్మకంగా సమీక్షించుకోవాలి. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు చిత్తు ప్రతిని సవరించాలి. చివరిగా మరోసారి సరిచూసుకుని అవసరమైతే మార్పులూ, చేర్పులు చేసుకోవాలి. తుది రూపుతో పకడ్బందీ అయిన ప్రెసీని సిద్ధం చేయాలి! 

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలో నెగ్గడానికి సంక్షిప్తీకరణే మంత్రం. ఈ నైపుణ్యం అంత తేలిగ్గా అలవడదు. దీని కోసం ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది అవసరం.  ప్రారంభ దశలోనే శాయశక్తులా, దీర్ఘకాలంపాటు కృషిచేస్తే అభ్యర్థులు  దీంట్లో నిష్ణాతులు కాగలుగుతారు.

Posted Date : 27-01-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు