• facebook
  • whatsapp
  • telegram

ఆట తెలిస్తేనే పోటీలో ముందుకు!

పోటీ పరీక్షల్లో క్రీడలకు సంబంధించి విశ్లేషణాత్మక అధ్యయనానికి సూచనలు

ఈ రోజుల్లో క్రీడలకు అసాధారణ హోదా లభిస్తోంది. ప్రతి దేశమూ, రాజకీయ వ్యవస్థా క్రీడలకు ప్రాముఖ్యమిస్తూ అభివృద్ధిలో వీటిని అనుసంధానం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం క్రీడా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేశ ప్రతిష్ఠకు చిహ్నంగా ప్రపంచ దేశాలు క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో- జనరల్‌ నాలెడ్జ్‌లో భాగమైన క్రీడల గురించి విద్యార్థులూ, పోటీ పరీక్షల అభ్యర్థులూ ప్రాథమిక అవగాహన పెంచుకోవటం ఎంతో అవసరం. 

విద్యార్థులను కోచింగ్‌ సెంటర్లలో చేర్చడానికి వచ్చే సందర్భంలో తల్లిదండ్రులు ‘మా పిల్లలు చాలా బాగా చదువుతారు గానీ.. జనరల్‌ నాలెడ్డ్‌ (జీకే) విషయంలో మాత్రం వెనకబడి ఉన్నారు’ అంటూ చెబుతుంటారు. పాఠశాల పాఠ్యప్రణాళికలో తప్పనిసరిగా ఉండాల్సిన జీకేకి తగిన స్థానం లేకపోవటం వల్లనే ఈ పరిస్థితి. ప్రవేశపరీక్షలకూ, ప్రొఫెషనల్‌ స్టడీస్‌కూ ప్రాధాన్యం ఇచ్చే కరిక్యులమ్‌లు జనరల్‌ నాలెడ్జ్‌ ప్రాధాన్యాన్ని పట్టించుకోవటం లేదు.  

స్థూలంగా ప్రపంచం గురించీ, ప్రత్యేకించి భారతదేశానికి సంబంధించిన అంశాల గురించీ తెలుసుకోవడం జనరల్‌ నాలెడ్జ్‌ కిందికి వస్తుంది. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు, క్రీడలు... ఇవన్నీ జీకే పరిధిలోకి వస్తాయి. వీటిలో మొదటి కొన్ని సబ్జెక్టుల విషయంలో విద్యా సంబంధ కోణం నుంచి అధ్యయనం చేయాల్సినవి. క్రీడల విషయానికి వస్తే... వినోదాత్మకమైన ఇలాంటి అంశాలను కూడా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాల్సివస్తుందని  తెలుస్తుంది.  

భావోద్వేగాలతో..

మన దేశంలోనూ క్రీడలకు ప్రాముఖ్యం పెరిగింది. క్రీడా విజయాలను ప్రతి ఒక్కరూ భావోద్వేగాలతో ఆస్వాదిస్తున్నారు. ప్రజల సంభాషణల్లో క్రీడలకు సంబంధించిన అంశాలే రకరకాల స్థాయుల్లో ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ కప్‌ పోటీలు జరిగే సమయంలో అయితే దేశం మొత్తం ఏకమై వీటి గురించి చర్చిస్తూ ఉంటుంది. 
ప్రపంచ కప్‌ పోటీలు జరిగేటప్పుడు సాధారణంగా మనమంతా ఎంతో ఆసక్తిగా టీవీలను చూస్తూనే ఉంటాం. అయితే క్రీడలకు సంబంధించిన పరిజ్ఞానం విషయంలో మాత్రం అనేక సందేహాలు వస్తుంటాయి. సాధారణంగా క్రికెట్, చెస్, టెన్నిస్‌ లాంటి ప్రాచుర్యమున్న ఆటలే ఎక్కువమందికి పరిచయం. 

చిన్నదే.. చాలా ముఖ్యమైంది

పోటీ పరీక్షల అభ్యర్థులు తమకు ఎలాంటి క్రీడా పరిజ్ఞానం ఉండాలో తెలుసుకోవాలి. ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసే ప్రక్రియలో క్రీడల పాత్ర చిన్నదే అయినా చాలా ముఖ్యమైంది కూడా. సివిల్‌ సర్వీసెస్‌ (ఇతర పరీక్షల విషయంలోనూ)లోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ- మూడు అంచెల్లోనూ క్రీడల అంశానికి ప్రాధాన్యం ఉంది.   

ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్షలు

ఏ నియామక విధానంలోనైనా ప్రతి అభ్యర్థీ ఈ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో ఉంటుంది. సాధారణంగా అభ్యర్థుల సంఖ్యను తగ్గించడానికి దీన్ని రూపొందిస్తారు. పరీక్షల్లో 5 శాతం ప్రశ్నలు క్రీడల నుంచే వస్తాయి. (ఒక్కోసారి ఈ శాతం తగ్గొచ్చు. అయితే ఒక్కోసారి పరీక్ష పాసవడానికీ, ఫెయిల్‌ కావడానికీ ఒకే ప్రశ్న కారణం కావచ్చు. ఆ ఒక్కటీ క్రీడలకు సంబంధించిన ప్రశ్నయినా కావచ్చు). సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌-2021లో కొన్ని ప్రశ్నలు క్రీడలకు సంబంధించినవి వచ్చాయి. గతంలో ఇలాంటి ప్రశ్నలు రాకపోవడంతో విద్యార్థులు వీటిని ఊహించలేకపోయారు. వివిధ రకాలైన ఆటలు, క్రీడాకారులు, అవార్డులపై ప్రశ్నలు వచ్చాయి. ఎక్కువ పరీక్షల్లో ప్రాచుర్యం పొందిన క్రీడలపైనే ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి సంబంధిత అంశాల స్థూల పరిజ్ఞానం సరిపోతుంది. 

డిస్క్రిప్టివ్‌ టైప్‌ రాత పరీక్షలు

వీటిలో సాధారణంగా సంక్షిప్త సమాధానాలు రాయాల్సి ఉంటుంది. క్రీడ, క్రీడాకారులు, అవార్డులకు సంబంధించిన ప్రశ్నలు ఇస్తుంటారు. విషయ సమాచారం తెలిస్తేనే సమాధానం రాయగలుగుతాం. ఎలాంటి ప్రత్యామ్నాయ సమాధానాలకూ అవకాశం ఉండదు. ఉదాహరణకు ‘ఇతర దేశాలతో పోలిస్తే.. మనదేశంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెనుక ఉండే సామాజిక కారణాలేంటి? క్రీడల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు ఏమిటి?’, ‘క్రీడల మీద కాసే పందాలను చట్టబద్ధం చేయొచ్చా?’ ఇలాంటివి. ఈమధ్య జరిగిన క్రీడాంశాలకూ, ప్రాచుర్యం పొందిన ఆటలకు సంబంధించిన ప్రశ్నలే వస్తాయి. గ్రూప్‌-1/ సివిల్‌ సర్వీసెస్‌ జనరల్‌ ఎస్సే పేపర్‌లో ‘క్రీడారంగంలో భారతదేశం’ అనే అంశం మీద 1000 పదాలకు మించకుండా వ్యాసం రాయమని అడగొచ్చు. దీని కోసం విస్తృతంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ

పోటీ పరీక్షల కోసం నింపే దరఖాస్తులో పాఠశాల/ కళాశాల స్థాయిలో మీరు పాల్గొన్న క్రీడలకు సంబంధించిన సమాచారం రాయమంటూ కాలమ్‌ ఉంటుంది. లేదా విద్యేతర వ్యాపకం గురించి రాయమంటారు. (చాలామంది విద్యార్థులు క్రికెట్‌ చూడటాన్ని విద్యేతర వ్యాపకం అని రాసేస్తుంటారు.) ఉదాహరణకు మీరు స్కూల్లో క్రికెట్‌ ఆడానని చెబితే.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి  క్రికెట్‌ తాజా అంశాల్లో మీకు పట్టుందనే అనుకుంటారు. ఆ స్థాయి ప్రశ్నలే వేస్తుంటారు. 

పోటీ పరీక్షల్లో క్రీడలకు సంబంధించి ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు సాధారణంగా ఇలా ఉండొచ్చు.

జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ క్రీడలపరంగా భారతదేశం వెనకబడి ఉండటానికి కారణం? 

మీకు యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖను ఇస్తే... దేశంలో క్రీడల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

మ్యాచ్‌ ఫిక్సింగ్‌/ క్రీడల్లో డ్రగ్స్‌ వాడకంపై మీ అభిప్రాయం ఏమిటి?

భారతదేశంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాలేవి?

క్రీడల ద్వారా ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలు మెరుగుపడ్డాయా?

గుర్తుంచుకోండి

1. పోటీ పరీక్షల కోణంలో చూస్తే... జరిగిన ప్రతి క్రీడకూ, పోటీకీ సంబంధించిన సమాచారాన్నంతా సేకరించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ప్రధాన సంఘటనలపై మాత్రమే ప్రశ్నలను అడుగుతారు. 

2. ఒక క్రీడను చూస్తున్నప్పుడు దాంట్లో సాధారణంగా ఉపయోగించే మాటలకు అర్థాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు- క్రికెట్‌లో డెడ్‌బాల్‌కూ, నోబాల్‌కూ ఉన్న తేడా ఏమిటి? దీనికోసం ఆటలకు సంబంధించిన పుస్తకాల్లో చూడొచ్చు, ఇంటర్నెట్‌లో వెతకొచ్చు లేదా ఈ ఆట మీద పట్టున్న స్నేహితుడిని అడిగి తెలుసుకోవచ్చు. 

3. గత కాలంలో మాత్రమే కాకుండా ఈ ఆధునిక యుగంలోనూ ఆదరణ తగ్గని క్రీడల సమాచారాన్ని సేకరించాలి. 

4. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఆడని పురాతన క్రీడలను గుర్తించాలి. అవి మానసిక వికాసం, మొదలైన ప్రయోజనాలకు తోడ్పడేవిగా ఉండొచ్చు. ఉదాహరణకు పులిజూదం (తార్కిక సామర్థ్యం పెంపు), వైకుంఠపాళి (తాత్విక కోణంలో జీవిత వివరణ), కోతి కొమ్మచ్చి (ప్రకృతితో సహజీవనం). 

5. మానవ జీవితంలో క్రీడలకు ఉండే ప్రాముఖ్యం గురించి ఆలోచించాలి. క్రీడల్లో గెలుపు ముఖ్యమా? క్రీడా స్ఫూర్తి ముఖ్యమా? క్రీడలు దేశాన్ని ఒకే తాటి కిందకు తీసుకొస్తాయా? రెండు దేశాలను దగ్గర చేయడానికి క్రీడలను సాధనంగా ఉపయోగించవచ్చా?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించాలి. 

6. నైతిక విలువల మీదా దృష్టిని కేంద్రీకరించాలి. గెలుపు ముఖ్యమా? ఆడటం ముఖ్యమా? ఆట ముఖ్యమా? ఆటగాడు ముఖ్యమా? వీటి గురించీ అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. 

7. క్రీడలపై ప్రచురించే కథనాలూ, చర్చలను చదవాలి. ఆటలో మెరుగైన ప్రదర్శన కోసం క్రీడాకారుల డ్రగ్స్‌ను ఎందుకు వినియోగిస్తున్నారు? మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటే?... ఈ విషయాలపై సొంత అభిప్రాయాలను ఏర్పరుచుకోవాలి.

ఇలా చేస్తే సరి

క్రీడలపై ప్రాథమిక పరిజ్ఞానం పెంచుకోవాలంటే కింది సూచనలు పాటించాలి..

ప్రాచుర్యంలో ఉన్న స్పోర్ట్స్‌/ గేమ్స్, క్రీడా వేడుకలకు సంబంధించిన ఒక జాబితా రూపొందించుకోవాలి. క్రికెట్, టెన్నిస్‌లకు జాబితాలో ఎలాగూ స్థానం ఉంటుంది. మిగతా ఆటలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. పక్కన ఉన్న చార్టు ప్రధాన క్రీడలకు సంబంధించిన వర్గీకరణను సూచిస్తుంది.

ఈ ఆటలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలి. ఎంతమంది ఆడారు, ఎవరు ఆడారు, ఇదే క్రీడకు సంబంధించిన వివిధ విభాగాలు (సింగిల్స్, డబుల్, మిక్స్‌డ్‌ డబుల్స్‌ మొదలైనవి).

ఈ క్రీడలకు సంబంధించిన ప్రధాన జాతీయ, అంతర్జాతీయ పోటీలను గుర్తించాలి.

ఒలింపిక్స్, ఏషియన్‌ గేమ్స్, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ లాంటి ప్రధాన క్రీడలపై ప్రాథమిక సమాచారం సేకరించాలి. ఉదాహరణకు: ఇవి ఎప్పుడు మొదలయ్యాయి? వీటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? వీటి జెండాను ఎవరు రూపొందించారు?... లాంటివి. 

క్రీడల అభివృద్ధి ప్రభుత్వం ఏ కృషి చేస్తోంది? ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టింది? ఏయే అవార్డులు ప్రకటించింది? క్రీడా విధానం ఏమైనా ఉందా?.. లాంటి సమాచారాన్ని సేకరించాలి. 

క్రీడల్లో భారతదేశ ప్రతిభా ప్రదర్శనను విశ్లేషిస్తూ వార్తాపత్రికల్లో వచ్చే కథనాలను చదవాలి. ఈ సందర్భంగా సూచించిన సూచనలను రాసుకుని, గుర్తుంచుకోవాలి. 

ఏదైనా పరీక్షకు హాజరవుతుంటే. ఇటీవల నిర్వహించిన క్రీడలకు సంబంధించిన తాజా అంశాలను తెలుసుకోవాలి. 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 36 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సిద్ధమేనా?

‣ తక్కువ సమయంలో ఉద్యోగం సాధించాలంటే?

‣ ఉన్నత రక్షణకు... ఉమ్మడి పరీక్ష!

‣ ఉద్యోగ వేటలో... నాయకత్వ నైపుణ్యాలు

‣ రక్షణ దళాల్లో దూసుకుపోదాం!

‣ అవే పాఠాలు.. అలాగే మరోసారి!

Posted Date : 30-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌