• facebook
  • whatsapp
  • telegram

శివకవులు, పురాణ కవులు 

తెలుగు సాహిత్య చరిత్రలో 12వ శతాబ్దం విశిష్టమైంది. ఈ కాలంలో రాజుల కంటే కవులదే పైచేయి. ముగ్గురు కవులు కవితా ప్రపంచాన్ని ఏలారు. వారినే శివకవులు అంటారు. 12వ శతాబ్దాన్ని 'శివకవి యుగం'గా పేర్కొంటారు. శివకవులు శివుడి మీద తప్ప మరొక రచన చేయలేదు. శైవమత వ్యాప్తికే కలం పట్టారు. 
బౌద్ధం, జైనం బాగా ప్రచారంలో ఉన్నప్పుడు, వైష్ణవం వ్యాపిస్తున్నప్పుడు శైవం గొప్పదని చాటడానికి రచనలు చేసినవారు శివకవులు.
* నన్నెచోడుడు
* మల్లికార్జున పండితారాధ్యుడు
* పాల్కురికి సోమన - ఈ ముగ్గురిని శివకవులు అంటారు. వీరితోపాటు 'సర్వేశ్వర శతకం' రాసిన యథావాక్కుల అన్నమయ్యను కూడా శివకవిగా పేర్కొంటారు.


 శివకవుల లక్షణాలు:
 
   1. శివుడు గొప్పవాడనటం.
    2. శైవం లాంటిది మరొకటి లేదనటం.
    3. శివభక్తులను శివుడితో సమానంగా భావించటం.
    4. పురాణ కథలను కాదని సమాజంలోని కథలను స్వీకరించడం.
    5. దేశి కవిత్వానికి పెద్దపీట వేయడం.
    6. వ్యాకరణ నియమాలను ఉల్లంఘించడం.
* శివకవుల్లో మొదటి కవి నన్నెచోడుడు. ఈయన 'కుమారసంభవం' అనే కావ్యం రాశారు. కాళిదాసు సంస్కృతంలో రాసిన కావ్యాన్ని ఆధారంగా చేసుకుని కొద్దిపాటి మార్పులు చేర్పులతో తెలుగులో రాశారు. కొందరు ఇది నన్నెచోడుడు రాయలేదని, మానవల్లి రామకృష్ణ కవి రాశారని వాదించారు. అయితే ఆధారాలు లభించలేదు.
* 'కవిరాజ శిఖామణి' అనే బిరుదున్న నన్నెచోడుడు మార్గ, దేశి పదాలను మొదటగా వాడి.. 'మార్గకుమార్గము దేశియమార్గము' అని చాటి చెప్పారు. సంస్కృత ఛందస్సులో, సంస్కృత పదాలతో పాండిత్యపరంగా రాసింది మార్గకవిత్వం. తెలుగు ఛందస్సులో తెలుగుకి ప్రాధాన్యమిచ్చి రాస్తే దేశి కవిత్వం.
* నన్నెచోడుడు తనది 'వస్తుకవిత' అని పేర్కొన్నారు. జాను తెనుగుకి ప్రాధాన్యం ఇచ్చారు. జాను తెనుగు అంటే సుమారుగా అచ్చతెలుగు అన్నమాట.
* శివకవుల్లో రెండోవాడైన మల్లికార్జున పండితారాధ్యుడు 'శివతత్త్వసారం', 'శ్రీగిరిశతకం' రచించారు. 'శ్రీగిరిశతకం' తొలి శతకమని కొందరి అభిప్రాయం - కానీ ఇది లభించలేదు. అందువల్ల దాన్ని తొలి శతకంగా చెప్పలేం.
* పాల్కురికి సోమన సంస్కృత, కన్నడ, ఆంధ్ర భాషల్లో పాండిత్యం ఉన్న కవి. మూడు భాషల్లో రచన చేసిన మొదటి కవి.
   * బసవపురాణం - ద్విపద కావ్యం
   * పండితారాధ్యచరిత్ర - ద్విపద కావ్యం
   * అనుభవసారం
   * చతుర్వేదసారం
   * వృషాధిపశతకం (తొలి శతకం)
   * బసవోదాహరణం (తొలి ఉదాహరణ కావ్యం) మొదలైనవి పాల్కురికి సోమన రచనలు.
 ఇవే కాకుండా పాల్కురికి సోమన బసవ రగడ, బసవ గద్య, వృషభాష్టకం, చెన్నమల్లు సీసాలు లాంటి రచనలు చేశారు. ద్విపదకు పట్టం కట్టిన తొలి తెలుగు కవి, జాను తెనుగుకి అత్యంత ప్రాధాన్యమిచ్చిన కవి పాల్కురికి సోమన.
   ''తెలుగు మాటలనంగవలదు
     వేదముల కొలదియకాజూడు"మన్న తెలుగు భాషాభిమాని సోమన.
* పాల్కురికి సోమన పురాణాల నుంచి కథలను స్వీకరించలేదు. జనసామాన్యంలోని శివభక్తుల కథలను స్వీకరించి, శైవమహిమను చాటి చెప్పారు. బసవపురాణంలో గొడగూచి, బెజ్జమహాదేవి, ముగ్ద సంగయ్య, కన్నప్ప లాంటి పాత్రలు ఉన్నాయి.

రామాయణ కవులు 
సంస్కృతంలో వాల్మీకి రామాయణం, తెలుగులో కవిత్రయ భారతం తొలి ఇతిహాసాలు. తెలుగులో వెలువడిన అనేక రామాయణాలకు వాల్మీకి రామాయణమే మూలం. రామాయణం అంటే రాముని కథ. వాల్మీకి ఒకచోట సీతాయణం అన్నారు.
     ఎర్రన రామాయణం రాసినట్టు తెలుస్తున్నా అది అలభ్యం. కాబట్టి తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణమే! దీన్ని 13వ శతాబ్దంనాటి గోన బుద్ధారెడ్డి రచించారు. కొందరు గోనబుద్ధ భూపతి, కాచ భూపతి కలిసి రాసి ఉంటారని అభిప్రాయపడినా రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ బుద్ధారెడ్డి రచనగా నిర్ణయించారు.
 రంగనాథ రామాయణం ద్విపదలో రాసిన తొలి రామాయణం. వాల్మీకి రామాయణంలో లేని చాలా సన్నివేశాలను బుద్ధారెడ్డి ఇందులో చేర్చారు. అందుకే రంగనాథ రామాయణంలో అవాల్మీకాలు ఎక్కువ.  రంగనాథ రామాయణం జానపద కళాకారులకు అనుకూలంగా ఉండటం వల్ల తోలుబొమ్మలాట లాంటి వాటికి ఉపయుక్తంగా ఉండేదని తెలుస్తోంది. మొట్టమొదటి 'చంపూ రామాయణం'గా భాస్కర రామాయణాన్ని పేర్కొనాలి.  తిక్కన రాసిన 'నిర్వచనోత్తర రామాయణం' రామాయణం తర్వాతి భాగం. కేవలం పద్యాల్లోనే రాసింది.
 భాస్కర రామాయణం పద్య, గద్యాల్లో ఉంటుంది.


భాస్కర రామాయణ కవులు నలుగురు
   * హుళక్కి భాస్కరుడు
   * మల్లికార్జున భట్టు (భాస్కరుని కుమారుడు)
   * కుమార రుద్రదేవుడు (భాస్కరుని శిష్యుడు)
   * అయ్యలార్యుడు (భాస్కరుని మిత్రుడు)
 భాస్కర రామాయణంపై ఆచార్య రవ్వా శ్రీహరి ఉత్తమ సిద్ధాంత గ్రంథం రచించారు. పురాణ ప్రవచనాలకు భాస్కర రామాయణం ప్రసిద్ధి. భాస్కర రామాయణాన్ని కథానుపద్ధతిలో రాశారు. వర్ణనలు బాగా ఉండటంవల్ల కావ్య రచనా రీతి ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీనాథుడు పూర్వ కవి స్తుతిలో కవిత్రయంతోపాటు హుళక్కి భాస్కరుడికి కూడా నమస్కరించడం విశేషం.  15వ శతాబ్దం చివరి కాలానికి చెందిన ఆత్కూరు మొల్ల 'రామాయణం' రచించింది. ఇది మొల్ల రామాయణంగా ప్రసిద్ధిగాంచింది. రామాయణాన్ని రచించిన తొలి కవయిత్రి మొల్ల. శ్రీకంఠ మల్లేశ్వరుని దయవల్ల కవిత్వం అబ్బిందని చెప్పిన ఈమె గోపవరం నివాసి.  మొల్ల రామాయణాన్ని ప్రథమాంధ్ర సంగ్రహ రామాయణంగా పేర్కొంటారు. మొల్ల తన రామాయణాన్ని శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చింది.
      ''చెప్పుమని రామచంద్రుడు సెప్పించిన పలుకుమీద జెప్పెద" అంటూ కవిత్వం
          ''తేనె సోక నోరు తీయనయగునట్లు" ఉండాలనీ
        ''మూగ చెవిటి వారి ముచ్చట"లాగా ఉండకూడదనీ చెప్పింది.
* మొల్ల వాల్మీకి రామాయణంతో పాటు ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా అనుసరించింది.
* అయ్యలరాజు రామభద్ర కవి రామాయణ కథను 'రామాభ్యుదయం' కావ్యంగా రాశారు.
* 17వ శతాబ్దపు కవి కంకంటి పాపరాజు కరుణరసాత్మక కావ్యంగా 'ఉత్తర రామాయణం' రాశారు.
* ఆధునిక కవుల్లో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి యథామూలంగా, పద్యాల్లో 'శ్రీకృష్ణ రామాయణం' రచించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు 'జనప్రియ రామాయణం' రాశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణానికి మూలానుగుణంగా 'ఆంధ్ర వాల్మీకి రామాయణం' రాశారు. అందుకే ఆయనకు 'ఆంధ్ర వాల్మీకి' అనే బిరుదు వచ్చింది.
* విశ్వనాథ సత్యనారాయణ 'శ్రీమద్రామాయణ కల్పవృక్షం' రాశారు. తండ్రి ఆజ్ఞ, జీవుని వేదనల వల్ల రాశానని చెబుతూ తమ ఇలవేల్పు నందమూరి ఈశ్వరునికి అంకితమిచ్చారు. శ్రీమద్రామాయణ కల్పవృక్ష రచనకే తెలుగు కవికి తొలి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. (కొందరు 'వేయిపడగలు' నవలకి వచ్చిందని భావిస్తారు. అది సరికాదు).
 * రామాయణంలో విశ్వనాథ ఇలా అంటారు...
     ''రసము వేయి రెట్లు గొప్పది నవకథాధృతిని మించి"
 * "What is Ramayana to me?" అనే ఆంగ్ల రచన కూడా విశ్వనాథ వారిదే. 
* వచనంలో పురిపండా అప్పలస్వామి వ్యావహారిక భాషలో రామాయణం రాశారు. ఉషశ్రీ వచన రామాయణం చాలా ప్రసిద్ధికెక్కింది. శ్రీనివాస శిరోమణి, బేతవోలు రామబ్రహ్మం లాంటివారు వచన రామాయణాలు రాశారు. విహారి, మల్లెమాల లాంటి వారు పద్యాల్లో రామాయణాలు రాశారు. జానపద కళారూపాలకు రామాయణమే మూలం.
 * ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణానికి తెలుగు వ్యాఖ్యానంతో పుస్తకం రచించారు.

 

Posted Date : 28-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు