• facebook
  • whatsapp
  • telegram

Non Local Seats: 15 శాతం స్థానికేతర కోటా యథాతథం

* తెలంగాణ విద్యాసంస్థల్లోని కన్వీనర్‌ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులూ చేరొచ్చు

* 2024-25 విద్యాసంవత్సరానికి పాత విధానమే వర్తింపు


ఈనాడు, హైదరాబాద్‌: కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. దానివల్ల ఏపీ విద్యార్థులు కూడా కన్వీనర్‌ కోటాలోని 15 శాతం స్థానికేతర(నాన్‌లోకల్‌) సీట్లకు పోటీ పడి దక్కించుకోవచ్చు. ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. జూన్‌ 2వ తేదీలోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ వెలువరించినందువల్ల ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.


ఏమిటీ 15 శాతం?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థల్లోనూ ఏపీ విద్యార్థులు సీట్లు పొందేందుకు వీలుగా.. కన్వీనర్‌ కోటాలోని 15 శాతం స్థానికేతర(నాన్‌లోకల్‌) సీట్లకు వారు కూడా ప్రవేశాలకు పోటీపడేలా అప్పటివరకు ఉన్న విధానాన్ని పదేళ్లపాటు పొడిగించారు. 2014 జూన్‌ 2న అమలులోకి వచ్చిన ఈ విధానం.. 2024 జూన్‌ 2వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. 2014 నుంచీ ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నాన్‌లోకల్‌ కోటా కింద ఏపీ విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. ఎప్‌సెట్‌తోపాటు వివిధ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద ఉన్న సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. అందులో మెరిట్‌ను బట్టి ఏపీ విద్యార్థులకు సీట్లు దక్కుతాయి. దీని ప్రకారం ప్రతిఏటా సుమారు 4 వేల మంది ఏపీ విద్యార్థులు కన్వీనర్‌ కోటా కింద తెలంగాణలోని విద్యాసంస్థల్లో బీటెక్‌లో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ మినహాయింపు అమలుకు జూన్‌ 2వ తేదీకి పదేళ్లు పూర్తవుతుంది. అలాంటప్పుడు 2024-25 విద్యాసంవత్సరానికి 15 శాతం నాన్‌లోకల్‌ కోటా సీట్లకు ఏపీ విద్యార్థులు పోటీపడవచ్చా? లేదా? అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలియజేయాలంటూ ఉన్నత విద్యామండలి గత డిసెంబరులోనే లేఖ రాయడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డితో జనవరిలో జరిగిన సమావేశం సందర్భంగా చర్చ జరిగింది. ఈసారికి పాత విధానంలోనే ప్రవేశాలు జరపాలని అప్పట్లోనే ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాతే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎప్‌సెట్‌కు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌కు 49,063 మంది ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేయగా.. 44,889 మంది పరీక్ష రాశారు. వీరిలో 34,621 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌కు 12,352 మంది దరఖాస్తు చేశారు. వారిలో 10,254 మంది పరీక్షకు హాజరు కాగా.. 9,597 మంది పాసయ్యారు. వీరందరూ కన్వీనర్‌ కోటాలో 15 శాతం స్థానికేతర కోటా సీట్లకు పోటీ పడేందుకు అర్హత సాధించారు.


ప్రవేశ పరీక్షల నోటిఫికేషనే ప్రాతిపదిక 

ఏపీ విద్యార్థులు ప్రధానంగా బీటెక్‌ సీట్లకే పోటీపడుతుంటారు. ఆయా ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఫిబ్రవరి, మార్చిలలో జారీ అయ్యాయి. అయితే ప్రవేశాల నోటిఫికేషన్‌(కౌన్సెలింగ్‌ షెడ్యూలు) జూన్‌ 2వ తేదీ తర్వాత జారీ చేస్తే ఏపీ పునర్విభజన చట్టం వర్తించదని, కన్వీనర్‌ కోటాలోని 100 శాతం సీట్లూ తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకే దక్కుతాయని కొద్ది నెలల క్రితం వరకు భావిస్తూ వచ్చారు. 

పరీక్ష రాసిన వారికి ప్రవేశాలు ఇవ్వకపోవడం న్యాయం కాదని, ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ జూన్‌ 2వ తేదీలోపు వచ్చిందా? లేదా? అన్నది మాత్రమే చూడాలని విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. పరీక్ష రాసిన తర్వాత సీట్లు ఇవ్వకపోతే విద్యార్థులు న్యాయస్థానానికి వెళ్లే అవకాశముందని.. దాంతో సమస్యలు వస్తాయని అధికారులు భావించారు. ఇప్పటికే ఎప్‌సెట్‌ కన్వీనర్‌ కోటాలో 20 శాతం సీట్లు మిగిలిపోతున్నాయని భావించిన ప్రభుత్వం.. ఈసారికి యథావిధిగా స్థానికేతర కోటా వర్తింపజేస్తామని స్పష్టంచేసింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.