• facebook
  • whatsapp
  • telegram

సిలబస్‌ అంతా చదవాలి.. ప్రశ్నలు సాధన చేయాలి!

ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో గేట్‌ టాప్‌ర్యాంకర్‌ ప్రణీత్‌కుమార్‌ సూచనలు

మొదటిసారి గేట్‌ రాశాడు. ఆశించిన ర్యాంకు రాలేదు. రెండోసారి పట్టుదలతో కృషి చేశాడు. ఏకంగా అఖిలభారత స్థాయి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు! గేట్‌ పరీక్షలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో టాప్‌ ర్యాంకులో నిలిచిన  ప్రణీత్‌కుమార్‌ తన విజయ ప్రస్థానం గురించి ఏం చెపుతున్నాడో చూద్దామా?

మాది ఖమ్మం జిల్లా మధిర. రహదారి పక్కన చిన్న బడ్డీ దుకాణంలో టైలరింగ్‌ మెటీరియల్‌ విక్రయించే చిరువ్యాపారి మా నాన్న. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా నేను చదువులో రాణిస్తున్నానని తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించి చదివించారు. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌)లో మంచి స్కోరు సాధిస్తే ఐఐటీలూ, ఐఐఎస్‌సీ లాంటి ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ఎంటెక్‌ చేయడంతో పాటు ప్రభుత్వ రంగసంస్థల్లో మంచి ఉద్యోగం సాధించవచ్చు. ఇదే లక్ష్యంతో.. అలహాబాద్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ ముగిసిన తర్వాత 2021లో గేట్‌ రాశాను. ప్రిపరేషన్‌ ఆలస్యంగా మొదలుపెట్టటం వల్ల వ్యవధి లేక రివిజన్‌ సరిగా చేయలేకపోయాను. టెస్ట్‌ సిరీస్‌ కూడా రాయలేకపోయాను. దీంతో వెయ్యిలోపు ర్యాంకు వచ్చింది.

మళ్లీ 2022లో పరీక్షకు సిద్ధమయ్యాను. ఆఖరి నాలుగు నెలలూ జెనిక్‌ ఎడ్యుకేషన్‌లో ఆన్‌లైన్‌ రివిజన్‌ కోర్సు తీసుకున్నాను. ఇది రివిజన్‌కీ, ప్రాబ్లమ్‌ ప్రాక్టీస్‌కీ ఉపయోగపడింది. ఈ రెండో ప్రయత్నంలో నా లోపాలు సవరించుకున్నాను. బాగా సాధన చేశాను. సమగ్రంగా రివిజన్‌ చేసి టెస్ట్‌ సిరీస్‌ రాసి మెరుగుపరుచుకున్నాను. దాంతో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధ్యమైంది. తల్లితండ్రుల ఆకాంక్షను నెరవేర్చినందుకు ఆనందంగా ఉంది. 

గేట్‌ ప్రధానంగా ప్రాబ్లమ్స్‌ ఓరియంటెడ్‌ పరీక్ష. స్టాండర్డ్‌ ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చెయ్యాలి. పరీక్షలో క్లిష్టమైన ప్రశ్నలకు ఎక్కువ సమయం తీసుకోకూడదు. అలాంటి పరిస్థితిలో వెంటనే మరో ప్రశ్నకు వెళ్లిపోవాలి. వదిలిపెట్టిన ప్రశ్నలను చివర్లో చూడాలి.

గేట్‌ అభ్యర్థులు చేసే పొరపాట్ల గురించి చెప్పాలంటే... రివిజన్‌ చేయకపోవడం ప్రధానమైనది. ప్రాక్టీస్‌ చేయకపోవడం, టెస్ట్‌ సిరీస్‌ రాయకపోవడం కూడా సవరించుకోవాల్సినవే. మంచి ర్యాంకు ఆశించేవారు పూర్తి సిలబస్‌ చదవాలి. ప్రశ్నలను సాధన చేయాలి. ప్రతి సబ్జెక్టులో షార్ట్‌ నోట్స్‌ రాయాలి. ఇది రివిజన్‌కు చాలా ఉపయోగపడుతుంది. టెస్ట్‌ సిరీస్‌లు రాయటం తప్పనిసరి. 

నేనిప్పుడు ఈఎస్‌ఈ (ఐఈఎస్‌)కు సిద్దమవుతున్నాను. ఈ పరీక్ష ప్రిలిమ్స్‌లో టెక్నికల్‌ నాలెడ్జ్‌తో పాటు జనరల్‌ స్టడీస్‌కు ప్రత్యేకంగా చదవటం ముఖ్యం. మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలకు తగినంత సాధన అవసరం.

గేట్‌లో మంచి ర్యాంకు రావాలంటే.. పూర్తి సిలబస్‌ చదవాలి. ప్రశ్నలను బాగా సాధన చేయాలి. ప్రతి సబ్జెక్టులో షార్ట్‌ నోట్స్‌ రాయాలి. ఇది రివిజన్‌కు చాలా ఉపయోగం. టెస్ట్‌ సిరీస్‌ రాయటం తప్పనిసరి.

మాచర్ల ప్రణీత్‌కుమార్‌

తల్లిదండ్రులు: మాచర్ల శ్రీనివాసరావు, రమామణి

పాఠశాల: సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌. పదోతరగతి. జీపీఏ 9.7

ఇంటర్‌: నారాయణ జూనియర్‌ కళాశాల, విజయవాడ. 959 మార్కులు

బీటెక్‌: ఎన్‌ఐటీ, అలహాబాద్‌

గేట్‌ : రిఫరెన్స్‌ పుస్తకాలు

ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌: పీఎస్‌ బింభ్రా

కంట్రోల్‌ సిస్టమ్స్‌: నగారత్‌ అండ్‌ గోపాల్‌

మెజర్‌మెంట్స్‌: ఏకే సాహ్నీ

ఎనలాగ్‌ ఎలక్ట్రానిక్స్‌: రాబర్ట్‌ ఎల్‌ బాయ్‌లెస్టాడ్‌ 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ IIT Madras‌: ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌ బీఎస్సీ

‣ అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ అలా సాధించారు!

‣ ఏఈ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

‣ సర్కారు కొలువుకు సిద్ధమయ్యే ముందు..!

‣ నేర్పుగా... ఓర్పుగా!

‣ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు ప్రారంభించండి ప్రిపరేషన్‌!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-03-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌