• facebook
  • whatsapp
  • telegram

GATE: గెలుద్దాం.. గేట్‌!

మేటి స్కోరుకు మెలకువలు

గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) - 2023 ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష స్కోరుతో మనదేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనం లభిస్తుంది. ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఉపయోగపడుతుంది. నెలకు రూ.31,000 ఉపకార వేతనమూ లభిస్తుంది. కొన్ని పబ్లిక్, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకూ ఈ స్కోరు ప్రామాణికంగా ఉంది. ఇంత ప్రాముఖ్యమున్న గేట్‌లో గరిష్ఠంగా మార్కులు సాధించేదెలాగో సూచనలు.. ఇవిగో!  

నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న పరీక్ష గేట్‌. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలతోపాటు ఐఐఎస్‌సీ బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో ప్రవేశం లభించాలంటే ఈ పరీక్ష రాయాల్సిందే. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా మంత్రిత్వశాఖ తరపున ఈ సంవత్సరం గేట్‌ను 29 పేపర్లలో ఐఐటీ-కాన్పూర్‌ నిర్వహిస్తోంది. ఈ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది.

గేట్‌-2023ను రెండు పేపర్లలో రాసే అవకాశం ఉంది. విద్యార్థులు తప్పకుండా రెండు పేపర్లలో పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. తమ ఇష్టప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకోవచ్చు. గేట్‌ను మన దేశంలోనే కాకుండా దుబాయ్‌ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌), ఢాకా (బంగ్లాదేశ్‌), కట్మాండు (నేపాల్‌), సింగపూర్‌ దేశాల్లోనూ నిర్వహిస్తున్నారు.. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, సూర్యాపేట.

ఆంధ్రప్రదేశ్‌: విజయవాడ, గుంటూరు, గూడూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, చీరాల, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు. 

విద్యార్హతలు

బీఈ (4 సంవత్సరాల కోర్సు)/ బీటెక్‌ (4 సంవత్సరాల కోర్సు)/ బీఆర్క్‌ (5 సంవత్సరాల కోర్సు)/ బీఫార్మ్‌ 

ప్రస్తుతం మూడో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదివే విద్యార్థులు, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు అర్హులు. 

బీఎస్సీ (రిసెర్చ్‌)/ బీఎస్‌ (4 సంవత్సరాల కోర్సు)

‣ ప్రస్తుతం మూడో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదివే విద్యార్థులు, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు అర్హులు. 

ఎంఎస్సీ/ ఎంసీఏ/ఎంఏ లేదా తత్సమానం

ప్రస్తుతం మొదటి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదివే విద్యార్థులు, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు అర్హులు. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంఈ/ఎంటెక్‌ (పోస్ట్‌ బీఎస్సీ)

ప్రస్తుతం మొదటి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదివే విద్యార్థులు అర్హులు. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంఈ/ఎంటెక్‌ లేదా డ్యూయల్‌ డిగ్రీ (డిప్లొమా తర్వాత లేదా 10+2) (5 ఏళ్ల ప్రోగ్రామ్‌).

ప్రస్తుతం మూడో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదివే విద్యార్థులు, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు అర్హులు. 

పరీక్షా విధానం

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో కంప్యూటర్‌ మౌస్‌ ఉపయోగించిన సరైన సమాధానం గుర్తించాలి. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు. గేట్‌ ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకుగాను 65 ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి. 

విభాగం-1 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌)

ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఐదు ఒక మార్కు ప్రశ్నలు, మరో ఐదు రెండు మార్కుల ప్రశ్నలు. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధిత (వెర్బల్‌ ఎబిలిటీ), మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వొచ్చు. 

రోజువారీ వార్తాపత్రికలు చదవడం, ఇతర కాంపిటేటివ్‌ పరీక్షలకు (క్యాట్‌) సంబంధించిన గత ప్రశ్నపత్రాలు సాధన చేయడం ద్వారా ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.  

విభాగం-2 (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టు)

ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు, 30 రెండు మార్కుల ప్రశ్నలుంటాయి. 

గణితం నుంచి 10 - 15 మార్కులు ఉంటాయి. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి. ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి.  

ఏ రకం ప్రశ్నలు?

1. బహుళైచ్ఛిక ప్రశ్నలు: నాలుగు ఆప్షన్లు ఇస్తారు. అందులో ఒకటి మాత్రమే సరైన సమాధానం. దాన్ని మాత్రమే గుర్తించాలి. 

2. బహుళ ఎంపిక ప్రశ్నలు: ఇవీ బహుళైచ్ఛిక ప్రశ్నలుగానే ఉంటాయి. కానీ ఇందులో ఒకటికంటే ఎక్కువ సరైన ఆప్షన్‌లు ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం రావడానికి అన్ని సరైన ఆప్షన్‌లనూ గుర్తించాలి. 

3. సంఖ్యా (న్యూమరికల్‌) సమాధాన ప్రశ్నలు: వీటిలో ఎలాంటి ఆప్షన్‌లూ ఇవ్వరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్‌ కీబోర్డును ఉపయోగించి రాయాలి. సమాధానం రాసేటప్పుడు తగిన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే సమాధానంలో పక్కన యూనిట్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దగ్గర స్థాయిలో ఇవ్వొచ్చు. సరైన సమాధానం 92.24 అయితే 92.23 నుంచి 92.25 మధ్యలో సమాధానం రాసినా కరెక్టుగానే పరిగణించి మార్కులు ఇస్తారు. 

వర్చువల్‌ కాలిక్యులేటర్‌

పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్, మొబైల్స్‌ను అనుమతించరు. అభ్యర్థులు కాలిక్యులేషన్స్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ వర్చువల్‌ కాలిక్యులేటర్‌ అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్‌ మౌస్‌ని ఉపయోగించి ఈ కాలిక్యులేటర్‌ని వాడుకోవచ్చు 

ర్చువల్‌ కాలిక్యులేటర్‌లో అన్ని రకాల ఫంక్షన్స్‌ లేకపోవడం వల్ల, తదనుగుణంగా ప్రశ్నలు రూపొందించవచ్చు. 

ఇమాజినరీ ఫంక్షన్స్, హైయర్‌ ఆర్డర్‌ సమీకరణాల ప్రశ్నలు అడగకపోవచ్చు.

గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున రుణాత్మక మార్కులు ఉంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నలకు, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 30 ఆగస్టు 2022 

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు గడువు: 30 సెప్టెంబరు 2022

గేట్‌ 2023 పరీక్ష తేదీలు: 4, 5, 11, 12 ఫిబ్రవరి, 2023

పరీక్షా ఫలితాల వెల్లడి: 16 మార్చి 2023

వెబ్‌సైట్‌: https://gate.iitk.ac.in/

సన్నద్ధత వ్యూహం

గేట్‌ - 2023 ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. అంటే దాదాపుగా 7 నెలల సమయం ప్రిపరేషన్‌కు అందుబాటులో ఉంది.

పరీక్ష సమయానికి చాలా ముందుగానే సన్నద్ధత మొదలుపెట్టడం వల్ల ప్రామాణిక పుస్తకాలు, సంబంధిత మెటీరియల్‌ను సమకూర్చుకోవచ్చు. సిలబస్‌లో ఉన్న కాన్సెప్ట్స్, విషయాలను బాగా సాధన చేసుకోవచ్చు. ఇది గేట్‌ విజయ సాధనలో ముఖ్య ఘట్టం. 

సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఏ సబ్జెక్టుల్లో ఏయే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అవగతం అవుతుంది. దీంతోపాటు పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడమూ ముఖ్యమే. దీనివల్ల పరీక్షలోని విభాగాలపై, ప్రశ్నల సాధనపై స్పష్టత వస్తుంది. 

గత గేట్‌ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా సాధన చేయాలి. దీంతో ఏ అంశాలపై ఏ కాన్సెప్ట్‌కు ఎటువంటి ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది. వేటిపై ఎక్కువ దృష్టి పెట్టాలో తెలుస్తుంది.  

గత గేట్‌ ప్రశ్నపత్రాలతోపాటు ఈఎస్‌ఈ, ఇస్రో, పీఎస్‌యూల నియామక పరీక్షాపత్రాలను సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగవచ్చో తెలుస్తుంది.

అన్ని సబ్జెక్టులకూ, అన్ని అంశాలకూ గేట్‌లో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి సన్నద్ధతలో అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. 

ప్రిపరేషన్‌లో సమయపాలన చాలా కీలకం. ఏరోజు కేటాయించుకున్న అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి.

ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలపై చిన్నచిన్న పట్టికలను తయారు చేసుకోవాలి.

క్లిష్టమైన, సాధారణ, అతి సాధారణ అంశాలకు కూడా ప్రిపరేషన్లో సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రతి చాప్టర్, సబ్జెక్టు చదివిన తర్వాత దానికి సంబంధించి ప్రముఖ విద్యాసంస్థలు అందించే ఆన్‌లైన్‌ టెస్టులను రాయాలి. ప్రిపరేషన్‌ పూర్తయితే మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్‌ టెస్టులు) రాయాలి. దీనివల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.  

చాప్టర్లు, సబ్జెక్టులవారీ మాక్‌ టెస్టులు, నమూనా ప్రశ్నపత్రాల సాధనలో తప్పుగా రాసిన ప్రతి సమాధానాన్ని సవరించుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. ఈ తరహా కసరత్తుతో పరీక్ష సమయంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి. 

ఎన్‌టీపీఎల్‌ పాఠాలు విద్యార్థులకు ప్రాథమిక అంశాల అవగాహనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికీ ఉపయోగపడతాయి. 

గత సంవత్సరపు ప్రశ్నపత్రాల్లో ఒక ప్రశ్నపత్రాన్ని పరీక్షకు కేటాయించిన సమయంలో రాయడానికి ప్రయత్నిస్తే అభ్యర్థులకు తాము ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది. 

పునశ్చరణ: పునశ్చరణ అనేది పరీక్షకు చాలా కీలకమైనది. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. ప్రిపరేషన సమయంలో తయారుచేసుకున్న చిన్నచిన్న పట్టికలను ఈ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ తరగతులైతే..

కరోనా అనంతరం చాలామంది అభ్యర్థులు ఆన్‌లైన్‌ తరగతులవైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ఈ ఆన్‌లైన్‌ తరగతులను సమర్థంగా అర్థం చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌/స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ను అధ్యాపకులు ముందుగా తెలియజేస్తారు. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మొదలైనవాటికీ¨, గ్రాఫిక్స్‌ ఎక్కువగా వాడితే చాలా హయ్యర్‌ ఎండ్‌ కావాల్సి ఉంటుంది. మామూలు తరగతులకు సాధారణ పరికరాలు సరిపోతాయి. 

ఎంత డేటా కావాలనేది అధ్యాపకులు వాడే టెక్నాలజీని బట్టి, తరగతుల సమయాన్ని బట్టి ఉంటుంది. స్మార్ట్‌బోర్డ్‌ వాడితే ఎక్కువ డేటా అవసరమవుతుంది.

మనం వాడే ఎలక్ట్రానిక్‌ పరికరానికి వాట్సాప్, మెయిల్స్, ఇతర మెసేజ్‌లు రాకుండా నిరోధించాలి. లేకపోతే అవి మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.

హెడ్‌ ఫోన్స్‌ వాడటం కొంతవరకు మంచిది.

ఇంట్లో సరైన గాలీ, వెలుతురూ ఉండే, ఇతరత్రా వాటివల్ల ఏకాగ్రతకు భంగం కలగని స్థలం ఎన్నుకోవాలి. అనువుగా ఉండే టేబుల్, కుర్చీ, రైటింగ్‌ పాడ్, కాలిక్యులేటర్, నోట్‌బుక్స్, పెన్నులు, హైలైటర్, తెల్లకాగితాలు ఉంచుకోవాలి. 

ఉపాధ్యాయులు మనతో లేనందువల్ల  లైవ్‌చాట్‌ బాక్స్‌ ద్వారా మన సందేహాలకు సమాధానం తెలుసుకోవచ్చు. ఈమెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్‌ యాప్‌ల ద్వారా కూడా చాలామంది అధ్యాపకులు సందేహ నివృత్తి చేస్తారు.

అపోహలూ వాస్తవాలూ

గేట్‌ పరీక్షలో సిలబస్‌ చాలా ఎక్కువ

ఇది వాస్తవం కాదు. నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో చదివే సిలబస్‌తో పోలిస్తే గేట్‌ సిలబస్‌ 60 శాతం మాత్రమే. మొత్తం ఇంజినీరింగ్‌ బ్రాంచికి సంబంధించిన మూలాలు, నూతన పోకడలు మాత్రమే గేట్‌ సిలబస్‌లో ఉంటాయి. ఒక పెద్ద కొండ సైతం రోజుకో బండ తొలగిస్తే కొంత కాలానికి మటుమాయమవుతుంది. రోజుకు రెండునుంచి మూడు గంటలు ఒక్కో కాన్సెప్ట్‌ను అర్థం చేసుకుంటూ ముందుకుపోతే అందుబాటులో ఉన్న సమయంలో మొత్తం సిలబస్‌ సన్నద్ధత పూర్తిచేసుకోవచ్చు.

గేట్‌లో కేవలం ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులే విజేతలు అవుతారు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి కష్టం.

ఇది పూర్తిగా అవాస్తం. గత విజేతల వివరాలు విశ్లేషిస్తే చాలామంది సాధారణ కళాశాలల నుంచి చదివినవారే. ఎంతోమంది ఇంటర్మీడియట్‌ వరకు మాతృభాషలో చదివిన గ్రామీణ నేపథ్యం కలిగినవారే. . 

కేవలం బీటెక్‌లోని మెరిట్‌ విద్యార్థులే గేట్‌లో విజయం సాధిస్తారు.

ఇది నిజం కాదు. పట్టుదల, ఏకాగ్రత, దృఢ చిత్తంతో కృషిచేసి గొప్ప ర్యాంకులు సాధించిన సగటు బీటెక్‌ విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. 

గేట్‌లో నెగ్గాలంటే ఇంజినీరింగ్‌ తర్వాత కనీసం ఒక సంవత్సరం పూర్తిగా చదవాలి. 

ఇది కూడా అపోహే. గత గేట్‌ పరీక్షల్లోని విజేతలను పరిశీలిస్తే ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం, ఆఖరి సంవత్సరం చదువుతోన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ డిగ్రీ కళాశాలలు

‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!

‣ ప‌క్కాగా ప‌రిచ‌యం!

‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు

Posted Date : 01-08-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌