• facebook
  • whatsapp
  • telegram

DSC: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులా?

డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం

ఈనాడు, అమరావతి: సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పింది. ఒకానొక దశలో డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్‌ టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని అభ్యర్థించారు. హాల్‌ టికెట్లను ఫిబ్రవరి 22 నుంచి జారీచేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరాలు సమర్పించేందుకు విచారణను 21కి వాయిదా వేయాలని కోరారు. ఈ మేరకు ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఫిబ్రవరి 12న రాష్ట్రప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లో.. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ డిగ్రీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా జెట్టిపాలెం గ్రామానికి చెందిన భుక్యా గోవర్ధన సాయినాయక్‌ మరో నలుగురు డీఈడీ అభ్యర్థులు, హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇదే విషయాన్ని  సవాలుచేస్తూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్‌ మరో వ్యాజ్యం వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం విద్యాహక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ఎస్‌జీటీలు ఒకటి నుంచి అయిదో తరగతికి బోధన చేస్తారన్నారు. డీఈడీ(డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించడం సబబు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రప్రభుత్వం ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తోందన్నారు. ప్రక్రియను నిలువరించాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు తెచ్చామన్నారు. మూడు నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక విద్య పరిధిలోకి తెచ్చామన్నారు. ఈ నేపథ్యంలో బోధనకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులిద్దరూ అవసరమన్నారు. టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటీస్‌ కింద రెండేళ్లు శిక్షణ ఉంటుందన్నారు. దీంతో ఎస్‌జీటీలు.. ఉన్నత పాఠశాల విద్యార్థులకు, బీఈడీలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధించడం సాధ్యం అవుతుందన్నారు. మరోవైపు ఎంపికైన టీచర్లు ఎన్‌సీటీఈ నిర్వహించే ఆరు నెలల బ్రిడ్జ్‌ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు.

ఒక వైపు శిక్షణ, మరోవైపు బోధన ఏవిధంగా సాధ్యం: ధర్మాసనం

ధర్మాసనం స్పందిస్తూ.. టీచర్లుగా ఎంపిక ప్రక్రియ ముగిశాక వారికి శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని అంగీకరించలేమని పేర్కొంది. ఒక వైపు శిక్షణ, మరోవైపు పిల్లలకు బోధన ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది. నోటిఫికేషన్‌పై స్టే ఇస్తామని, హాల్‌ టికెట్లు జారీచేయవద్దని వ్యాఖ్యానించింది. ఏజీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకొని వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. సమయం కావాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ ఆరు నెలల బ్రిడ్జ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను సైతం సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి కోర్టును తప్పుదోవపట్టిస్తోందన్నారు. ఏజీ అభ్యర్థన మేరకు విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.