• facebook
  • whatsapp
  • telegram

‘బడి బయట’ అసలు ఎంతమంది?   

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల నేపథ్యంలో బడి మానేసే పిల్లల సంఖ్య భారీగా పెరగనుందని విద్యావేత్తలు అంచనా వేస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఆ సంఖ్య రెట్టింపు కానుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తోంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా బడికి వెళ్లని పిల్లల సంఖ్యను రాష్ట్రాలు భారీగా తగ్గించి చూపుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. వివిధ సర్వేల్లో వెల్లడవుతున్న లెక్కల మధ్య భారీ తేడాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్‌ సర్వే 2019 - 20 ప్రకారం దేశవ్యాప్తంగా బడి బయటి పిల్లల (6 - 14 ఏళ్ల మధ్య) సంఖ్య 11 లక్షలు కాగా.. 2017 - 18 ఇంటింటి సర్వేలో ఈ సంఖ్య దాదాపుగా 97 లక్షలుగా తేలింది. 6 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లని వారి సంఖ్య 3.11 కోట్లని ఇదే సర్వే స్పష్టం చేస్తోంది. ఒక్కో సర్వేలో ఒక్కోలా లెక్కలు ఉండడం.. తదుపరి చర్యలపైనా ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో పాఠశాలలకు వెళ్లలేక నష్టపోతున్న విద్యార్థులను గుర్తించి ఎలా న్యాయం చేస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బడి బయటి విద్యార్థులందరినీ విద్యకు చేరువ చేయాలని, 2030 నాటికి 100 శాతం మంది పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలని, డ్రాపౌట్లు ఉండరాదని జాతీయ నూతన విద్యా విధానంలో కేంద్రం లక్ష్యం విధించింది. 

 

8వ తరగతితోనే ముగింపు! 

సమగ్ర శిక్షా అభియాన్, విద్యా హక్కు చట్టాల ద్వారా పిల్లలందరినీ ప్రాథమిక విద్యలో చేర్చడంలో గణనీయమైన పురోభివృద్ధి సాధించారు. అయితే వారిని పాఠశాల వ్యవస్థలో కొనసాగేలా చేయడంలో తీవ్ర సమస్యలు ఉన్నట్లు తేలింది. 6 - 8 తరగతుల్లో పాఠశాలల్లో చేరే మొత్తం పిల్లల నిష్పత్తి (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) 90.90 శాతం ఉండగా.. 9 - 10 తరగతులకు వచ్చే సరికి 79.30 శాతం, ఇంటర్‌లో 56.50 శాతానికి పడిపోతోంది. 8వ తరగతి అనంతరం విద్యార్థులు ఎక్కువగా బడి మానేస్తున్నట్లు ఇది సూచిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి 6-14 సంవత్సరాల వారు కాకుండా 6-18 సంవత్సరాల మధ్య బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించాలని కేంద్ర విద్యాశాఖ జనవరిలో మార్గదర్శకాలు జారీచేసింది.

 

తెలంగాణలో విద్యార్థులపై లెక్కలివీ..

సమగ్ర శిక్షా అభియాన్‌ 2019-20 సర్వే ప్రకారం

బడి బయటి పిల్లలు (6 - 14 ఏళ్లు): 20,266 

2020-21 సర్వే ప్రకారం (6 - 14 ఏళ్లు): 11,000 

ఇదే సర్వేలో 6 - 18 వయసు పిల్లలు: 17,000

2017-18 ఇంటింటి సర్వే ప్రకారం బడిబయట ఉన్న 6 - 18 సంవత్సరాల వారు: 1,94,545

రెండింటి మధ్య తేడా: దాదాపు 11 రెట్లు 

Posted Date : 14-06-2021