• facebook
  • whatsapp
  • telegram

Bhuvaneshwar: కూలీగా చేసిన చోటే... అంతర్జాతీయ స్కూల్‌ కట్టాడు!


భవన నిర్మాణమో, భారీ కాలువల తవ్వకమో ఏదైనా సరే... అక్కడి కూలీలతోపాటూ వారి ముక్కుపచ్చలారని చిన్నారులూ రాళ్ళెత్తడం చూశారా? ఈసారి చూస్తే వాళ్ళని దగ్గరకు పిలిచి ఆదరణగా ఓ మాట మాట్లాడండి. వీలైతే వాళ్ళ చదువుకు చిన్నసాయమేదైనా చేయండి. ఏమో...ఆ పిల్లల్లో డాక్టర్‌ ప్రదీప్‌ సేథీలాంటివాళ్ళూ ఉండొచ్చు. మీరు చూపిన ఆదరణతో బాగా చదువుకుని, ఆ కరుణని గుండెలో వెయ్యిరెట్లు పెంచుకుని వేలాదిమందికి పంచొచ్చు. ఏమో... ఆయనలాగే పల్లెటూరి పిల్లలకి ఉచితంగా విద్యాబోధన చేసే ఇంటర్నేషనల్‌ స్కూల్‌నీ స్థాపించొచ్చు!
 

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెరునపడి. ఆ రాష్ట్రంలోని కెందుజార్‌ జిల్లాలో ఓ చిన్న కుగ్రామం అది. డాక్టర్‌ ప్రదీప్‌ సేథి స్థాపించిన ‘ఉత్కళ్‌ గౌరవ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ అక్కడే ఉంటుంది. కేవలం పేరులో మాత్రం ‘ఇంటర్నేషనల్‌’ని ఇముడ్చుకున్న బడి కాదు ఇది... అమెరికా, లండన్‌, జపాన్‌లలో పనిచేస్తున్న ఎన్నారై అధ్యాపకులు ఇక్కడికి గెస్ట్‌లెక్చరర్స్‌గా వస్తుంటారు. రోజూ యోగా, డ్యాన్స్‌, సంగీత, చిత్రలేఖన కళల్లో సాధనం చేయించడంతో పాటు... తోటపని, వ్యవసాయంలోనూ శిక్షణ ఇచ్చే ఈ బడిలో మిడిల్‌ స్కూల్‌ స్థాయి నుంచే విద్యార్ధుల్ని వివిధ ప్రవేశపరీక్షలకి సిద్ధం చేస్తారు. హైస్కూలు తరగతులప్పుడే ప్రీ-ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ ఇస్తున్నారు. ఎల్‌కేజీ నుంచి 12 వరకూ ఎవరికైనా పూర్తి ఉచితంగా విద్యని అందిస్తున్నారు. పైగా- యూనిఫామ్‌, పుస్తకాలూ కూడా ఫ్రీయే ఇక్కడ! ‘పైసా ఫీజు తీసుకోకుండా ఇవన్నీ ఎలా చేస్తున్నారూ? ఎందుకూ?’ అన్న సందేహం వస్తే ఈ స్కూల్‌ ప్రాంగణంలో ఉన్న యోగాకేంద్రానికి వెళ్ళాలి మనం. ఆ కేంద్రం ఉన్న స్థలంలో ఒకప్పుడు వరి పొలం ఉండేదట. ఆ పొలంలోనే ఒకప్పుడు బాలకార్మికుడిగా పనిచేశాడట డాక్టర్‌ ప్రదీప్‌!
 


పస్తులు అలవాటై...

ప్రదీప్‌ సేథీ అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు. ఊహ వచ్చినప్పటి నుంచీ వాళ్ళతోపాటే పనులకి వెళ్ళసాగాడు. సాగులేని రోజుల్లో- పక్కగ్రామాల్లో చేపడుతున్న భారీ కాల్వల నిర్మాణంలో మట్టి గంపలు మోసేవాడు. ఆ పనులూ లేని కాలంలో- తిండి గింజలూ దొరక్క పస్తులుండేది ఆ కుటుంబం. ‘నాకు బాగా గుర్తుంది. నా తొమ్మిదో ఏట నుంచి 12వ ఏడు దాకా... మూడేళ్ళు మా ఊరు తీవ్ర కరవుని ఎదుర్కొంది. రోజులో ఒక్కపూట గంజిమాత్రమే తాగి బతుకీడ్చాం’ అని గుర్తుచేసుకుంటాడు ప్రదీప్‌. ఆ కష్టంలోనూ నవోదయ స్కూల్‌లో సీటు సాధించాడు ప్రదీప్‌. అది రెసిడెన్షియల్‌ స్కూల్‌ కావడంతో ఆకలిబాధ తప్పింది. చిన్నప్పటి నుంచీ పడ్డ కష్టాలు కసి పెంచాయేమో- చదువులో ముందు నిలిచి మెడిసిన్‌లో సీటు సాధించాడు. నిజానికి, ఆ తర్వాతే అతని కష్టాలు పెరిగాయి.
 



గని కార్మికుడిగా...

ఎంబీబీఎస్‌ తొలి ఏడాది ఫీజు రూ.25 వేలు కట్టడానికీ ప్రదీప్‌కి డబ్బుల్లేవు. దాంతో వాళ్ళకున్న అరెకరం పొలమూ, ఇల్లూ అమ్మేశారు. ఆ తర్వాతి ఏడాది అమ్ముకోవడానికి ఏమీ లేక- రాత్రుళ్ళు గని కార్మికుడిగా పనిచేసి ఫీజులు కట్టసాగాడు. అప్పుడే గని కార్మికులు కొందరు అతని కష్టాన్ని గమనించారు. తలాకొంత వేసుకుని నెలనెలా రూ.1800 ఇవ్వసాగారు. అలా మెడిసిన్‌ ముగించాడు ప్రదీప్‌. ఆ తర్వాత దిల్లీ ఎయిమ్స్‌లో- ఎండీ ‘డెర్మటాలజీ’ చేశాడు. తన బ్యాచ్‌మేట్‌ అరికా భన్సాల్‌ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. ఇద్దరూ కలిసి రుషికేష్‌లో క్లినిక్‌ పెట్టారు. అక్కడ రెండేళ్ళలోనే వైద్యుడిగా ప్రసిద్ధికెక్కాడు ప్రదీప్‌. 2013లో బట్టతల సమస్య ఉన్నవారి కోసం ‘డైరెక్ట్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ టెక్నాలజీ’ అనే సరికొత్త పద్ధతిని ఆవిష్కరించాడు. అప్పటికే ఉన్న జుట్టుమార్పిడి పద్ధతికన్నా అత్యంత వేగంగానూ, 98 శాతం సమర్థంగానూ పనిచేస్తున్న ఈ విధానంతో ప్రదీప్‌కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘యూజెనిక్స్‌’ అన్న పేరుతో హైదరాబాద్‌ సహా దేశంలో పలుచోట్ల చెయిన్‌ క్లినిక్‌లు ఏర్పాటుచేశాడు. వీవీఐపీలు అతణ్ణి ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఇన్ని విజయాల తర్వాతా తన మూలాలని మరిచిపోలేదు ప్రదీప్‌. కెరీర్‌లో పైపైకి ఎదుగుతున్నకొద్దీ... అతని మనసు మెల్లమెల్లగా పల్లెవైపే వెళ్ళసాగింది.
 


తండ్రి చనిపోతే...

ముందుగా- కొడుకు చదువుకోసమని తనకున్న చిన్న ఇంటిని సైతం అమ్మేసిన తండ్రి కోసం ఓ మంచి ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు ప్రదీప్‌. కానీ అది పూర్తయ్యేనాటికి వాళ్ళనాన్న క్యాన్సర్‌తో చనిపోయాడు. దాంతో కట్టిన ఆ ఇంటిని- కోచింగ్‌ సెంటర్‌గా మార్చాడు ప్రదీప్‌. బయటి ప్రాంతాల నుంచి అధ్యాపకులని రప్పించి, వాళ్ళకి బస ఏర్పాటుచేసి మరీ చుట్టుపక్కలున్న పల్లె యువతకి శిక్షణ ఇవ్వసాగాడు. అలా మూడేళ్ళలో మూడొందల మందిని రకరకాల కొలువుల్లో కూర్చోబెట్టగలిగాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే- ఆ గ్రామంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్థాపించాలనుకున్నాడు. రూ.10 కోట్ల ఖర్చుతో ఏడాదిన్నరలోనే ఆ కలని సాకారం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందులో 450 మంది గ్రామీణ విద్యార్థులు- పైసా ఖర్చు లేకుండా చదువుకుంటున్నారు. వచ్చే రెండేళ్ళలో ఆ సంఖ్యని రెండువేలకి పెంచడమే తన లక్ష్యమంటున్నాడు...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.