• facebook
  • whatsapp
  • telegram

PGECET: పీజీఈసెట్‌ ధ్రువపత్రాల అప్‌లోడ్‌ గడువు పెంపు

 

ఈనాడు, హైదరాబాద్‌: పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా బీటెక్, బీఫార్మసీ ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేసే గడువును అక్టోబరు 25వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన గడువు అక్టోబరు 18తో ముగిసింది. ప్రభుత్వం నుంచి బోధనా రుసుం విడుదల కాకపోవడంతో ఆయా కళాశాలలు విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదు. ఒకవేళ కావాలనుకుంటే సొంతగా సొమ్ములు చెల్లించాలనే షరతు విధిస్తున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు నిత్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీఈసెట్‌ కార్యాలయానికి ఫోన్లుచేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు బోధన రుసుం నిధులు విడుదల చేయాలంటూ ఎస్‌సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో మొరపెట్టుకుంటున్నారు. ఒక విద్యార్థిని తాజాగా మేడ్చల్‌ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈసారి సుమారు 18 వేల మంది పీజీఈసెట్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఏటా దాదాపు 12 వేల మంది వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొంటారు. ఈసారి గడువు ముగిసే నాటికి 7,500 మందే ఆయా ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ‘దాంతో గడువును వారంపాటు పొడిగించామని, సీట్లను నవంబరు 3వ తేదీన కేటాయిస్తామని, 15వ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని’ ప్రవేశాల కన్వీనర్‌ ఆచార్య రమేష్‌బాబు తెలిపారు.

Posted Date : 18-10-2021