• facebook
  • whatsapp
  • telegram

Gurukul students: అయిదు చదివినా.. మళ్లీ అదే తరగతికి!

* ఆన్‌లైన్‌ తరగతులు అందుబాటులో లేకపోవడమే కారణం

* 10 వేల మందికిపైగా గురుకుల విద్యార్థులకు ప్రభుత్వ అనుమతి

 

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2021-22 సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలకు అర్హత పొందినవారిలో 10 వేల మందికిపైగా విద్యార్థులు ఇప్పటికే ఆ తరగతి పూర్తి చేసినవారు ఉండటం విశేషం. గురుకుల సొసైటీల పరిధిలోని 604 పాఠశాలల్లో 48,320 సీట్లు ఉన్నాయి. అయిదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు 74 వేల మంది హాజరయ్యారు. మెరిట్‌ ప్రకారం తొలి జాబితాలో అర్హత సాధించినవారికి ప్రవేశాలు కల్పించారు. వీరిలో 10 వేల మందికిపైగా విద్యార్థులు అయిదో తరగతి పూర్తి చేసినట్లు గుర్తించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది పాఠశాలలు మూతబడటం, ఆన్‌లైన్‌ తరగతులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి అదే తరగతిలో ప్రవేశాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు గురుకుల సొసైటీల అధికారులకు విన్నవించారు. దీనిపై ప్రభుత్వానికి గురుకుల సొసైటీలు లేఖ రాయగా.. ఆ విద్యార్థులందరికీ అయిదో తరగతిలో తిరిగి ప్రవేశం కల్పించేందుకు అనుమతి ఇచ్చింది. 

 

90 శాతానికి పైగా సీట్ల భర్తీ

అయిదో తరగతి గురుకుల ప్రవేశాల్లో ఇప్పటికే 90 శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రవేశాలకు గడువు సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు. తొలి విడతలో మిగిలిన సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నారు. నెలాఖరులోగా రెండో దఫా మెరిట్‌ జాబితాను ప్రకటించి.. దసరా నాటికి కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు సొసైటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
 

Posted Date : 22-09-2021