• facebook
  • whatsapp
  • telegram

విదేశాల్లో చ‌ద‌వాల‌నుకునే వారికి ప్రత్యేక పోర్టల్‌

* వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురానున్న కేంద్రం

* కన్సల్టెన్సీలు, నకిలీ వర్సిటీల మోసాలకు ఇక కళ్లెం..

 

ఈనాడు, హైదరాబాద్‌: చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు అన్ని రకాల సమాచారాన్ని అందించి.. మార్గదర్శనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందిస్తోంది. గ్లోబల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ పోర్టల్‌ (జీఐఎస్‌పీ) పేరిట అభివృద్ధి చేస్తున్న దీన్ని 2022లో అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. దీనివల్ల విద్యార్థులు అధికారిక సమాచారం పొందే వీలుంటుందని, కన్సల్టెన్సీలపై ఆధారపడటం కొంత వరకు తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.
విదేశాల్లో చదువుకోవడానికి ఇటీవలి కాలంలో చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం ఆయా దేశాల్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాటిద్వారా ఉద్యోగావకాశాలు, ఆదాయం ఏ మేరకు ఉంటాయి తదితర అంశాలను విద్యార్థులే సొంతంగా అధ్యయనం చేయాల్సి వస్తోంది. కొందరు విదేశీ విద్యా కన్సల్టెన్సీ సంస్థల సహకారం తీసుకుంటుంటే.. మరికొందరు అక్కడున్న బంధువులు, మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతానికిపైగా విద్యార్థులు కన్సల్టెన్సీలనే ఆశ్రయిస్తున్నారు. కొందరు విద్యార్థులు కన్సల్టెన్సీలను నమ్మి, పలు దేశాల్లోని నకిలీ వర్సిటీల్లో చేరి మోసపోయిన ఉదంతాలూ వెలుగుచూశాయి. ఇలాంటి మోసాలకు కళ్లెం వేసి, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు పోర్టల్‌ వేదికగా అధికారిక సమాచారాన్ని అందిస్తూ వారికి అండగా నిలవాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక పోర్టల్‌ రూపకల్పనలో నిమగ్నమైంది. ప్రపంచవ్యాప్తంగా 90కిపైగా దేశాల్లో 11 లక్షల మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం విద్యనభ్యసిసున్నారు. ఈ సంఖ్య వచ్చే కొద్ది సంవత్సరాల్లో మరింత పెరగవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.

2015లో మదద్‌ పోర్టల్‌ వచ్చినా..

విదేశాలకు వెళ్లిన విద్యార్థుల కాన్సులేట్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కేంద్రం 2015లో మదద్‌(సహాయం) పేరిట పోర్టల్, మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. అందులో విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసి రిజిస్టర్‌ చేయించుకోవాలి. ఈ ఆరేళ్లలో దాదాపు 73 వేల సమస్యలు పరిష్కరించారు. తాజాగా అందుబాటులోకి రానున్న గ్లోబల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ పోర్టల్‌ విదేశీ విద్యకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇవ్వనుంది.

ఏ స‌మాచారం ఉంటుందంటే...

* దేశాల వారీగా విశ్వవిద్యాలయాలు, వాటిలోని కోర్సులు, విదేశీ విద్యార్థుల కోసం వర్సిటీలు నియమించిన నోడల్‌ అధికారులు, గుర్తింపు తదితర సమాచారం 

* కరదీపికలా ఉపయోగపడే ‘ఇండియా స్టూడెంట్‌ హ్యాండ్‌బుక్‌ ఫర్‌ స్టడీయింగ్‌ అబ్రాడ్‌’ పుస్తకం

* ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక, భౌగోళిక అంశాలు. నెలవారీగా  జీవన వ్యయం, ఫీజులు తదితర వివరాలు. 

* దేశాల్లోని వర్సిటీల అధికారిక వెబ్‌సైట్లు,  అవి ఇచ్చే స్కాలర్‌షిప్‌ల సమాచారం.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఫ్లిప్‌కార్ట్‌లో 1.5 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

భాషలపై పట్టు.. భవితకు మెట్టు!

Posted Date : 16-09-2021