• facebook
  • whatsapp
  • telegram

Students: ఎయిడెడ్‌ పాఠశాలల మూతతో విద్యార్థులకు ఇక్కట్లు 

ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. విజయవాడ సహా కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖ ఎయిడెడ్‌ పాఠశాలలు పూర్తిగా ప్రైవేటుగా మారిపోనున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగానే ఫీజులను వసూలు చేయనున్నారు. కొన్ని పాఠశాలలను పూర్తిగా నడపలేమంటూ యాజమాన్యాలు తమ అంగీకార పత్రాలను జిల్లా విద్యాశాఖకు సమర్పించారు. ఇప్పటికే విజయవాడలోని మాంటిస్సోరి పాఠశాలను మూసేస్తామని యాజమాన్యం ప్రకటించింది. 
దీంతో ఈ పాఠశాల పిల్లలను దగ్గరలో ఉన్న నగరపాలక, ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఎయిడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేస్తే.. ఆ తర్వాత వేల మంది విద్యార్థులు దగ్గరలో ఉన్న ప్రభుత్వ బడులకు రానున్నారు. సెప్టెంబర్‌ 02 తర్వాత ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆ తర్వాత నుంచి విద్యార్థుల మార్పులు చేర్పులు పెరుగుతాయి. 
‣ కృష్ణా జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో 270 యాజమాన్యాలు... ఉపాధ్యాయులను ప్రభుత్వానికి ఇచ్చేస్తామని అంగీకరించాయి. వీటిలో 51 పాఠశాలలు పూర్తిగా మూసేస్తామని తెలిపాయి. వీటికి మూసివేత నోటీసులను జిల్లా విద్యాశాఖ జారీ చేసింది. మిగతా వారు ప్రైౖవేటుగా తాము నడుపుతామని వెల్లడించాయి. 141 పాఠశాలలు మాత్రం ఎలాంటి అంగీకారం ఇవ్వలేదు. ఉపాధ్యాయులను ఇచ్చేందుకు కూడా వీళ్లు అంగీకరించలేదు. జిల్లాలో కేవలం రెండు పాఠశాలలు మాత్రమే ఆస్తులతో సహా పూర్తిగా ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించాయి. విజయవాడలో 95 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. 51 పాఠశాలలు ఇప్పటికే అంగీకార పత్రాలు ఇచ్చాయి. వీటిలో 30 పాఠశాలలు ఉపాధ్యాయులను ఇచ్చేసి పూర్తిగా మూసేస్తామని తెలిపాయి. 21 బడులు ఉపాధ్యాయులను ఇచ్చేసి.. తాము ప్రైవేటుగా నడుపుతామని తెలిపాయి. మిగతా 44 పాఠశాలలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అంగీకారం ఇవ్వలేదు. 
కొత్త ప్రవేశాలకు అవకాశం లేదని బోర్డులు..
విజయవాడలోని ప్రభుత్వ, నగరపాలక సంస్థ బడులు ఇప్పటికే విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. ప్రవేశాలు ఇంక కల్పించలేమంటూ కొన్ని చోట్ల బోర్డులు వేలాడదీశారు. గత ఏడాది కొవిడ్‌ నేపథ్యంలో ఆగిపోయిన ప్రవేశాలన్నీ ఈసారి జరిగాయి. దీంతో తరగతి గదుల సామర్థ్యం చాలడం లేదు. కొత్తగా ఎయిడెడ్‌ విద్యార్థులు వస్తే.. మరిన్ని అదనపు గదులు అవసరమవుతాయి. దీంతో సర్దుబాటు చేయడం అధికారులకు కూడా తలకుమించిన భారం అవనుంది. విజయవాడలోని ఏకేటీపీ, గోవిందరాజులు లాంటి పాఠశాలల్లో ఇప్పటికే వేల మంది పిల్లలున్నారు. ఇంక చేర్చుకోలేమని ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. మళ్లీ కొత్తగా విద్యార్థులు వస్తే.. వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి రాబోతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ముందస్తుగానే సన్నద్ధమవ్వాల్సి ఉంది.
ప్రముఖ బడులే..
విజయవాడలోని మాంటిస్సోరి, బిషప్‌ హజరయ్య, ఎస్‌.కె.పి.వి.హిందూ హైస్కూల్, వివేకానంద సెంటినరీ.. తదితర ప్రముఖ ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో మాంటిస్సోరి పూర్తిగా మూసివేస్తామని యాజమాన్యం తెలియజేసింది. మిగిలినవి ఉపాధ్యాయులను ఇచ్చేసి.. తాము ప్రైవేటుగా నడిపేందుకు సిద్ధమవుతున్నాయి. తేలప్రోలు బాపనయ్య లాంటి స్కూల్లు ఇంకా అంగీకారం తెలియజేయలేదు. ఈ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఏటా వేలాది మంది విద్యార్థులు చేరుతుంటారు. ప్రస్తుతం ఇవన్నీ ప్రైవేటుగా మారిపోతే.. ఇక్కడ చదివే విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో భరించే స్థోమత లేనివాళ్లంతా సమీపంలో ఉండే ప్రభుత్వ బడులకు వచ్చి చేరుతారు. ఏటా 33వేల మందికి పైగా విద్యార్థులు ఎయిడెడ్‌ బడుల్లో చదువుతుంటారు. వాళ్లకు ప్రవేశాలు కచ్చితంగా కల్పించాల్సిన బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారులపైనే ఉంది. జిల్లాలోని చాలా పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉంది.

Posted Date : 26-10-2021