ముంబయి: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పెట్టుబడులు పెరుగుతున్నందున, ప్రస్తుత (జులై -సెప్టెంబరు) త్రైమాసికంలో కంపెనీల నియామక ఆసక్తి 61 శాతం పెరిగినట్లు టీమ్‌లీజ్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ - జూన్‌లో ఈ ఆసక్తి 54 శాతంగా ఉందని పేర్కొంది. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో నియామక ఆసక్తి 6 శాతం పెరిగి 89 శాతానికి, ద్వితీయ శ్రేణి నగరాల్లో 7 శాతం పెరిగి 62 శాతానికి చేరిందని తెలిపింది. తృతీయ శ్రేణి నగరాల్లో 3 శాతం మేర పెరిగి 37 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం పెరిగినట్లు నివేదిక వివరించింది. 14 నగరాల్లోని 23 రంగాలకు చెందిన 900 చిన్న, మధ్య, అగ్రశ్రేణి సంస్థలను సర్వే చేసి టీమ్‌లీజ్ ఈ నివేదిక రూపొందించింది.
రంగాలు, నగరాల వారీగా..: తయారీ రంగంలో దిల్లీలో 72 శాతం, ముంబయిలో 59 శాతం, చెన్నైలో 55 శాతం నియామక ఆసక్తి పెరిగింది. సేవల రంగంలో బెంగళూరు 97 శాతం, ముంబయి 81 శాతం, దిల్లీ 68 శాతంతో ముందు వరుసలో ఉన్నాయని పేర్కొంది.
* పర్యాటకం, విమానయానం, గృహ నిర్మాణ రంగాల్లోనూ నియామకాలు పెరగనున్నాయి.
* వ్యాపార పరిమాణం ప్రకారం చూస్తే.. చిన్న కంపెనీల్లో నియామక ఆసక్తి 6% పెరిగి 47 శాతానికి చేరిందని, మధ్య, పెద్ద స్థాయి సంస్థల్లో 4% పెరిగి 69 శాతానికి చేరింది.
ఈ విభాగాల్లో...
ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నియామక ఆసక్తి 13 శాతం పెరిగి 70 శాతానికి; మార్కెటింగ్ ఉద్యోగాలకు 10 శాతం పెరిగి 63 శాతానికి, ఐటీ ఉద్యోగాలకు 8 శాతం పెరిగి 90 శాతానికి చేరినట్లు వివరించింది. ఐటీ, విక్రయాల విభాగాల్లో ఉద్యోగాలకు గిరాకీ బాగుంటుందని, ఇంజినీరింగ్, మార్కెటింగ్ ఉద్యోగాలకు కూడా అవకాశాలు బాగున్నాయని నివేదిక తెలిపింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.