• facebook
  • whatsapp
  • telegram

UPSC: అసామాన్య అనన్య

* సివిల్స్‌లో పాలమూరు యువతికి మూడో ర్యాంకు

* విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు

* నలుగురికి 100లోపు ర్యాంకులు

* టాపర్‌గా లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ

* ఒడిశాకు చెందిన అనిమేష్‌ ప్రధాన్‌కు రెండో ర్యాంకు

ఈనాడు-హైదరాబాద్‌, దిల్లీ, కొచ్చి-భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా రెండో సంవత్సరం జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచినవారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఐఐటీ కాన్పుర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేసిన ఆయన.. అదే సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుని విజయం సాధించారు. ఒడిశాలోని అనుగుల్‌ జిల్లా తాల్చేరు వాసి అనిమేష్‌ ప్రధాన్‌ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈయన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) రవుర్కెలా నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశారు. పి.కె.సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌, రుహానీలు వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నారు. తొలి అయిదు స్థానాలు సాధించిన వారిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. సివిల్స్‌-2023 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) మంగళవారం విడుదల చేసింది. మొత్తం 1,016 మంది విజయం సాధించగా వారిలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మంది దివ్యాంగులు ఉండడం విశేషం. జనరల్‌ విభాగంలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 115, ఓబీసీ 303, ఎస్సీ 165, ఎస్టీ విభాగంలో 86 మంది ఉద్యోగాలు సాధించారు. గతేడాది మే 28న జరిగిన సివిల్స్‌-2023 ప్రాథమిక పరీక్షకు మొత్తం 10,16,850 నమోదు చేసుకోగా 5,92,141 మంది హాజరయ్యారు. వారిలో 14,624 మంది మెయిన్స్‌కు, 2,855 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. చివరగా 1,016 మంది అత్యున్నత కొలువులు సాధించారు

   

కార్పొరేట్‌ ఉద్యోగం వదిలి..

తొలి ర్యాంకు సాధించిన లఖ్‌నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యంతో రూ.లక్షల్లో జీతం లభించే కార్పొరేట్‌ కొలువును విడిచిపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 15 నెలలు పనిచేసిన ఆయన అనంతరం రాజీనామా చేశారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశను కూడా దాటలేకపోయారు. అయినా నిరాశ చెందలేదు. తప్పులు సరిదిద్దుకుని మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. 2022లో 236వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐఏఎస్‌ కావాలన్న పట్టుదలతో మూడోసారి 2023లో మళ్లీ సివిల్స్‌ రాసి జాతీయస్థాయిలో తొలి స్థానం సాధించారు. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించి.. పరీక్ష సిలబస్‌ను అంచనా వేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని శ్రీవాస్తవ చెప్పారు. హార్డ్‌వర్క్‌, స్మార్ట్‌వర్క్‌ మధ్య తేడా గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడమే తన విజయ రహస్యమని వివరించారు.


 

ఇంటర్వ్యూ సమయంలో అమ్మను కోల్పోయా: అనిమేష్‌ ప్రధాన్‌

‘‘2022లో సివిల్స్‌ సన్నద్ధత ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. రోజుకు 5-6 గంటల పాటు చదివా. ఎలాంటి శిక్షణ తీసుకోలేదు’’ అని రెండో ర్యాంకర్‌ అనిమేష్‌ ప్రధాన్‌ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ‘‘సివిల్స్‌ ఫలితం విషయంలో నా కల నెరవేరింది. గత నెలలో సివిల్స్‌ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా అమ్మను కోల్పోయాను. 2015లోనే నాన్న మృతి చెందారు. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా. వారు లేని లోటు పూడ్చలేనిది’’ అని పేర్కొన్నారు.

నిరుటి కన్నా అధికం

కొన్నేళ్లుగా సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 45-50 మంది మాత్రమే ఎంపికవుతున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈసారి ఆ సంఖ్య 60 వరకు చేరుకుంది. మరికొందరు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది 46 మందికిపైగా విజేతలుగా నిలిచారు. సివిల్స్‌పై అవగాహన పెరగడం వల్ల పలువురు డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారని.. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన సివిల్స్‌ శిక్షణ నిపుణుడు విష్ణు విశ్లేషించారు.

ఐపీఎస్‌ శిక్షణ పొందుతూనే..

తొలి 5 స్థానాల్లో నిలిచిన వారిలో ఆదిత్య శ్రీవాస్తవ (1), పి.కె.సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహానీ (5).. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. సివిల్స్‌ ఫలితాల్లో ఓ ఐపీఎస్‌ ట్రైనీకి తొలి ర్యాంకు రావడం.. గత దశాబ్దానికిపైగా కాలంలో ఇదే తొలిసారి.

విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

సివిల్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన వారికి ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు. వారి కృషి రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని చెప్పారు. పరీక్షల్లో విజయం సాధించలేకపోయిన వారికీ ప్రధాని ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎదురుదెబ్బ కఠినంగా ఉంటుందని, అంతమాత్రాన మీ ప్రయాణానికి ఇది ముగింపు కాదని స్పష్టంచేశారు. ‘‘అవకాశాలను అన్వేషిస్తూ ముందుకు సాగండి. మీ అందరికీ శుభాకాంక్షలు’’ అని వెల్లడించారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ అభినందనలు

సివిల్స్‌-2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఈసారి 50 మందికి పైగా సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన అనన్యరెడ్డికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అప్పుడు ఉమాహారతి.. ఇప్పుడు అనన్యరెడ్డి..

సివిల్‌ సర్వీసెస్‌-2022లో అప్పుడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఉమాహారతి 3వ ర్యాంకు సాధించారు. ఆమె అయిదో ప్రయత్నంలో విజేతగా నిలిచారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు అప్పట్లో నారాయణపేట ఎస్పీగా ఉన్నారు. ఇప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌కు చెందిన అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలో 3వ స్థానంలో నిలవడం గమనార్హం. దిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల మిరాండ హౌస్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె ఐచ్ఛిక సబ్జెక్టు ఆంత్రోపాలజీలో మాత్రం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈమె తండ్రి మహబూబ్‌నగర్‌లో స్థిరాస్తి వ్యాపారి.

బీడీ కార్మికురాలి బిడ్డ సత్తా

  

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన నందాల సాయికిరణ్‌ 27వ ర్యాంకు సాధించారు. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే రెండో ప్రయత్నంలో సత్తా చాటారు. తండ్రి కాంతారావు 2016లో మరణించగా, బీడీ కార్మికురాలైన తల్లి లక్ష్మి అన్నీ తానై తల్లి తన రెక్కల కష్టంతో కుమారుడిని చదివించారు. సాయికిరణ్‌ 5వ తరగతి వరకు వెలిచాలలోని ప్రాథమిక పాఠశాలలో, ఇంటర్‌ వరకు కరీంనగర్‌లో చదివారు. 2012లో 9.8 జీపీఏతో పదో తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌లో 98 శాతం మార్కులు సాధించారు. అనంతరం వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ ఈసీఈ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని క్వాల్కమ్‌ సంస్థలో సీనియర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం పొందారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వారాంతపు సెలవుల్లో ఇంటి వద్ద చదువుకొని యూపీఎస్సీకి సన్నద్ధమయ్యారు. మొదటిసారి 2021లో సివిల్స్‌ పరీక్షలో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. రెండో ప్రయత్నంలో రెట్టించిన ఉత్సాహంతో చదివి 27వ ర్యాంకు సాధించారు. పట్టుదల ఉంటే ఏదీ అడ్డంకి కాదని.. కష్టపడాలనే తపన ఉండాలని సాయికిరణ్‌ అంటున్నారు. చదువుకునే క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా.. వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకున్నానని తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదులుకుని..

ఈనాడు-హైదరాబాద్‌: జనగామ అర్బన్‌-న్యూస్‌టుడే: జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త మెరుగు సుధాకర్‌, సుజాత దంపతుల కుమారుడు మెరుగు కౌశిక్‌ సివిల్స్‌ మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు పొంది.. విజయం సాధించారు. జనగామ పట్టణంలో ప్రాథమిక విద్యాభ్యాసం, హైదరాబాద్‌లో పదో తరగతి, ఇంటర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ‘‘ఇంటర్‌ పూర్తయ్యాక ఓయూలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుకుంటున్నప్పుడే సివిల్స్‌లో ఏదైనా ర్యాంకు కొట్టాలనుకున్నా. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక ఎంబీఏ చదివేందుకు దిల్లీకి వెళ్లా. ఎంబీఏ రెండో సంవత్సరంలో సివిల్స్‌కు సన్నద్ధత మొదలుపెట్టా. ఒక సంవత్సరం క్యాప్‌జెమినీ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగంలో చేరా. సాధన ముమ్మరంగా కొనసాగించేందుకు ఉద్యోగం అడ్డుగా ఉందని వదిలేశా. రోజుకు 9 గంటలపాటు చదివా. పరీక్షలన్నీ ఆత్మవిశ్వాసంతో రాశా. వందలోపు ర్యాంకు వస్తుందని మాత్రం ఊహించలేదు. నాన్నకు తెలిసిన కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను కలుసుకుని పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసుకున్నా. దివ్యాంగులకు సేవచేసేందుకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగించే పనులు చేయాలని ఉంది’’ అని మెరుగు కౌశిక్‌ తెలిపారు.

ఐఆర్‌ఎస్‌తో ఆగిపోకుండా....

 


 

నాగోలు, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన కె.ఎన్‌.చందన జాహ్నవి 50వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాగా.. తల్లి ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే ఐఏఎస్‌ కావాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘‘ఐఏఎస్‌ సాధించాలంటే ఇతర సబ్జెక్టుల్లో పట్టుండాలని తెలుసుకున్నా. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఎంబీఏ చదివా. రెండేళ్ల క్రితం తొలి ప్రయత్నంలో సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైనా కార్పొరేట్‌ అఫైర్స్‌ విభాగంలో చేరమన్నారు. అక్కడ శిక్షణ పొందుతూనే రెండోసారి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యా. అయినా సంతృప్తి కలగలేదు. కచ్చితంగా ఐఏఎస్‌ సాధించాలని నిర్ణయించుకొని.. ఐఆర్‌ఎస్‌ శిక్షణ నుంచి నాలుగు నెలలు సెలవు తీసుకుని సన్నద్ధమయ్యా. ప్రస్తుతం 50వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని చందన జాహ్నవి పేర్కొన్నారు.

అమ్మ మాటలే స్ఫూర్తి మంత్రాలు

నాగోలు, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని చైతన్యపురికి చెందిన గాడిపర్తి సాహి దర్శిని 112వ ర్యాంకు పొందారు. ఆమె తల్లి హైకోర్టులో న్యాయవాది, తండ్రి ప్రైవేటు స్కూల్‌ నిర్వాహకుడు. ఇంటర్‌ వరకూ హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ‘‘అమ్మ చెప్పే మాటలు, సమాజానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న సేవ నాపై ప్రభావం చూపించాయి. నార్త్‌ కరోలినాలో కొద్ది నెలలు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశాక.. సివిల్స్‌ రాయాలన్న నా మనసులోని మాటను అమ్మకు చెప్పా. ఎంతో ప్రోత్సహించారు. నా బలాలు, బలహీనతలు తెలుసుకుని తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. పేదవారికి సేవ చేయాలన్నదే నా లక్ష్యం’’ అని సాహి దర్శిని పేర్కొన్నారు.

సమాజ సేవే లక్ష్యంగా..

ఈనాడు-హైదరాబాద్‌, తిరుమలగిరి సాగర్‌-న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన పెంకీసు ధీరజ్‌రెడ్డి 173వ ర్యాంకు సాధించారు. ధీరజ్‌రెడ్డి తండ్రి సత్యనారాయణరెడ్డి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా, తల్లి హేమలత టీచర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఐఐటీ దిల్లీలో ఐటీ విభాగంలో పట్టా పొందిన ధీరజ్‌.. సివిల్‌ సర్వీసెస్‌కు మూడుసార్లు ప్రయత్నం చేసి.. నాలుగోసారి ర్యాంకు సాధించారు. ‘‘సివిల్స్‌ సాధించడంలో అమ్మానాన్నలే స్ఫూర్తి. సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో మూడుసార్లు సివిల్స్‌ రాశా. అనుకున్న ర్యాంకు రాలేదు. నాలుగోసారి సాధించడంతో గతంలో మూడుసార్లు విఫలమైన బాధంతా పోయింది’’ అని ధీరజ్‌ చెప్పారు.

నాన్నే నడిపించారు..

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: హనుమకొండలోని విద్యుత్‌నగర్‌కు చెందిన రావుల జయసింహారెడ్డి 104వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి ఉమారెడ్డి వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏడీఆర్‌గా పనిచేస్తున్నారు. జయసింహారెడ్డి ఇంటర్మీడియట్‌ నుంచే కలెక్టర్‌ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 1 నుంచి 6వ తరగతి వరకు జగిత్యాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు హనుమకొండలో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లో చదివారు. హైదరాబాద్‌ ఐఐటీలో 2019లో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం సివిల్స్‌కు సన్నద్ధత ప్రారంభించారు. మూడుసార్లు పరీక్ష రాశారు. 2023లో 217 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో శిక్షణ ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ కావాలనే లక్ష్యంతో విధులకు సెలవు పెట్టి మళ్లీ సన్నద్ధత ప్రారంభించారు. తనకు తండ్రి ఉమారెడ్డియే మార్గదర్శకులని జయసింహారెడ్డి తెలిపారు.

పేదింట నవోదయం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కష్టాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రస్థానమిది. భర్తతోపాటు కుమారుడు, కోడలు మృతి చెందినప్పటికీ రమణమ్మ తన మనవళ్ల చదువు కోసం చెమటోడ్చారు. మనవడు ఉదయ్‌కృష్ణారెడ్డిని స్వగ్రామంలోనే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించారు. నెల్లూరు జిల్లా కావలిలోని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తిచేశారు. 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి 2019 వరకు విధులు నిర్వహించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌ శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు.

కాళ్లు పనిచేయకున్నా.. లక్ష్యం వీడలేదు

* హనిత వేములపాటి, 887వ ర్యాంకు

పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నా. ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నప్పుడు వెన్నెముకలో ఇన్ఫెక్షన్‌ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై మంచానికి పరిమితమయ్యా. కూడదీసుకుని వీల్‌ఛైర్‌లో అటూఇటూ తిరిగేదాన్ని. కాళ్లు సక్రమంగా పనిచేయకపోవడంతో.. ఇంజినీరింగ్‌ చదవలేనని భావించి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశా. ఆ తర్వాత నా లక్ష్యమైన సివిల్స్‌ వైపు దృష్టి కేంద్రీకరించా. మూడు ప్రయత్నాల్లో అనుకున్నంత ర్యాంకు రాలేదు. అయినా నిరాశ చెందకుండా నాలుగోసారి పట్టుదలతో ప్రయత్నించా. ప్రతి ప్రయత్నంలోనూ నాకు అమ్మానాన్నలు తోడుగా నిలిచారు. నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచారు. వారికి ఎంతో రుణపడి ఉంటా.


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.