• facebook
  • whatsapp
  • telegram

ఏపీలో సీబీఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటు

* వచ్చే సంవత్సరం బడులకు గుర్తింపు

* సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలన్నీ సీబీఎస్‌ఈలోకి మారుతున్నందున రాష్ట్రంలో ఆ సంస్థ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. 2021-22 విద్యా సంవత్సరంలో బడులన్నింటికీ సీబీఎస్‌ఈ గుర్తింపు లభిస్తుందని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. 2024-25లో పదో తరగతి విద్యార్థులు తొలిసారి ఆ బోర్డు పరీక్షలు రాస్తారన్నారు. క్యాంపు కార్యాలయంలో మనబడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, సీబీఎస్‌ఈ గుర్తింపుపై సీఎం జగన్‌ మార్చి 31న‌ సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈపై అవగాహన కల్పించి, శిక్షణ అందించాలి.  విద్యారంగంలో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ నిర్ణయమైనా అందరికీ మంచి విద్య అందాలి. ఆంగ్లంలో బోధించడం, మాట్లాడటం అలవాటు చేయాలి. ఈ అంశాలను ఉపాధ్యాయులకు అర్థమయ్యేలా వివరించి, వారిలో స్ఫూర్తిని నింపాలి. పూర్వ ప్రాథమిక విద్య, అంగన్‌వాడీల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం’ అని వెల్లడించారు.

 

విద్యా కానుక సకాలంలో అందించాలి

‘విద్యా కానుకను పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి కచ్చితంగా అందించాలి. వీటితో ప్రతి ఒక్కరూ నైపుణ్యాన్ని పెంచుకుంటారు. మధ్యాహ్న భోజనం ఎక్కడ తిన్నా రుచి, నాణ్యత ఒకేలా ఉండాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరిదిద్దే వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు. విద్యా కానుక కిట్‌ను పరిశీలించారు. ‘మొదటిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్‌ 30న ప్రజలకు అంకితం చేస్తాం. ఇకపై నిర్వహణపై దృష్టిపెట్టాలి’ అని వెల్లడించారు. ‘నాడు-నేడు’  పనుల తల్లిదండ్రుల కమిటీలు, అధికారులకు ఇవ్వనున్న శిక్షణ కరదీపిక, మధ్యాహ్న భోజనం తయారీ, మరుగుదొడ్ల నిర్వహణపై పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు.

Posted Date : 01-04-2021