• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్ఈ ఫ‌లితాల మూల్యాంక‌నానికి క‌మిటీ 

 

ర‌ద్దు చేసిన సీబీఎస్ఈ ప‌న్నెండో త‌ర‌గ‌తి ఫ‌లితాలు ఏ ప్రాతిప‌దికన‌ ప్ర‌క‌టిస్తార‌నే దానిపై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే సీబీఎస్ఈ క‌స‌రత్తు మెద‌లుపెట్టింది. ఇందులో భాగంగా ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఇది మ‌రో ప‌ది రోజుల్లో మూల్యాంక‌న ప్ర‌మాణాల‌ను నిర్ణ‌యించి నివేదిక అందించ‌నుంద‌ని సీబీఎస్ఈ పేర్కొంది. ఈ క‌మిటీలో కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి, యూజీసీ ఛైర్మ‌న్, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్ట‌ర్, సీబీఎస్ఈ కంట్రోల‌ర్‌, అక‌డ‌మిక్స్‌ డైరెక్ట‌ర్‌, ఐటీ డైరెక్ట‌ర్ త‌దిత‌రులు స‌భ్యులుగా ఉన్నారు. 

 

ఫ‌లితాలకు రెండు నెల‌ల స‌మ‌యం!

సీబీఎస్ఈ ప‌న్నెండో త‌ర‌గ‌తి ఫ‌లితాల వెల్ల‌డికి రెండు నెలల స‌మ‌యం పడుతుంద‌ని బోర్డు కార్య‌ద‌ర్శి అనురాగ్ త్రిపాఠీ తెలిపారు. అందుకు సంబంధించిన క‌స‌ర్త‌తు జ‌రుగుతోంద‌న్నారు. ఇప్ప‌టికే ప‌న్నెండో త‌ర‌గ‌తి ఫ‌లితాలను ఏ ప్రాతిప‌దిక‌న వెల్ల‌డిస్తారో తెల‌పాల‌ని సుప్రీంకోర్టు సీబీఎస్ఈని ఆదేశించింది. హేతుబ‌ద్ధ‌మైన అర్హ‌తా విధానంతో ముందుకు రావాలని, దేశ‌విదేశాల్లో ఉన్న‌త చ‌దువుల కోసం విద్యార్థులు ప్ర‌వేశాలు పొందాల్సిన‌ అవ‌స‌రం ఉన్నందున ఎక్కువ స‌మ‌యం ఇవ్వ‌లేమ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈనేప‌థ్యంలోనే మూల్యాంక‌న ప్రమాణాల‌ను నిర్ణయిస్తున్నామ‌ని, అది పూర్త‌యితే ఫ‌లితాల వెల్లడికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని అనురాగ్ త్రిపాఠీ పేర్కొన్నారు. ఆగ‌స్టులో ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. మరోవైపు విద్యార్థులంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన ఫ‌లితాల విధానం కోసం కృషి చేస్తున్నామని బోర్డుకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే అది అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని చెప్పారు.  

 

Posted Date : 04-06-2021