• facebook
  • whatsapp
  • telegram

పీహెచ్‌డీ అడ్మిష‌న్ల‌లో ఆల‌స్యం

ప్ర‌వేశ‌ పరీక్షలు జరిగి 5 నెలలైనా వెల్ల‌డి కాని ఫలితాలు
 


 

 

ఈనాడు, హైదరాబాద్‌: నోటిఫికేషన్‌ ఇచ్చిన ఏడాది తర్వాత పరీక్షలు పెట్టారు. 5 నెలలుగా ఫలితాలు ఇవ్వడంలేదు. పీహెచ్‌డీ ప్రవేశాల విషయంలో జేఎన్‌టీయూ వైఖరి ఇది. జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు గతేడాది ఫిబ్రవరి 19న అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 232(44 ఫుల్‌టైం, 188 పార్ట్‌టైం) సీట్లను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చిలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో నిర్దేశిత తేదీల్లో పరీక్షలు జరగలేదు. విద్యార్థుల డిమాండ్‌ మేరకు ఈ ఏడాది జనవరి 18, 19, 20న జేఎన్‌టీయూ ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. 5 నెలలు గడిచినా ఫలితాలు వెల్లడించలేదు. 1,570 మంది దరఖాస్తు చేసుకోగా 1,480 మంది హాజరయ్యారు. వారంతా ఏడాదిన్నరగా ఎదురుచూపులకే పరిమితమయ్యారు. జాప్యం కారణంగా పరిశోధనావకాశాలు కోల్పోతున్నామని వాపోతున్నారు.

‣ ఎందుకీ జాప్యం: రోస్టర్‌ విధానంలో రేగిన వివాదంతోనే ఏడాదిగా ప్రవేశాలు నిలిచిపోయాయి. పరీక్షల నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ పేర్కొనలేదని పలువురు విద్యార్థులు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్‌ విచారణకు వర్సిటీ రిజిస్ట్రార్‌, రెక్టార్‌, ఇతర అధికారులు స్వయంగా హాజరై వివరణిచ్చారు. తాజా నోటిఫికేషన్‌లో రోస్టర్‌ విధానం పాటిస్తూ భర్తీ చేయాలని కమిషన్‌ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. కమిషన్‌ నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు రాలేదన్న కారణంతోనే ఫలితాలను వర్సిటీ అధికారులు ఆపారు.

 

‣ కమిషన్‌ ఆదేశాలు రాగానే వెల్లడిస్తాం..

- ప్రొ.కట్టా నర్సింహారెడ్డి, ఉపకులపతి, జేఎన్‌టీయూ

పీహెచ్‌డీ ప్రవేశాలలో జాప్యం విషయం నా దృష్టికి వచ్చింది. పరీక్షల ఫలితాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నుంచి ఆదేశాలు రాగానే విడుదల చేస్తాం.

Posted Date : 17-06-2021