• facebook
  • whatsapp
  • telegram

ఆగస్టు, సెప్టెంబర్‌ మధ్య 12వ తరగతి ఆప్షనల్‌ పరీక్షలు

* సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఎస్‌ఈ

 

 

దిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 12వ తరగతి విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే మూల్యాంకన విధానంలో వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డులు చేర్చాయి. ఈ మేరకు జూన్‌ 21న సర్వోన్నత న్యాయస్థానం ముందు ప్రమాణపత్రం దాఖలు చేశాయి. ఇందులో ఫలితాలను జులై 31లోపు వెల్లడి చేస్తామని, ఫలితాలపై అభ్యంతరాలున్న వారి కోసం ప్రత్యేక కమిటీని వేస్తామని తెలిపాయి. కమిటీ నిర్ణయంతో కూడా సంతృప్తి చెందని విద్యార్థులు ఆప్షనల్‌ పరీక్షకు హాజరు కావచ్చని పేర్కొంది. ఇందులో ప్రధాన సబ్జెక్టులకు మాత్రం పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆప్షనల్‌ పరీక్షలను ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్యలో నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ...తన ప్రమాణ పత్రంలో తెలిపింది. ప్రైవేటు, కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాసే విద్యార్థుల మూల్యాంకనాన్ని 2019-20 సంవత్సరంలో కోర్టు ఆమోదించిన విధానంలో కొనసాగిస్తామని పేర్కొంది. ఈ విద్యార్థుల పరీక్షలనూ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 15 మధ్యలోనే చేపడతామని ప్రమాణపత్రంలో తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 30:30:40 ఫార్ములాతో విద్యార్థుల ప్రతిభను మదింపు చేస్తామని గత విచారణ సందర్భంగా సీబీఎస్‌ఈ, సీఐసీఎస్‌ఈ బోర్డులు కోర్టుకు తెలిపాయి. ఈ ఫార్ములాను సుప్రీం కోర్టు కూడా ఆమోదించింది. అయితే ఆప్షనల్‌ పరీక్షల తేదీలు, వివాద పరిష్కార యంత్రాంగంపై స్పష్టత ఇవ్వాలని బోర్డులను సుప్రీం కోర్టు ఆదేశించింది.
 

Posted Date : 21-06-2021