• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ తరగతులకు సన్నాహాలు!

* విద్యాకానుకతో పాటు పుస్తకాలు అందించాలని భావిస్తున్న విద్యాశాఖ

* ఈ ఏడాది ఆ పథకం ప్రారంభంపై ఇంకారాని స్పష్టత

* పుస్తకాలు సకాలంలో అందితేనే ప్రయోజనం

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ జులై 15 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దూరదర్శన్, రేడియోల ద్వారా పునశ్చరణ పాఠాలను ప్రసారం చేయాలని నిర్ణయించింది. తరగతులను అయిదు విభాగాలుగా చేసి, అయిదు గంటలపాటు టీవీలో పాఠాలను ప్రసారం చేయనున్నారు. విద్యార్థులకు వర్క్‌షీట్లు ఇవ్వాలని భావిస్తున్న విద్యాశాఖ పాఠ్యపుస్తకాల పంపిణీపై మాత్రం దృష్టి సారించడం లేదు. పాఠ్యపుస్తకాలు ఉంటే.. చదువుకున్న తల్లిదండ్రులు విద్యార్థులకు బోధించే సదుపాయం ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యా కానుక కింద బ్యాగ్‌లు, బూట్లు, ఏకరూప దుస్తులు, బెల్టులతోపాటు కలిపి అందించాలని భావిస్తున్నారు. దీంతో కొంత జాప్యం జరుగుతోంది. ముద్రణ సంస్థల నుంచి జిల్లా కేంద్రాలకు దాదాపుగా అన్ని పుస్తకాలు సరఫరా చేశారు. అక్కడి నుంచి పాఠశాలల సముదాయాలకు 75% వెళ్లాయి. ఇక్కడి నుంచి బడులకు చేరాల్సి ఉంటుంది. ‘విద్యా కానుక’ సరఫరా ఎప్పుడు ప్రారంభించేది ఇంకా స్పష్టత లేదు.

 

పుస్తకాల సరఫరా ఇలా..

1-8 తరగతుల పాఠ్యపుస్తకాలను సెమిస్టర్‌ విధానంలో ముద్రించారు. 1-5 తరగతులకు మూడు సెమిస్టర్లుగా పుస్తకాలను ముద్రించగా.. 6, 7, 8 తరగతులకు రెండు సెమిస్టర్లుగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. 1-6 తరగతుల్లో అన్ని సబ్జెక్టులకు వర్క్‌బుక్స్‌ అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,31,39,341 పాఠ్య పుస్తకాలు అవసరం కానున్నాయి. వీటికి 10% అదనంగా ముద్రించారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా కేంద్రాలకు అన్ని పుస్తకాలు చేరాయి. ఇక్కడి నుంచి పాఠశాల కాంప్లెక్స్‌లకు 75% చేరాయి. మిగతావి సరఫరా చేస్తున్నారు. ఉపాధ్యాయులు రోజువారీగా పాఠశాలలకు వెళ్తున్నారు. టీవీల్లో వచ్చే పాఠాలను విద్యార్థులు వింటున్నదీ లేనిదీ పర్యవేక్షించే బాధ్యత వారికి అప్పగించారు. ఇందుకోసం విద్యార్థులను బృందాలుగా చేసి ఉపాధ్యాయులకు అనుసంధానం చేశారు. వర్క్‌షీట్లను విద్యార్థులకు అందించనున్నట్లు ఇటీవల ఆదేశాల్లో పేర్కొన్నారు. వీటిని తల్లిదండ్రుల ద్వారా ఇళ్లకు పంపిస్తారు. ఈ సమయంలో పాఠ్యపుస్తకాలను అందిస్తే అభ్యసనకు ఉపయోగపడుతుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

 

సందేహాల నివృత్తికి...

సాధారణంగా విద్యా సంవత్సరం జూన్‌ 13 నుంచి ప్రారంభమవుతుంది. కరోనా కారణంగా ఆలస్యమవుతోంది. బడులు లేకపోవడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి వద్ద ఉండే పిల్లలకు వర్క్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు ఇస్తే టీవీ పునశ్చరణ తరగతులతోపాటు కొత్తగా ప్రవేశం పొందిన తరగతి అభ్యసనానికి అవకాశం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు రోజువారీగా బడులకు వెళ్తున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్లు, ఇతరాత్ర మార్గాల్లో సంప్రదించొచ్చు. దీంతో బడులు తెరిచే సమయానికి కొంతవరకు నేర్చుకునే వీలు కలుగుతుంది. 

Posted Date : 07-07-2021