• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 99.37% మంది ఉత్తీర్ణత

70 వేల మందికి 95% పైగా మార్కులు

 

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు జులై 30న‌ విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో 99.37% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా దిల్లీలో 99.84% ఉత్తీర్ణత నమోదైంది. బాలుర కంటే బాలికలు 0.54% మేర అధికంగా పాసయ్యారు. గత ఏడాది (88.78%)తో పోలిస్తే... ఈసారి ఉత్తీర్ణత సుమారు 10% మేర పెరిగినట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. ప్రస్తుతం 13,04,561 మంది విద్యార్థుల ఫలితాలను వెల్లడించగా- అందులో 70,004 మంది 95% కన్నా ఎక్కువ మార్కులు సాధించారు. మరో 1,50,152 మంది 90-95% మధ్య మార్కులు తెచ్చుకున్నారు. ఇంకా సుమారు 65 వేల మంది విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించాల్సి ఉందని, వాటిని ఆగస్టు 5న ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ ఫలితాలను cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్లలో చూడవచ్చు.

‣ వచ్చేవారం పదో తరగతి ఫలితాలు...

10వ తరగతి ఫలితాలపై కసరత్తును ముమ్మరం చేసినట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ అధికారి సన్యం భరద్వాజ్‌ తెలిపారు. వచ్చే వారంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

12వ తరగతి పరీక్షల్లో గత ఏడాది కంపార్టుమెంటు కింద 87,650 మంది విద్యార్థులు ఉండగా, ఈసారి ఆ విభాగంలో కేవలం 6,149 మందే ఉన్నట్టు భరద్వాజ్‌ తెలిపారు. వీరికి ఆగస్టు 16- సెప్టెంబరు 15 మధ్య పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
 

‣ ఒక్కొక్కరూ ఒక్కో టాలెంట్‌ పవర్‌హౌస్‌: ప్రధాని

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యార్థులు... మునుపెన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో టాలెంట్‌ పవర్‌హౌస్‌ వంటి వారని మోదీ ప్రశంసలు కురిపించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభినందనలు తెలిపారు.

Posted Date : 31-07-2021