• facebook
  • whatsapp
  • telegram

JEE Results: జేఈఈలో తెలుగు విద్యార్థుల విజయభేరి

దేశవ్యాప్తంగా 17 మందికి 100 పర్సంటైల్‌
‣ వారిలో 8 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే
‣ మూడో విడత పరీక్షల పర్సంటైల్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. మూడో విడత పరీక్షల్లో దేశవ్యాప్తంగా 17 మంది 100 పర్సంటైల్‌ను సాధించగా... అందులో ఎనిమిది మంది ఏపీ, తెలంగాణ విద్యార్థులే ఉండటం విశేషం. జులైలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలను మొత్తం 6.50 లక్షల మంది వరకు రాశారు. గత ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా 100 పర్సంటైల్‌ పొందలేకపోగా...మార్చిలో నిర్వహించిన రెండో విడతలో అది పొందిన 13 మందిలో ముగ్గురు తెలుగు విద్యార్థులున్నారు. ఈసారి ఆ సంఖ్య ఏకంగా ఎనిమిదికి పెరిగింది. మొత్తం 17 మంది సంపూర్ణ విజేతల్లో హరియాణా, దిల్లీ, యూపీల నుంచి ఇద్దరు చొప్పున, బిహార్‌, రాజస్థాన్‌, కర్ణాటకల నుంచి ఒకరు చొప్పున 100 పర్సంటైల్‌ సాధించారు. ఆగస్టు 26 నుంచి జరిగే చివరి విడత పరీక్షల తర్వాత అన్ని విడతల్లో వచ్చిన అత్యధిక పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు.

వివిధ కేటగిరీల్లో అగ్రగణ్యులు

 ఈడబ్ల్యూఎస్‌లో ఏపీకి చెందిన రాహుల్‌ నాయుడు, వీరశివ, కరణం లోకేష్‌ జాతీయ టాపర్లుగా నిలిచారు.
 ఓబీసీలో ఏపీకి చెందిన సూరవరపు హర్షవర్మ, బీవీఎస్‌ సాయి ప్రబంధ్‌, తెలంగాణ నుంచి గసడ శ్రీలక్ష్మి టాపర్లుగా నిలిచారు.
 ఎస్‌సీ కేటగిరీలో ఏపీకి చెందిన నందిగామ నిఖిల్‌, కూచిపూడి రాహుల్‌ దీపక్‌, ఎస్‌టీ విభాగంలో తెలంగాణ నుంచి బిజిలి ప్రచోధన్‌ వర్మ, నెనావత్‌ ప్రీతమ్‌, ఇస్లావత్‌ నితిన్‌, ఏపీ నుంచి ఇ.మహర్షి అగ్రస్థానంలో నిలిచారు.
 దివ్యాంగుల విభాగంలో ఏపీకి చెందిన ఇప్పిల్‌ తాశ్విన్‌, తల్లడ వీరభద్ర నాగసాయి కృష్ణ, తెలంగాణకు చెందిన మల్లుకుంట్ల భాను రంజన్‌రెడ్డి ఉత్తమ స్కోర్‌ సాధించారు.

బాలికల విభాగంలో సగం మంది

బాలికల విభాగంలో 10 మంది టాపర్లను ప్రకటించగా అందులో నలుగురు తెలంగాణ, ఒకరు ఏపీకి చెందిన వారు. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, పల్లె భావన, గసడ శ్రీలక్ష్మి, అంచ ప్రణవి, ఏపీకి చెందిన చిచిలి మనస్వితరెడ్డి ఉన్నారు.

Posted Date : 07-08-2021