• facebook
  • whatsapp
  • telegram

KU: కేయూ డిగ్రీ పరీక్షల్లో 16 మంది డిబార్‌

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 9 నుంచి డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమైనట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి తెలిపారు. ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌తో కలిసి నగరంలో పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించి తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు. వర్సిటీ పరిధిలో ఆగస్టు 9 న 16 మంది డిబార్‌ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు డా.వై.వెంకయ్య, డా.సదానందం పాల్గొన్నారు.
అరగంట అలస్యంగా ప్రారంభం
ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పరీక్ష సాంకేతిక కారణాలతో అరగంట అలస్యమైంది. దీంతో కొద్దిసేపు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. విద్యార్థులకు నష్టం కలగకుండా అరగంట సమయం అధికారులు కేటాయించారు. ప్రశ్నపత్రం ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల డౌన్‌లోడ్‌ చేసుకునే క్రమంలో ఇబ్బంది తలెత్తినట్లు చెప్పారు. 
ఆ కేంద్రాన్ని రద్దు చేశాం
నెక్కొండలోని వికాస్‌ డిగ్రీ కళాశాల  పరీక్ష కేంద్రాన్ని రద్దు చేసినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.వై.వెంకయ్య, డా.సదానందం సోమవారం తెలిపారు. డిగ్రీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు నర్సంపేటలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం నుంచి అక్కడే పరీక్షలు రాయాలని సూచించారు.  మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే పరీక్ష కేంద్రాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు. 

Posted Date : 10-08-2021