• facebook
  • whatsapp
  • telegram

Gurukula: గురుకులాల్లో 3, 4 తరగతులు!

* నూతన విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు యోచన

ఈనాడు డిజిటల్, అమరావతి: సంక్షేమశాఖల ఆధ్వర్యంలోని గురుకులాల్లో కొత్తగా 3, 4 తరగతులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రస్తుతం అయిదో తరగతి నుంచి ఇంటరు వరకు ఉంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య, 1, 2 తరగతులు కలిపి ఒక యూనిట్‌గా, 3 నుంచి ఇంటరు వరకు ఒక యూనిట్‌గా ఉండాలి. అందులో భాగంగానే 3, 4 తరగతులను చేర్చాలని యోచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యా విధానంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆయా సంక్షేమశాఖలతో ఈ విషయాన్ని విద్యాశాఖ చర్చించింది. అదనపు తరగతులను చేర్చితే ప్రవేశాలు భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాలు 189, బీసీలవి 93, గిరిజన గురుకులాలు 189 ఉన్నాయి. వీటిలో ఏటా ఒక్కో తరగతిలో 80 మందికి ప్రవేశాలను కల్పిస్తున్నారు. అదనపు తరగతులను ఏర్పాటు చేస్తే 37వేల మంది వరకు విద్యార్థులు పెరిగే అవకాశముంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనపై గురుకులాల బోర్డు సమావేశాల్లో విస్తృతంగా చర్చించాల్సి ఉంది. మరోవైపు ఇప్పటివరకు ఇంటరు లేని గురుకులాల్లోనూ ఆ కోర్సును ప్రారంభించాలని చూస్తున్నారు.
 

Posted Date : 18-08-2021