• facebook
  • whatsapp
  • telegram

Shathavahana: శాతవాహన.. తీరు మారేనా!

ఈనాడు, హైద‌రాబాద్‌(శాత‌వాహ‌న‌): పరీక్షలో లేని అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. పరీక్ష రాసిన వారి గైర్హాజరైనట్లు మెమోలో వచ్చాయి. వీటన్నింటిని అధిగమించి ముందుకొస్తుంటే లీకు సమస్య పుట్టుకొచ్చింది. గతంలో జగిత్యాలలో ప్రశ్న పత్రం లీకు అయింది. అయితే సరైన విచారణ చేయక పోవడం, ఆలస్యంగా గుర్తించడంతో అప్పుడు బాధ్యులు తప్పించుకున్నారు.
జియో ట్యాగ్‌తో ఫలితం
రాష్ట్రంలోని ప్రతి విద్యా సంన్థు జియో ట్యాగింగ్‌ చేశారు. పొలీసు శాఖ సహాయం తీసుకుంటే సెల్‌ఫోన్లపై నిఘా పెట్టే అవకాశం ఉంది. పరీక్ష సమయంలో సంబంధిత పరీక్ష కేంద్రం పరిధిలో ఫోన్ల రాక పోకలను నమోదు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మొదటి గంట కీలకం. ఇంటర్‌లో ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. ప్రశ్న పత్రాల చేరవేత, ఫోన్లో ప్రశ్నలను చెప్పడం వంటి చర్యలకు పాల్పడితే పట్టుకునే అవకాశం ఎక్కువ. నిఘా ఉంటే లీకు వీరులు వెనకడుగు వేసే అవకాశం ఉంది. అలాగే పరీక్ష కేంద్రంలోకి చరవాణిల అనుమతి పూర్తిగా నిషేధిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. సీఎస్‌తో పాటు అబ్జర్వర్‌ను పూర్తి బాధ్యున్ని చేయాల్సి ఉంది. మరొక విషయం ఏమిటంటే, ఈ విధులకు ప్రభుత్వ అధ్యాపకులు సుముఖత చూపడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లడం లేదు. పరీక్షల్లో అందరిని భాగస్వామ్యం చేయాల్సిందే.
ఇలా చేస్తే...
ప్రతి డిగ్రీ కళాశాలల్లో సీసీ కెమెరాలున్నాయి. వాటి ముందే పరీక్ష తంతు నిర్వహిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రశ్న పత్రం డౌన్‌లోడు సమయానికి అక్కడ సీఎస్, అబ్జర్వర్‌తో పాటు ఒక అధ్యాపకుడు మాత్రమే ఉండాలి. అది కూడా ఎవరి వద్ద ఫోను లేకుండా. ప్రశ్న పత్రం విద్యార్థికి చేరే వరకు అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగాలి. ఇన్విజిలేటర్‌ ఫోను ముందే అప్పగించి నేరుగా తనకు కేటాయించిన గదికి వెళ్లాలి. ప్రశ్న పత్రాల డౌన్లోడు, గది వారిగా కేటాయింపు సమయంలో ఇతరులు ఉండకుండా జాగ్రత్త పడాల్సిందే. ఇంటర్‌లో ప్రతి పరీక్ష కేంద్రానికి ఒకరిద్దరు పోలీసు సిబ్బందిని కేటాయిస్తారు. ఇక్కడ అదే విధానం అమలు చేయాలి. ఇంటర్‌ మాదిరిగా పరీక్షకు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వచ్చిన విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి. అన్నింటికి మించి పరీక్షల విభాగం పకడ్బందీ ప్రణాళికతో పాటు కఠిన నిబంధనలతో ముందుకెళ్లాల్సి ఉంది. విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి.

Posted Date : 24-08-2021