• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌లో అబ్బాయిలదే హవా  

* ఇంజినీరింగ్‌లో 9 మంది... అగ్రికల్చర్‌లో 8 మంది 

* రెండు విభాగాల టాప్‌-10లో 10 మంది ఏపీ వారే

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంతో పాటు అగ్రికల్చర్‌లోనూ తొలి 10 ర్యాంకుల్లో అత్యధికం అబ్బాయిలే కైవసం చేసుకున్నారు. మొదటి 10 ర్యాంకర్లలో ఇంజినీరింగ్‌లో ఆరుగురు, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో నలుగురు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులున్నారు. ఇంజినీరింగ్‌లో 1, 2 ర్యాంకులను ఏపీకి చెందిన సత్తి కార్తికేయ, దుగ్గినేని వెంకట పణీష్‌ సాధించగా, అగ్రికల్చర్‌లో తెలంగాణకు చెందిన మండవ కార్తికేయ, ఈమని శ్రీజ సాధించారు. కాకతాళీయమే అయినా, రెండు విభాగాల్లో మొదటి ర్యాంకు సాధించిన ఇద్దరు విద్యార్థుల పేర్లూ కార్తికేయ కావడం విశేషం. ఇంజినీరింగ్‌లో 160కి 158, అగ్రికల్చర్‌లో 151 అత్యధిక స్కోరుగా నమోదయ్యాయి. ఎంసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 25న విడుదల చేశారు. 

 

ఇంజినీరింగ్‌లో 82.08 శాతం, అగ్రికల్చర్‌లో 92.48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి 28 వేల మంది విద్యార్థులు అధికంగా ఎంసెట్‌ రాశారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ప్రవేశ పరీక్షల కన్వీనర్, ఉన్నత విద్యామండలి తాజా మాజీ ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ఎ.గోవర్ధన్, వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్, ఎంసెట్‌ కో కన్వీనర్‌ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

 

గత ఏడాది గంటే మెరుగ్గా...

గత ఏడాది ఇంజినీరింగ్‌లో కనీస మార్కులు 40 సాధించిన వారి శాతం 75.29. ఈసారి అది ఏడు శాతం వృద్ధి చెంది 82.08 శాతానికి పెరిగింది. కిందటిసారి ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకర్‌ మార్కులు 147. ఈసారి అది 158కి పెరగడం విశేషం. 2020లో అగ్రికల్చర్‌లో 92.57 శాతం మంది ఉత్తీర్ణులు కాగా... ఇప్పుడు అది 92.48 శాతంగా ఉంది. 





 

Posted Date : 25-08-2021