• facebook
  • whatsapp
  • telegram

EFLU: 1 నుంచి ఇఫ్లూలో ప్రత్యక్ష బోధన

ఈనాడు, హైదరాబాద్‌: సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతి బోధన ప్రారంభించాలని ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ) నిర్ణయించింది. ఈ మేరకు వర్సిటీ ఉపకులపతి ప్రొ.ఇ.సురేశ్‌కుమార్‌ సమక్షంలో ఆగస్టు 25న స్థాయి సంఘ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా విద్యార్థులను వర్సిటీకి అనుమతించనున్నారు. తొలివిడతగా అన్ని విభాగాలకు చెందిన ఎంఏ విద్యార్థులను అనుమతించనున్నారు. విదేశీ విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చేందుకు వీలుకల్పిస్తారు. 72 గంటల వ్యవధిలో చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్టుతో క్యాంపస్‌కు రావాలి. యూజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగనుంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన క్యాంపస్‌ సహా షిల్లాంగ్, లఖ్‌నవూలోని అధ్యాపకులు, సిబ్బంది తమ విధులకు హాజరు కావాల్సి ఉందని వీసీ స్పష్టం చేశారు.

Posted Date : 26-08-2021