• facebook
  • whatsapp
  • telegram

JNTUH: సాంకేతిక విద్య కల సాకారం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జేఎన్టీయూహెచ్‌ ఏర్పాటుకు కసరత్తు

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: జిల్లాలో దశాబ్దాలుగా ఎదురు చూస్తోన్న సాంకేతిక విద్య కల సాకారం కానుంది. నిరుపేద కుటుంబాల్లోని సరస్వతీ పుత్రులకు వరంగా మారనుంది. ఎంసెట్‌లో ప్రతిభ కనబరిచిన వారికి ఆగస్టు 30 నుంచి జరిగే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో సిరిసిల్ల కళాశాలలో ప్రవేశాలకు అవకాశం ఉంది. ఆ దిశగా జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం హైదరాబాద్‌ (జేఎన్టీయూహెచ్‌) కసరత్తు ప్రారంభించింది.

* జిల్లాలో సాంకేతిక విద్యావకాశాలను దగ్గర చేయాలనే దిశగా రెండేళ్లుగా నిపుణుల కమిటీ విడతల వారీగా పర్యటించింది. కళాశాల ఏర్పాటు ఆవశ్యకత, మౌలిక వసతులు సమకూర్చుకునే అంశాలను పరిశీలించారు. అప్పుడే ఇంజినీరింగ్‌ కళాశాల సిరిసిల్లలో ఏర్పాటుకు అన్ని విధాలుగా అనుకూలమైందని కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఇటీవల జిల్లాలో జేఎన్టీయూహెచ్‌ ఏర్పాటు, ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు, తరగతుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైదరాబాద్‌ జేఎన్టీయూహెచ్‌ ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు ఈ విద్యా సంవత్సరం కోర్సుల ఏర్పాటుకు సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ సంప్రదాయ బీటెక్‌ కోర్సులతోపాటు టెక్స్‌టైల్‌ టెక్నాలజీ వంటివి యువతను ఆకర్షించే కోర్సులను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో మూడోది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జేఎన్టీయూహెచ్‌ ప్రారంభంతో ఉమ్మడి జిల్లాలో మూడోది. ఇప్పటికే మంథని, కొడిమ్యాల జేఎన్టీయూహెచ్‌లు, 11 ప్రైవేటు కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని కన్వీనర్‌ కోటాలో మరో వంద సీట్లు పెరగనున్నాయి. జిల్లాలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులకు ఆ అవకాశం రానేవచ్చింది. ఆగస్టు 25న ఎంసెట్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో 2021-22 విద్యాసంవత్సరం ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు జేఎన్టీయూహెచ్‌ పచ్చజెండా ఊపింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 9 వరకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం ఉంది. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 4 నుంచి 13 వరకు అభ్యర్థులు కాలేజీల ఆప్షన్లను ఎంచుకోవాలి. సెప్టెంబరు 15న సీట్లను కేటాయించనున్నారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం తుది దశ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. తొలి ఏడాది తరగతుల నిర్వహణ.. వసతి ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, జిల్లా ఉన్నతాధికారులు ఇటీవల పలు భవనాలను పరిశీలించారు. అగ్రహారంలోని డిగ్రీ కళాశాల, తంగళ్లపల్లి మండలం జిల్లెలలోని వ్యవసాయ కళాశాలల అనుకూలతలపై నివేదిక తీసుకున్నారు.

ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: మంజూర్‌ హుస్సేన్, జేఎన్టీయూహెచ్, రిజిస్ట్రార్‌

ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేసి తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కళాశాలకు ప్రత్యేకతను చాటుకునేలా సంప్రదాయ కోర్సులతోపాటు డిమాండ్‌ ఉన్న కోర్సులను డిజైన్‌ చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. ప్రవేశాలలోపు అన్ని వివరాలు వెల్లడిస్తాం.

Posted Date : 27-08-2021