• facebook
  • whatsapp
  • telegram

Engineering Classes: సెప్టెంబ‌రు 6 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్‌, బీఫార్మసీ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు సెప్టెంబ‌రు 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆయా సంవత్సరాల మొదటి, రెండో సెమిస్టర్ల షెడ్యూల్‌ను వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ ఆగ‌స్టు 27న‌ ప్రకటించారు. మూడో ఏడాది మొదటి (3-1), నాలుగో ఏడాది తొలి (4-1) సెమిస్టర్ల తరగతులు సెప్టెంబ‌రు 6 నుంచి నవంబరు 6 వరకు కొనసాగుతాయి.  నవంబరు 15 నుంచి 2022 జనవరి 8 వరకు రెండో విడత తరగతులు ఉంటాయి. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 వరకు సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. రెండో సెమిస్టర్‌ తరగతులు 2022 ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమవుతాయి. రెండో సెమిస్టర్‌ పరీక్షలు 2022 జులై 11 నుంచి 23 వరకు జరగనున్నాయి.

బీటెక్‌, బీఫార్మసీ నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌(4-2) అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబ‌రు 13 నుంచి నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఆగ‌స్టు 28 నుంచి సెప్టెంబ‌రు 1వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది.

Posted Date : 28-08-2021