* మన దేశ భాషలకు తొలి ప్రాధాన్యవివ్వాలి
* ఆ తర్వాతే అన్యభాషల్లో ప్రావీణ్యతపై దృష్టి
* ఉపకులపతుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఈనాడు, దిల్లీ: ప్రపంచంలో ఎక్కడా ఆంగ్లం ఆధారంగానో, పరాయి భాషల ఆధారంగానో ఆర్థిక వ్యవస్థలు ఏర్పడి బలపడలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఏ అంశాన్నయినా మాతృభాషలో సూక్ష్మంగా అర్థంచేసుకుంటే ఆ తర్వాత ఏ భాషలోకైనా సులభంగా తర్జుమా చేయడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల నూతన విద్యా విధానం కింద భారతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆయన సెప్టెంబరు 03న వీడియోకాన్ఫరెన్స్ ద్వారా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సిద్ధాంతపరంగా నేను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు. కానీ భారతీయ భాషలకు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థా ఆంగ్లభాష ఆధారంగానో, మరో పరాయిభాష ఆధారంగానో ఎదగలేదు. నేడు అరబ్ దేశాలు ఆర్థికంగా బలోపేతంగా మారాయి. అరబిక్ నేర్చుకుంటే మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన జపాన్ ఆ తర్వాత ఒక పెద్ద వ్యవస్థగా ఎదిగిన క్రమాన్ని చూస్తే దాంట్లో ఏదో శక్తి ఉందని అర్థమవుతోంది. మన విద్యార్థులకు జపాన్ నేర్పించి అక్కడి విషయాలను నేర్చుకోవడాన్ని మనం వ్యూహంగా, ఆర్థిక అవసరంగా అమలు చేయాలి. ఇలా ప్రతి ఒక్కరూ అదనంగా ఒక పరాయి దేశ భాష నేర్చుకోవడం మంచిదే. విదేశీ వ్యవహారాల శాఖలో ప్రతి అధికారీ మొదటి నుంచి ఒక అదనపు భాష నేర్చుకుంటారు. మన యూనివర్శిటీల్లోనూ అదనపు భాషలు నేర్పడం మంచిదే. దానివల్ల ఆయా దేశాలకు వెళ్లే విద్యార్థులకు మేలు జరుగుతుంది. మాతృభాషలో బోధించినప్పుడే ఏ విషయాన్నయినా పిల్లలు సూక్ష్మంగా అర్థం చేసుకోగలుగుతారు. మనసులోకి ఎక్కించుకున్న విషయాలను ఆ తర్వాత ఏ భాషలోకైనా అనువాదం చేసి చెప్పగలుగుతారు. అందువల్ల యూనివర్శిటీలు భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ప్రపంచ నూతన క్రమానుగతి రూపుదిద్దుకోనుంది. యూనివర్శిటీలు కీలకపాత్ర వహించనున్నాయి. దేశంలో పాఠశాల విద్యలో దాదాపు 26 కోట్లు, ఉన్నత విద్యలో 5 కోట్లమంది విద్యార్థులున్నారు. చదువుల్లో ముందున్న వారే ఉన్నత విద్యకు చేరుకుంటారు. కనుక పరిశోధనలు, విషయాన్ని లోతుగా అర్థంచేసుకొనే తత్వాన్ని చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలి. నూతన విద్యావిధానాన్ని వినూత్నంగా అమలుచేసి, సమయానుకూలంగా కోర్సుల్లో నవ్యతను తీసుకురావాల్సిన బాధ్యత యూనివర్శిటీలదే’’ అని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.