• facebook
  • whatsapp
  • telegram

Aided Schools: ఎయిడెడ్‌కు చరమగీతం

ఆర్థిక భారం దించుకునేందుకు కసరత్తు 
ఇప్పటికే మూతపడిన 418 పాఠశాలలు..  ప్రైవేటుగా మారిన 753
కొత్త నియామకాలు లేనందున  భవిష్యత్తులో అన్నీ మూతే!
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తొలితరం వారికి జ్ఞానాన్ని అందించిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. స్వల్ప ఫీజులతో చదువుకున్న విద్యార్థులు ఈ ఏడాది ఫీజు చెల్లించాల్సి వస్తోంది. బడులు మూతపడినచోట తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రైవేటు లేదా ప్రభుత్వ విద్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా మారిన వాటిల్లో చదువుతున్న పిల్లలు ఫీజు కట్టాల్సి వస్తోంది. ఇది పేద విద్యార్థులకు భారమవుతోంది. విద్యార్థుల ప్రవేశాలు తగ్గాయని, అధ్యాపకుల వేతనాలు, కొత్త నియామకాలు ఆర్థిక భారమని, యాజమాన్యాలు సరిగా నడపలేకపోతున్నాయనే కారణాలతో స్వచ్ఛందమంటూనే ఈవ్యవస్థకు ప్రభుత్వం ముగింపు పలికింది. ఆస్తులతో అప్పగింత, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయవచ్చనే ఐచ్ఛికాలను ఇచ్చినా నిబంధనల పేరుతో ఒత్తిడి తప్పడం లేదు. దీంతో కొన్ని యాజమాన్యాలు సిబ్బంది, మరికొన్ని ఆస్తులతో సహా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించాయి. సిబ్బందిని ఇచ్చేసిన కొన్ని సంస్థలు ప్రైవేటుగా కొనసాగలేక మూతపడుతున్నాయి. రాష్ట్రంలో 818 వరకు ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడ్డాయి.
సద్దుమణిగాక..
ఎయిడెడ్‌ విద్యాసంస్థల మూసివేతపై గతేడాది విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వానికి అప్పగించిన వాటిని వెనక్కి తీసుకునేందుకు అవకాశమిచ్చారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉండటం, విద్యార్థులు, తల్లిదండ్రుల వ్యతిరేకతతో కొంతకాలం అధికార యంత్రాంగం మౌనంగా ఉంది. ఆందోళనలు సద్దుమణిగాక సిబ్బందిని అప్పగించిన వాటిని ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు అనుమతించింది. అన్‌ఎయిడెడ్‌గా మారిన విద్యాసంస్థలు ఈ ఏడాది విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనున్నాయి. పిల్లలు తక్కువగా ఉండి ప్రైవేటుగా నిర్వహించలేని సంస్థలను మూసేస్తున్నారు. ఎయిడెడ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న వారు పదేళ్లలో పదవీ విరమణ పొందనున్నారు. తర్వాత వాటికవే ప్రైవేటుగా మారిపోనున్నాయి. ఇప్పటికే 4జూనియర్‌ కళాశాలల్లో ఒక్కరూ ఎయిడెడ్‌ సిబ్బంది లేరు.
పాఠశాలలే అధికం
రాష్ట్రంలో 1,988 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా వీటిలో 753 యాజమాన్యాలు సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాయి. 83 సంస్థలు ఆస్తులతో సహా అప్పగించాయి. సిబ్బందిని అప్పగించిన వాటిలో 400 సంస్థల మూతకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. 40మంది కంటే తక్కువ పిల్లలు ఉన్నందున 418 పాఠశాలల మూసివేతకు పాఠశాల విద్యాశాఖ నోటీసులిచ్చింది. మరో 422 బడులపైనా నోటీసుల కత్తి వేలాడుతోంది. పిల్లల సంఖ్య పెరగడంతో వీటికి మినహాయింపునిచ్చారు. ఇప్పుడు మౌలిక సదుపాయాల పరిశీలన కమిటీలిచ్చే నివేదికపైనే ఎయిడెడ్‌ విద్యాసంస్థల భవితవ్యం ఆధారపడనుంది.
ఇప్పటికే రెండు మూత.. అదే బాటలో మరిన్ని
ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు 122 ఉండగా వీటిలో 70 యాజమాన్యాలు సిబ్బందిని అప్పగించాయి. మరో ఏడు ఆస్తులతో సహా ఇచ్చేశాయి. 41 కళాశాలలే ఎయిడెడ్‌లో కొనసాగుతున్నాయి. సిబ్బందిని అప్పగించిన 70 కళాశాలల్లో ఇప్పటికే వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులోని గౌరీశంకర్‌ విద్యాలయం మూతపడగా.. కాకినాడ ఐడీఎల్‌ కళాశాలలను మూసేస్తామని యాజమాన్యం ప్రకటించింది.
 రాష్ట్రంలో 137 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఆరు యాజమాన్యాలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాయి. లయోలా లాంటి ఏడు కళాశాలలు గ్రాంట్‌ఇన్‌ఎయిడ్‌కు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మొదట 124 డిగ్రీ కళాశాలలు సిబ్బందిని అప్పగించగా వీటిల్లో 43 సంస్థలు వెనక్కి వెళ్లాయి. ఎయిడెడ్‌లో కొనసాగేందుకు అంగీకరించాయి. వీటిలో కొన్ని యాజమాన్యాలు ప్రైవేటుగా నిర్వహించలేక ఇతర సంస్థలకు లీజుకిచ్చాయి. అర్హులైనవారికి ఉన్నత విద్యలో బోధన రుసుముల చెల్లింపున్నా ప్రత్యేక ఫీజుల పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. బోధన రుసుముల చెల్లింపు వర్తించని వారు గతంలో నామమాత్రపు ఫీజులతో చదువుకునేవారు. ఇప్పుడు వీరు కళాశాల నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి వస్తోంది.
ఇదీ విలీనం ‘వరస’
వీరంతా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినులు. ఇటీవల ప్రభుత్వం ప్రాథమిక బడుల్లోని మూడు నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. దీంతో ఈ పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య ఒక్కసారిగా 450 నుంచి 750కు చేరింది. వీరిలో 150 మంది మాత్రమే ఇస్కాన్‌ అందిస్తున్న మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. మిగతావారు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. వీరంతా భోజనం చేసేందుకు ఒకే హాలు ఉంది. అది సరిపోక పోవడంతో తమ సమయం వచ్చే వరకు బయట బారులుదీరుతున్నారు. మరికొందరు ఆరుబయట భోజనం చేస్తున్నారు.
ఇటు 7.. అటు 3, 4
పాఠశాలల విలీనంతో సరిపడా గదులులేక విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని శివ్వన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఒకే గదిలో మూడు తరగతులను నిర్వహిస్తున్నారు. ఇటీవల సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థులు 26 మందిని ఇక్కడ విలీనం చేశారు. వీరికి సరిపడా గదులు లేకపోవడంతో ఒకే గదిలో ఏడు, మూడు, నాలుగు తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు తక్కువ మంది కావడంతో ఒకే గదిలో చెబుతున్నామని, అదనపు గదుల కోసం ఉన్నతాధికారులకు నివేదించామని ప్రధానోపాధ్యాయురాలు పార్వతి తెలిపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.