• facebook
  • whatsapp
  • telegram

3, 5, 8 Classes: విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం!

3, 5, 8 తరగతులపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులందరూ కనీసం 50% ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చేలా కృషి
కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ నివేదిక
ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థుల్లో తరగతులకు తగినట్లు విద్యా సామర్థ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కనీసం 50 శాతం, ఆపై ప్రశ్నలకు విద్యార్థులందరూ సరైన సమాధానాలు రాసేలా తీర్చిదిద్దుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. మొత్తం 28 అంశాలపై వచ్చే నాలుగు విద్యా సంవత్సరాల్లో ఎలాంటి పురోగతి సాధిస్తామో వివరిస్తూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ కేంద్రానికి నివేదిక సమర్పించింది. జాతీయస్థాయిలో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులపై రెండేళ్లకు ఒకసారి నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే(న్యాస్‌) నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అన్ని సబ్జెక్టుల్లో ప్రశ్నలిచ్చి విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారు? ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబులు ఇచ్చారో మూల్యాంకనం చేసి రాష్ట్రాలు, జిల్లాల వారీగా నివేదికలను కేంద్ర విద్యాశాఖ వెల్లడిస్తోంది. గత నవంబరులో నిర్వహించిన సర్వేలో రాష్ట్రం బాగా వెనకబడినట్లు స్పష్టమైంది. ఈ సర్వేలో 3, 5 తరగతుల్లో కనీసం 50% ప్రశ్నలకు 56-68 శాతం మంది విద్యార్థులే సరైన జవాబులు రాశారు. ఈ తరగతుల్లో 2025-26 నాటికి భాష, గణితంలో 100 శాతం విద్యార్థులు కనీసం 50% ప్రశ్నలకు సరైన జవాబులు రాసేలా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. ఎనిమిదో తరగతిలో.. గణితంలో 37 శాతం, భాషలో 53 శాతం మందే కనీసం 50% ప్రశ్నలకు సరైన జవాబులు రాశారు. దీన్ని 85 శాతానికి పెంచుతామని రాష్ట్రం తెలిపింది.
డ్రాపౌట్లు 6 శాతానికి తగ్గిస్తాం..
 6-10 తరగతుల్లో గత విద్యా సంవత్సరం(2021-22) మధ్యలో బడి మానేసిన వారు 13.85 శాతం ఉండగా.. దాన్ని 2025-26కు 6 శాతానికి తగ్గిస్తామని రాష్ట్రం పేర్కొంది.
 6-8 తరగతుల విద్యార్థుల సంఖ్యను 57,600 నుంచి లక్షకు పెంచుతామని తెలిపింది.
 9 నుంచి ఇంటర్‌ వరకు గత ఏడాది 71,345 మంది ఒకేషనల్‌ విద్య నేర్చుకున్నారు. ఈ సంఖ్యను నాలుగేళ్లలో లక్షకు పెంచుతామని వెల్లడించింది.
ఏం నేర్చుకుంటున్నారు.. ఎంత అర్థమైందో అడిగేవారేరి?: నన్నూరి ఉపేందర్‌రెడ్డి,మాజీ ఆచార్యుడు, ఎస్‌సీఈఆర్‌టీ
సిలబస్‌ పూర్తిపై, మధ్యాహ్న భోజనం అమలుపై సమీక్షలు చేస్తున్నారు తప్ప.. పిల్లలు వారి తరగతికి తగిన అంశాలు నేర్చుకుంటున్నారా? అనే విషయంలో ఒక్క సమావేశం కూడా జరపడం లేదు. ఉపాధ్యాయ ఖాళీలు 20 వేల వరకు ఉన్నాయి. ఉపాధ్యాయులు పూర్తిగా ఉన్న చోట కూడా పిల్లలకు చదువు బాగా రావడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ అటుఇటుగా అదే దుస్థితి. దీనంతటికి విద్యా వ్యవస్థదే లోపం. చిత్తశుద్ధితో కూడిన ప్రణాళిక లేదు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.