• facebook
  • whatsapp
  • telegram

JPS Posts: నియామక నిబంధనలకు తూట్లు

పంచాయతీరాజ్‌ శాఖలో ఇష్టారాజ్యం
రద్దయిన రూల్‌-6 తెరపైకి తెచ్చి కార్యదర్శుల నియామకాలు
జీవో 81 మినహాయింపు పేరిట అక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్‌) నియామకాల్లో పంచాయతీరాజ్‌ శాఖ నియామక నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం రద్దయిన మెరిట్‌ జాబితా నిబంధన తెరపైకి తీసుకువచ్చి అక్రమ పద్ధతిలో నియామకాలకు తెరతీసింది. ప్రైవేటు ఏజెన్సీలు నియమించిన పొరుగు సేవల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను..రెగ్యులర్‌ జేపీఎస్‌లుగానూ మారుస్తూ నిరుద్యోగుల కడుపుకొడుతోంది. రాష్ట్రపతి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాక తొలి నియామక ప్రకటన పంచాయతీరాజ్‌ శాఖలోనే వెలువడింది. మొత్తం 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి 2018లో ఉద్యోగ ప్రకటన వెలువడగా, రాత పరీక్ష నిర్వహించి మెరిట్‌ జాబితా ప్రకారం 2019 ఏప్రిల్‌లో నియామకాలు చేపట్టారు. మూడేళ్లపాటు ఒప్పంద పద్ధతిలో పనిచేశాక గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శిగా క్రమబద్ధీకరిస్తామని ఆ నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నారు. అయితే పనిభారం, అంతకన్నా మెరుగైన పోస్టులకు ఎంపిక కావడం తదితర కారణాలతో దాదాపు 2 వేల మంది వరకు ఉద్యోగాలను వదిలిపెట్టారు. నిబంధనల ప్రకారం.. ఈ ఖాళీలను బ్యాక్‌లాగ్‌గా ప్రకటించి, తదుపరి నియామక ప్రకటన ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్‌ లేకుండా నియామకాలు చేపట్టినప్పటికీ అవన్నీ తాత్కాలిక పద్ధతిలోనే ఉండాలి. ఈ నిబంధనలన్నింటినీ పంచాయతీరాజ్‌ శాఖ ఉల్లంఘిస్తోంది.
జీవో నం.81తో మెరిట్‌లిస్టు విధానం రద్దు...
నియామక నిబంధనల్లోని రూల్‌ నం.6 కింద 1997 వరకు మెరిట్‌ జాబితా అమల్లో ఉండేది. ఆ ప్రకారం అభ్యర్థులు..నియామక ఉత్తర్వులు అందిన 45 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. అలా చేరని పక్షంలో అభ్యర్థి ఉద్యోగాన్ని వద్దనుకున్నట్లు భావించి, మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థితో ఆ ఖాళీని భర్తీచేసేందుకు ఆ నిబంధన అనుమతి ఇచ్చింది. ఈ విధానంతో న్యాయ వివాదాలు ఏర్పడుతున్నాయని ఉమ్మడి రాష్ట్ర ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. నియామకాలకు మెరిట్‌ జాబితాను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని, అభ్యర్థి గడువులోగా ఉద్యోగంలో చేరకున్నా లేదా ఖాళీగా మిగిలిన కొలువులను తదుపరి నియామక ప్రకటన కింద మాత్రమే భర్తీ చేయాలని 1996లో న్యాయశాఖ జీవో నం.124 ద్వారా ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయశాఖ సూచన తదితర విషయాలను పేర్కొంటూ మెరిట్‌ జాబితా విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో జీవో నం.81 ద్వారా 1997 ఫిబ్రవరి 22న అప్పటి సీఎస్‌ ఎం.ఎస్‌.రాజాజీ రద్దు చేశారు.
సొంతంగా జీవోలు..  
జీవో నం.81కు మినహాయింపు ఇస్తున్నామని, జిల్లా కలెక్టర్లు ఖాళీగా ఏర్పడిన పోస్టుల్ని భర్తీ చేయొచ్చని చెబుతూ పంచాయతీరాజ్‌శాఖ 2019 ఆగస్టులో జీవో నం.495 జారీ చేసింది. ఈ జీవోను అడ్డం పెట్టుకునే పంచాయతీరాజ్‌శాఖ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇష్టానుసారంగా జేపీఎస్‌ల పోస్టులను భర్తీచేస్తోంది. వాస్తవంగా నియామక నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు సీఎస్‌ జారీ చేయాల్సి ఉండగా, అందుకు బదులుగా పంచాయతీరాజ్‌శాఖే సొంతగా జీవో జారీ చేసింది. అక్రమాలు, న్యాయ వివాదాలకు తావిచ్చేలా పాత విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పోనీ ఆ నిబంధనలనైనా పాటించారా? అంటే అదీ లేదు. పాత విధానం కింద తుది ఫలితాలు వెల్లడించిన ఏడాది వరకు మాత్రమే మెరిట్‌ జాబితా చెల్లుబాటు అవుతుంది. గడువులోగా ఉద్యోగాల్లో చేరని, ఆ పోస్టులు వద్దనుకున్న వారి ఖాళీలను మాత్రమే మెరిట్‌ జాబితా నుంచి భర్తీచేయాలి. అందుకు భిన్నంగా పంచాయతీరాజ్‌ శాఖ ఉద్యోగాల్లో చేరి, రాజీనామాతో ఆ ఉద్యోగాన్ని వద్దనుకున్న వారి ఖాళీలనూ భర్తీచేస్తోంది. పైపెచ్చు ఉద్యోగులను పొరుగు సేవల కింద నియమించి, వారినే రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా క్రమబద్ధీకరించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
ముడుపుల వ్యవహారం ఉందా?
పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు, జేపీఎస్‌ల స్థానాల్లో తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపట్టాలని 2019 అక్టోబరులో పంచాయతీరాజ్‌శాఖ మెమో జారీ చేసింది. ఈ నియామకాలన్నీ తాత్కాలికమని, కొత్త నోటిఫికేషన్‌ వచ్చేవరకు ఉంటాయని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియమితులైన పొరుగుసేవలు, తాత్కాలిక జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల్ని అక్రమ పద్ధతిలో రెగ్యులర్‌ జేపీఎస్‌గా మార్చుతోంది. నిబంధనల ప్రకారం ఖాళీలను బ్యాక్‌లాగ్‌గా గుర్తించకుండా, రోస్టర్‌ నిబంధనల్ని పక్కనపెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. పొరుగుసేవల కింద దాదాపు 2,500 మంది వరకు నియామకాలు పొందగా, వీరిలో చాలా మందిని రెగ్యులర్‌ జేపీఎస్‌లుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీచేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కొన్నిచోట్ల రాజకీయ జోక్యంతో ఈ నియామక ఆదేశాలు జారీ అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టుకు భారీగా నగదు చేతులు మారుతున్నాయని ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. బ్యాక్‌లాగ్‌ ఖాళీలుగా ఉండాల్సిన కొలువుల్ని నిబంధనలకు విరుద్ధంగా భర్తీచేయడం పట్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.