• facebook
  • whatsapp
  • telegram

Medical: సర్దుబాటుపై అనిశ్చితి

* అంధకారంలో ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థుల భవిత

* ఇప్పటికీ పెదవి విప్పని ఎన్‌ఎంసీ

* ఏ దేశంలోనైనా వైద్యవిద్య అభ్యసించడానికి మాత్రం అనుమతి

* స్పష్టత కొరవడి విద్యార్థుల ఆందోళన

 

ఈనాడు - హైదరాబాద్‌: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దేశంలోని సుమారు 20వేల మందికి పైగా వైద్య విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో వైద్యవిద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ప్రపంచంలో ఏ దేశంలోనైనా చదువుకోవడానికి పచ్చజెండా ఊపిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)..భారత్‌లో సర్దుబాటు చేయడంపై మాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో తమ భవిత అంధకార మవుతుందనే ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. ఎన్‌ఎంసీ అనేది సాంకేతికంగా అనుమతించే సంస్థ మాత్రమేనని దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.

ఇతర దేశాల్లో అంగీకారమైనప్పుడు.. ఇక్కడెందుకు కుదరదు?

యుద్ధ పరిస్థితుల్లో భారత్‌కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల్లో అత్యధికులకు ఎలాంటి తరగతులు జరగడం లేదు. కొన్ని వైద్య విశ్వవిద్యాలయాలు మాత్రం ఉక్రెయిన్‌ నుంచే ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాయి. అయితే వైద్యవిద్య అంటేనే ప్రత్యక్ష శిక్షణతో ముడిపడి ఉంటుంది. నేరుగా రోగులతో మాట్లాడుతూ.. వారి అనారోగ్య సమస్యలు తెలుసుకుంటూ..ఆచార్యుల మార్గనిర్దేశంలో శిక్షణ పొందాల్సి ఉంటుంది.

ఈ విషయంపై విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో.. ఇటీవల ఎన్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ దేశంలోనైనా వైద్యవిద్య కొనసాగించుకోవడానికి అనుమతించింది. ఉక్రెయిన్‌ వైద్య కళాశాలలే ఇతర దేశాల్లో వైద్యవిద్య బోధించినా అభ్యంతరం లేదంది. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా వైద్యవిద్య అభ్యసించడానికి అనుమతించగా.. అందులో భారత్‌ ఉందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. భారత్‌లోని వైద్య కళాశాలల్లో సీట్లను బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తారా? ఒకవేళ ఉక్రెయిన్‌ వైద్య సిబ్బంది భారత్‌లో బోధించడానికి ముందుకొస్తే అంగీకరిస్తారా? అనే విషయాన్ని తేల్చాల్సి ఉంది. ప్రపంచంలోని ఏ దేశంలో చదివినా గుర్తించినప్పుడు.. భారత్‌లోనూ చదువుకోవడానికి ఎందుకు అనుమతించరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఉక్రెయిన్‌ విద్యార్థులు భారత్‌లోని వైద్య కళాశాలల్లో చేరాలనుకుంటే..తిరిగి ఇక్కడ నీట్‌లో అర్హత సాధించి చేరిపోవచ్చని కూడా ఎన్‌ఎంసీ ఒక ఉచిత సలహా ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఒకటి.. రెండు.. మూడు.. నాలుగో సంవత్సరం చదువుతున్న వారు మళ్లీ ఇక్కడ నీట్‌ రాసి తొలి ఏడాదిలో చేరాలనడం ఎంత వరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అదనంగా ఎంబీబీఎస్‌ సీట్లను సృష్టించి సర్దుబాటు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు వేల మందికి ఊరట

విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఎన్‌ఎంసీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన తుది సంవత్సరం పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులను భారత్‌లో ఇంటర్న్‌షిప్‌కు అనుమతించింది. ఉక్రెయిన్‌లో ఈ ఏడాది జూన్‌ 30లోపు వైద్యవిద్య(ఎంబీబీఎస్‌)ను పూర్తి చేసుకున్న విద్యార్థులకు కేంద్రం ధ్రువపత్రాలు జారీ చేసింది. వీరందరూ కూడా ‘ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ పరీక్ష(ఎఫ్‌ఎంజీఈ) రాయడానికి అనుమతించింది. అయితే ఎఫ్‌ఎంజీఈలో అర్హత సాధించిన తర్వాత రెండేళ్ల పాటు ‘కంపల్సరీ రొటేటింట్‌ మెడికల్‌ ఇంటర్న్‌షిప్‌(సీఆర్‌ఎంఐ)’ చేయాలని షరతు విధించింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 4వేల మంది విద్యార్థులకు ఊరట లభించింది. ఇక్కడ రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర వైద్య మండలిలో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. తద్వారా ప్రాక్టీసు కూడా చేయవచ్చు. అయితే ఇప్పటి వరకూ తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఇంటర్న్‌షిప్‌ గురించి అడగలేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

త్వరగా నిర్ణయం తీసుకోవాలి -డాక్టర్‌ ఎం.సంపత్‌రావు, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

వైద్య విద్యార్థుల సర్దుబాటు అంశం అంత సులువైన ప్రక్రియ కాదు. కొత్త సీట్లను సృష్టించాలంటే ఎన్‌ఎంసీ అనుమతి పొందాల్సి ఉంటుంది. సీట్లకు తగ్గట్లుగా ఆచార్యులు, మౌలిక వసతులు కల్పించాలి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని భారతీయ వైద్య సంస్థ(ఐఎంఏ) తరఫున అభ్యర్థిస్తున్నా.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం!

‣ జేఈఈ స్కోరుతో బీటెక్‌ డిగ్రీ, ఆర్మీ కొలువు

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.