* విద్యాశాఖ ఆదేశాలు జారీ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ఇక తప్పనిసరి. బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకూ దీన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అక్టోబరు 12న ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ తదితర కళాశాలలతోపాటు విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు అమలు కానుంది. విద్యార్థులను పైతరగతులకు పంపించాలన్నా.. బోధన రుసుములు, ఉపకార వేతనాలు ఇవ్వాలన్నా ఈ హాజరును పరిగణనలోకి తీసుకుంటారు. సిబ్బందికి పదోన్నతులు ఇవ్వడానికీ ఒక కొలమానం కానుంది. దీన్ని అక్టోబరు 1వ తేదీ నుంచి అమలు చేయాలంటూ అక్టోబరు 12న విద్యాశాఖ మెమో ఇవ్వడం గమనార్హం.
కళాశాలకు రాకుంటే బోధన రుసుములు రానట్టే..
ప్రస్తుతం ఎంటెక్, ఎంఫార్మసీలో చాలామంది విద్యార్థులు కళాశాలలకు రావడం లేదు. ఉద్యోగాలు చేస్తూ పీజీ చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. బయోమెట్రిక్ హాజరు లేకుంటేనే చేరతామని చెప్పేవారూ ఉన్నారు. బయోమెట్రిక్ హాజరును కచ్చితంగా అమలు చేస్తే అలాంటివారికి బోధన రుసుములు రావు. బయోమెట్రిక్ హాజరు వస్తే పీజీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు రోజుల తరబడి తమ విభాగాలకు రారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వారు ఇకనుంచి హాజరు కోసమైనా ఉదయం, సాయంత్రం వర్సిటీకి రాక తప్పదు. అయితే విద్యాశాఖ ఆదేశాలు ఎంతవరకు అమలవుతాయన్నది వేచిచూడాలి.
సాంకేతిక, కళాశాల విద్యాశాఖల ముందంజ
బయోమెట్రిక్ హాజరు అమలులో సాంకేతిక, కళాశాల విద్యాశాఖలు ముందంజలో ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థులకు గత నాలుగేళ్ల నుంచి అమలు చేస్తున్నారు. ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు అమలవుతోంది. ఉపకార వేతనాలు, బోధన రుసుముల మంజూరు కోసం ఈ హాజరు వివరాలనే ఆయా సంక్షేమ శాఖలకు పంపిస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అమలవుతోంది. సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాల్లో సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందే. జేఎన్టీయూహెచ్ మాత్రం వర్సిటీలో కాకుండా అనుబంధ కళాశాలల్లో సిబ్బందికి అమలు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ 2017-18 నుంచే 14 జిల్లాల్లో ఉపాధ్యాయులకు వర్తింపజేస్తుండగా.. తాజాగా మరో నాలుగు జిల్లాలకు విస్తరించింది. కానీ, ఈ హాజరు ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదు. నామమాత్రంగా అమలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్!
‣ పారిశ్రామిక భద్రతా దళంలోకి స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.