‘ఈనాడు’తో గ్రేటర్ విద్యా శాఖాధికారుల మాట
ఈనాడు, హైదరాబాద్: చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల విద్యా శాఖాధికారులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలను మూసివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ప్రత్యేక తరగతులతో పదో తరగతి ఫలితాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వివిధ అంశాలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో వారు ఏం చెప్పారంటే...
1.బంజారాహిల్స్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2. అనుమతి లేకుండా తరగతులు, పాఠశాలలు నిర్వహిస్తున్నారు, వాటిని ఎలా కట్టడి చేస్తున్నారు.?
3. పదో తరగతి ఫలితాల మెరుగుకు అనుసరిస్తున్న విధానాలేమిటి?
4.సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
5. శిక్షణ కేంద్రాలు, ట్యుటోరియల్స్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలు?
6.మన ఊరు-మన బడి పనుల్లో జాప్యం తగ్గించేందుకు ఎలాంటి పర్యవేక్షణ అనుసరిస్తున్నారు?
పది ఫలితాలపై‘ప్రత్యేక’శ్రద్ధ: పి.సుశీంద్రరావు,డీఈవో,రంగారెడ్డి జిల్లా
1. ఘటన జరిగిన వెంటనే జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించాను. ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలుండాలి. బోధన, బోధనేతర సిబ్బందికి వేర్వేరుగా విధులు కేటాయించాలి. బడి బస్సుల్లో తీసుకెళ్లేప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించాం. ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాల నిర్వహణతోపాటు వారు ఎప్పుడొచ్చినా సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ టీచర్ను కేటాయించాలని స్పష్టం చేశాం.
2. అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలకు నోటీసులిచ్చాం. ఇప్పటికే కొందరు మూసివేశారు. మరో ఏడెనిమిది పాఠశాలలు మా దృష్టికి వచ్చాయి. పిల్లలను సర్దుబాటు చేసి డిసెంబరు 15కల్లా మూసివేస్తాం.
3. సెప్టెంబరు 16 నుంచే ఉదయం, సాయంత్రం గంటన్నర చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. డిసెంబరు 31లోపు సిలబస్ పూర్తి చేయనున్నాం. ఏ రోజు ఏ సబ్జెక్టు బోధించాలి.. ఏ పరీక్ష పెట్టాలనే సమగ్ర ప్రణాళిక వేసి పాటించేలా బుక్లెట్ ఇచ్చాం. కలెక్టర్ నిధులతో అల్పాహారం అందిస్తాం.
4. సబ్జెక్టు టీచర్లపరంగా తరగతులకు అవసరమైన అర్హత ఉన్న టీచర్లందర్నీ సర్దుబాటు చేశాం. ఖాళీల భర్తీ డీఎస్ఈ తరఫున జరగాలి.
5. జీవో 200 ప్రకారం విద్యాశాఖ నుంచే అనుమతులు తీసుకోవాలి. ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నోటీసులిచ్చాం. పని భారంతో మండల అధికారులు పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వెంటనే సీజ్ చేస్తున్నాం.
6. మన ఊరు.. మన బడి పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 45 పాఠశాలలకు రంగులు వేశారు. నిధులకు కొరత లేదు.
అనుమతి లేకుంటేగుర్తింపు రద్దు: ఆర్.రోహిణి,డీఈవో,హైదరాబాద్
1. జిల్లాలో దాదాపు 2800 ప్రైవేటు పాఠశాలలున్నాయి. అన్నింటా తనిఖీలు చేపడుతున్నాం. విద్యార్థి ఇంటి నుంచి బయల్దేరినప్పట్నుంచి పాఠశాల నుంచి తిరిగి వెళ్లే వరకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని పాఠశాలలకు సూచించాం.
2. తనిఖీల్లో భాగంగా నోడల్ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, డిప్యూటీ డీఈవోలు, సెక్టోరల్ అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని పాఠశాలలను పరిశీలిస్తారు. అనుమతి లేదని గుర్తిస్తే తాఖీదులిస్తాం. మూసివేయకపోతే అపరాధ రుసుం విధిస్తాం.
3. పదో తరగతిపై కచ్చితమైన పర్యవేక్షణ ఉంటోంది. దసరా సెలవులు తర్వాత నుంచే సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. దాతల సహకారం తీసుకుని సాయంత్రం అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
4. జిల్లాలో ఇప్పటికే 170కుపైగా ఎస్జీటీలను సర్దుబాటు చేశాం. ఎన్జీవోల సాయంతో వాలంటీర్లు, బీఈడీ శిక్షణ తీసుకుంటున్న వారితోనూ బోధిస్తూ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
5. అధికారులు ఆయా కేంద్రాల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. వెంటనే అనుమతులు తీసుకోవాలి. లేకపోతే చర్యలు తీసుకుంటాం.
6. మొదటి విడతలో నాలుగు పాఠశాలలు మినహా అన్ని చోట్లా మన ఊరు.. మన బడి పనులు జరుగుతున్నాయి. పురోగతితో ఎప్పటికప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు.
భద్రత చర్యలపై ప్రతి పాఠశాలకు ఆదేశం: ఐ.విజయకుమారి, డీఈవో, మేడ్చల్ జిల్లా
1. ఘటనకు ముందే జీవో.36 ప్రకారం తీసుకోవాల్సిన చర్యల వివరాలు ఎంఈవోలతో అన్ని పాఠశాలలకు పంపించాం. మండల స్థాయిలో తనిఖీలు చేసి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాం. విద్యాశాఖ అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు. మహిళా టీచర్లు ఉండాలి. పోలీసు శాఖ తరఫున బాలమిత్ర పేరిట అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం.
2. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న తరగతులు, పాఠశాలలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశాం. అనధికారికంగా తరగతులు నిర్వహిస్తుంటే మూసివేస్తాం.
3. పదో తరగతి ఫలితాలపై హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి సమీక్షించుకున్నాం. ఇప్పటికే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నచోట ఉదయం, సాయంత్రం వేర్వేరుగా ఏర్పాటుచేశాం.
4. ఇప్పటికే 40-50 మంది సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేశాం. ఎక్కువగా ఉన్నచోట నుంచి తక్కువగా ఉన్న చోటుకు పంపించాం.
5. జిల్లాల్లో ఆయా కేంద్రాలు తక్కువే. ఈ విషయంపై ప్రత్యేకంగా పరిశీలన చేస్తాం. అనుమతులు తీసుకోవాలని సూచిస్తున్నాం.
6. మన బడి పనులపై అదనపు కలెక్టర్ సమీక్షించి ఆదేశాలు ఇచ్చారు. 15 రోజులకోసారి పరిశీలన చేస్తారు. 24చోట్ల రంగులు వేయడం పూర్తయ్యింది. మరో 26 టెండరు ప్రక్రియలో, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.