• facebook
  • whatsapp
  • telegram

JEE-Mains: జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్‌

తొలి విడత దరఖాస్తుల సమర్పణకు జనవరి 12 వరకు గడువు
ఏప్రిల్‌ 6 నుంచి చివరి విడత పరీక్షలు
ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: జేఈఈ మెయిన్‌-2023పై జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను జనవరి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్‌టీఏ డిసెంబ‌రు 15న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలి విడతను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో, చివరి విడత ఏప్రిల్‌ 6 నుంచి 12వ తేదీ వరకు జరుపుతామని వెల్లడించింది. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్‌, బీ-ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్‌-2, మిగిలిన రోజుల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో ప్రకటిస్తారు.
హాల్‌టికెట్లను జనవరి మూడో వారంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఏప్రిల్‌లో జరిగే చివరి విడతకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు..
దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.
ఈసారి ఇంటర్‌ మార్కుల నిబంధన
కరోనా కారణంగా గత మూడేళ్లుగా కనీస మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులైతే చాలు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించారు. ఈసారి మళ్లీ మార్కుల నిబంధనను విధించారు. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చినా ఇంటర్‌లో మాత్రం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65శాతం, మిగిలినవారికి 75 మార్కులు తప్పనిసరిగా రావాలని ఎన్‌టీఏ స్పష్టంచేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
తెలంగాణ: హయత్‌నగర్‌, హైదరాబాద్‌, జగిత్యాల, జనగామ, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌, నల్గొండ, నిజామాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌
ఏపీ: గుంటూరు, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, కడప, కాకినాడ, కర్నూల్‌, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ముఖ్యాంశాలివీ..
‣ పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషాల్లో నిర్వహిస్తారు. ఇతర భాషల్లో హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం, ఒడియా, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంతోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలోనూ ఇస్తారు. పేపర్‌-1 300 మార్కులకు, పేపర్‌-2 400 మార్కులకు ఉంటాయి.
‣ పరీక్షలు కంప్యూటర్‌ ఆధారంగా సాగుతాయి. బీఆర్క్‌ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ విధానంలో డ్రాయింగ్‌ పరీక్ష కూడా ఉంటుంది.
‣ పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. తొలి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్టు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.
‣ గత రెండేళ్ల మాదిరిగానే ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-బీలో 10 ప్రశ్నల్లో అయిదుకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెక్షన్లలోనూ తప్పు సమాధానాలకు మైనస్‌ మార్కులుంటాయి.
‣ దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు లేదా తమ తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామాలే ఇవ్వాలని.. ఏదైనా సమాచారం ఉంటే వాటికి పంపుతామని ఎన్‌టీఏ తెలిపింది.
‣ ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000, 69227700నంబర్లకు ఫోన్‌చేయవచ్చు. www.jeemain @nta.ac.inకు మెయిల్‌ చేయవచ్చు. విద్యార్థులు తాజా సమాచారం కోసం www.jeemain.nta.nic.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.