* జనవరి ప్రవేశాలకు తాకిడి
* కరోనా ముప్పు తక్కువేనంటున్న ఏజెన్సీలు
ఈనాడు, హైదరాబాద్: విదేశాల్లో చదువు.. ఎంతో మంది విద్యార్థుల కల. ఏటా జూన్, జనవరిల్లో రెండు దఫాలుగా విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు జరుగుతుంటాయి. జనవరిలో జరిగే స్ప్రింగ్ సీజన్ ప్రవేశాలకు పెద్దసంఖ్యలో విద్యార్థులు వెళ్తుంటారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం కరోనా నాలుగో దశపై ఆందోళన ఉంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇంజినీరింగ్ విద్య పూర్తయ్యాక పట్టాలు, పీసీలు ఇచ్చేందుకు సమయం పడుతుంది. ‘‘కరోనా పరిస్థితులతో విద్యా సంవత్సరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు జనవరి ప్రవేశాలకు ఆసక్తి చూపిస్తున్నారు’’ అని జేఎన్టీయూ పరీక్షల విభాగం మాజీ సంచాలకుడు ప్రొ.కామాక్షి ప్రసాద్ విశ్లేషించారు.
అక్కడ సాధారణ పరిస్థితులే
బీటెక్, ఎమ్మెస్సీ చేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది జనవరి ప్రవేశాలను ఎంచుకుంటున్నారు. రెండున్నరేళ్లుగా కరోనా పరిస్థితులతో విద్యా ప్రణాళిక గాడి తప్పింది. మే, జూన్ నాటికి ముగిసే విద్యా సంవత్సరం కాస్త సెప్టెంబరు, అక్టోబరు వరకు సాగుతోంది. ఆగస్టు, సెప్టెంబరులో విదేశాల వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. రెండేళ్ల్లుగా జనవరిలో వెళ్లే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఇక చైనాకు వచ్చే ప్రయాణికులపై ఆ దేశం ఆంక్షలు సడలించింది. ఎంబీబీఎస్ చేసేందుకు ఆ దేశానికి వెళ్లే విద్యార్థులు సైతం జనవరి వైపే మొగ్గు చూపారు. విమాన టికెట్ల విషయంలోనూ ధరలు రెండింతలయ్యాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికా విమాన టిక్కెట్ ధర రూ.55 వేల వరకు ఉండగా.. ఈ నెలలో రూ.90వేల నుంచి రూ.1.20లక్షల వరకు ఉన్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు చెబుతున్నారు. ‘‘ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొన్ని దేశాలకే పరిమితం. మన వద్ద నుంచి అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎక్కువగా వెళుతున్నారు, అక్కడ సాధారణ పరిస్థితులే ఉండటంతో విద్యార్థులు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు’’ అని బేగంపేటకు చెందిన విదేశీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు.
ఆగస్టు తర్వాతే ఎక్కువ ట్రాన్స్స్క్రిప్టులు
సాధారణంగా ఏటా ఉస్మానియా వర్సిటీ నుంచి 1.35 లక్షల ట్రాన్స్స్క్రిప్టులు జారీ అవుతుంటాయి. 2021లో 1.40లక్షల జారీ చేయగా.. గతేడాది ఆ సంఖ్య 1.60 లక్షలకు చేరుకుంది. ఇందులో ఎక్కువగా ఆగస్టు తర్వాతే తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్స్క్రిప్టులు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా తీసుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి ప్రవేశాలకు ఎక్కువ మంది సిద్ధమయ్యారని వివరిస్తున్నారు. ఓయూలో పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఇటీవలే పూర్తికావడంతో ఈ నెలలోనే ఎక్కువ మంది విదేశీ విద్యకు మొగ్గు చూపే అవకాశం ఉందని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీనగేశ్ వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ విద్యా సంస్థలకు గ్రేడింగ్ ఎలా ఇస్తారు?
‣ టిస్ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.