• facebook
  • whatsapp
  • telegram

Study Circles: ఉద్యోగ శిక్షణ ఊసు మరిచారా?

అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లను పట్టించుకోని జగన్‌ సర్కారు
నాలుగేళ్లలో ఒక్కసారే అవకాశం
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేదెలా?

పేదరికం వల్ల పిల్లలెవరూ చదువుకు దూరం కాకూడదు. పిల్లల చదువుల కోసం ఏ పేదవాడూ అప్పులపాలు కాకూడదు. పేదల బతుకుల్లోకి చదువు రావాలి.’ - ఈ ఏడాది జూన్‌ 6న ‘ఆణిముత్యాలు’ కార్యక్రమంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి.
ఈ మాటలు వినడానికి ఎంతో ఇంపుగా.. బడుగుల కోసం సీఎం జగన్‌ ఎంతో పరితపిస్తున్నట్టుగా ఉన్నాయి కదా! పేదల చదువులపై ఎంతో శ్రద్ధ ఉన్నట్టు మాట్లాడే జగన్‌... సాంఘిక సంక్షేమ శాఖ స్టడీ సర్కిళ్ల ద్వారా అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ అవకాశాల్ని తగ్గించేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో శిక్షణ అందించింది ఒక్కసారే. గతేడాది ప్రారంభించిన ఉచిత శిక్షణ సైతం కొన్ని పోటీ పరీక్షలకే పరిమితం చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కదా? దీంతో రెండో దఫా శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనాడు, అమరావతి, తిరుపతి, న్యూస్‌టుడే, ఎంవీపీ కాలనీ: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు విజయం సాధించడంలో సన్నద్ధత అత్యంత కీలకం. మంచి శిక్షణ పొంది తమ కలల్ని నెరవేర్చుకునేందుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్థిక ఇబ్బందులే ప్రధాన ప్రతిబంధకం. అందుకే పేద అభ్యర్థులకూ ఉన్నత ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందించేలా 17 ఏళ్ల క్రితం స్టడీ సర్కిళ్లని ఏర్పాటు చేశారు. ఏ రకమైన పోటీ పరీక్షకైనా శిక్షణ ఇచ్చేలా వీటిని గత ప్రభుత్వాలు తీర్చిదిద్దాయి. ఫలితంగా ఎందరో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. కానీ జగన్‌ కాస్త ప్రత్యేకం కదా.. అందుకే కొత్త నిబంధనలతో శిక్షణ ఇచ్చే అంశాలనూ కుదించారు.
ఏటా శిక్షణ అటకెక్కింది!
రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లు 17 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చేవరకు వీటిలో ఏటా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌, డీఎస్సీ, బ్యాంకు క్లర్క్‌, పీవో, గ్రూప్‌-డి(రైల్వే), పంచాయతీ కార్యదర్శి, పోలీస్‌ కానిస్టేబుల్‌, వీఆర్‌వో, వీఆర్‌ఏ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందేవారు. జగన్‌ అధికారంలోకి రాగానే ఈ శిక్షణకు బ్రేక్‌ పడింది. తర్వాత అన్ని పోటీ పరీక్షలకు కాకుండా కేవలం సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌-1, బ్యాంకు పీవో ఉద్యోగాలకు మాత్రమే శిక్షణ ఇస్తామని ఉత్తర్వులిచ్చారు. అందులోనూ ఒక్కో పరీక్ష శిక్షణను ఒక్కో కేంద్రానికి పరిమితం చేశారు. విశాఖలో సివిల్‌ సర్వీసెస్‌, విజయవాడలో గ్రూప్‌-1, తిరుపతిలో బ్యాంకింగ్‌ పోస్టులకు శిక్షణ ఇచ్చేలా మార్పులు చేశారు. గత నాలుగేళ్లలో 2022లో ఒక బ్యాచ్‌కు మాత్రమే శిక్షణ ఇవ్వగా, రెండో బ్యాచ్‌ శిక్షణకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈమేరకు తిరుపతి కేంద్రంలో గ్రూప్‌-2 శిక్షణ అందిస్తామని వెల్లడించారు.
ఒప్పంద ఉద్యోగులకు ఉద్వాసన
జగన్‌ ప్రభుత్వం 2019లో ఉచిత శిక్షణకు బడ్జెట్టే కేటాయించలేదు. కరోనా తదితర కారణాలతో 2020 నుంచి 2021 సెప్టెంబరు వరకు స్టడీ సర్కిళ్లను పట్టించుకోలేదు. పైగా దాదాపు పొరుగు సేవల సిబ్బందినీ తొలగించారు. విజయవాడలోని స్టడీ సర్కిల్‌లో 2005 నుంచి 2019 వరకు 1,621 మంది వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందారు. ఇందులో 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో శిక్షణ పొందినవారే 385 మంది. మొత్తంగా విజయవాడ కేంద్రంలో పలు పోటీ పరీక్షలకు శిక్షణ పొందినవారిలో 121 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య తిరుపతి స్టడీ సర్కిల్‌లో బ్యాంకు పీవో, గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌, డీఎస్సీ పరీక్షలకు 402 మంది శిక్షణ పొందగా, 78 మంది ఉద్యోగాలు సాధించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక 2022లో విజయవాడ కేంద్రంలో 100 మందికి గ్రూప్‌-1, తిరుపతిలో రెండు విడతలుగా బ్యాంకు పీవో శిక్షణ ఇచ్చినట్టు సాంఘిక సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.  
ఒకే భవనం.. రెండు ప్రారంభోత్సవాలు
విశాఖ స్టడీ సర్కిల్‌ సొంత భవనం కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం రుషికొండ వద్ద స్థలం కేటాయించింది. నిర్మాణానికి అప్పటి మంత్రి పుష్పరాజ్‌ శంకుస్థాపన చేశారు. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ 2009లో మరోసారి శంకుస్థాపన చేసినా నిర్మాణం అటకెక్కింది. రాష్ట్ర విభజన అనంతరం తెదేపా ప్రభుత్వం రూ.4.5 కోట్లు కేటాయించి, 2019 నాటికి భవన నిర్మాణం పూర్తిచేయగా, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం మొత్తం నిర్మాణం తామే చేసినట్లు చెప్పుకునే ప్రయత్నం చేసింది. తెదేపా హయాంలో నిర్మించి, ప్రారంభించిన భవనాన్ని 2022లో మంత్రి మేరుగు నాగార్జున మరోసారి ప్రారంభించడం కొసమెరుపు.

మరింత సమాచారం... మీ కోసం!

ఆర్‌ఆర్‌సీఏటీ-మధ్యప్రదేశ్‌లో 150 అప్రెంటిస్‌ ఖాళీలు

డాక్టర్ వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.