• facebook
  • whatsapp
  • telegram

 BED: బీఈడీ కళాశాలల అనుమతుల్లో భారీ అక్రమాలు

‣ ఒకే కళాశాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో 100, ఆచార్య నాగార్జునలో 100 సీట్లు

‣ ఎన్‌సీటీఈ అనుమతులు లేకుండానే కొనసాగింపు

‣ అధికార పార్టీ నేతల హస్తం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ కళాశాలల అనుమతుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ఇచ్చే అనుమతులు.. విశ్వవిద్యాలయాలు ఇచ్చే అనుబంధ గుర్తింపు.. ఉన్నత విద్యామండలి నిర్వహించే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు పొంతన లేకుండాపోతోంది. అనుమతులే లేని కళాశాలలో విద్యార్థులు చదువుతున్నట్లు రికార్డులు ఇవ్వడం, దానికి విశ్వవిద్యాలయాలు సమ్మతించి పరీక్షలు నిర్వహించడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఓ బీఈడీ కళాశాల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం నుంచి అనుబంధ గుర్తింపు పొందింది. దీనికి ఎన్‌సీటీఈ కూడా అక్కడే అనుమతి ఇచ్చింది. ఇదే కళాశాలను ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో నిర్వహిస్తున్నట్లు చూపి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. కళాశాల ఉందా, లేదా అని తనిఖీ చేయకుండానే రెండు వర్సిటీలు అనుమతులు ఇచ్చేశాయి.

వర్సిటీ ఏం చేస్తోంది?

ఎన్‌సీటీఈ అనుమతి లేనప్పుడు నాగార్జున వర్సిటీ ఎలా అనుమతిచ్చింది, పరీక్షలకు హాల్‌టిక్కెట్లు ఎలా జారీ చేసిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ అనుమతులు ఇవ్వలేదు. కాగితాల్లోనే కళాశాలను చూపిస్తూ, ఒడిశా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తూ, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ పరిధిలో 100 సీట్లు, నాగార్జున వర్సిటీ పరిధిలో మరో 100 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వాస్తవంగా శ్రీకాకుళంలోని కళాశాలకు మాత్రమే ఎన్‌సీటీఈ 100 సీట్లకు అనుమతి ఇచ్చింది. 2022-23కు సంబంధించి మొదటి సెమిస్టర్‌ పరీక్షలు సైతం పూర్తిచేశారు. తర్వాత ఈ బోగస్‌ కళాశాలపై వర్సిటీకి ఫిర్యాదు రావడంతో ఫలితాలు నిలిపివేశారు. అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకోకపోగా, తాజాగా రెండో సెమిస్టర్‌ పరీక్షలకు హాల్‌టిక్కెట్లు ఇచ్చి, పరీక్ష కేంద్రాలు కేటాయించారు. బోగస్‌ కళాశాల అని ఇప్పటికే ఫిర్యాదు వచ్చినందున పోలీసుల దృష్టికి తీసుకెళ్లడమో, లేదంటే కమిటీ వేసి, విచారణకు ఆదేశించడమో చేయాల్సింది. ఇవేవీ పట్టించుకోకుండా రెండో సెమిస్టర్‌కు హాల్‌టికెట్లు ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి కళాశాలలు పదుల సంఖ్యలో ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

కాసులే తప్ప నాణ్యత లేదు

రాష్ట్రంలోని బీఈడీ కళాశాలలు కొందరికి డబ్బులు తెచ్చేపెట్టే కామధేనువుల్లా మారాయి. కళాశాలల తనిఖీలు, అనుమతులు, ప్రవేశాల కౌన్సెలింగ్‌, విద్యార్థుల పేర్ల మార్పు, ఈడబ్ల్యూఎస్‌ కోటా భర్తీ.. ఇలా ప్రతి స్థాయిలోనూ భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. గతేడాది గుంటూరుకు చెందిన వైకాపా నాయకుడొకరు అనుమతులు ఇప్పించేందుకు కళాశాలల నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి, వివిధ స్థాయిల్లో పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం డీఎస్సీ వేయకపోవడంతో రాష్ట్ర విద్యార్థులు బీఈడీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ ప్రవేశాలు పొందుతున్నారు. వీరు నిత్యం తరగతులకు హాజరు కాకుండా, కేవలం పరీక్షల సమయంలోనే వచ్చి, రాస్తారు. ఒక అభ్యర్థికి బదులు మరొకరు పరీక్షలు రాసిన ఉదంతాలున్నాయి. రూ.60వేల నుంచి రూ.లక్ష చెల్లించి బీఈడీ సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో 428 బీఈడీ కళాశాలలు ఉండగా, అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే 110 ఉన్నాయి. వీటిలో కొన్నింటిలోనే తరగతులు బోధిస్తున్నారు. మరికొన్నింటిని కేవలం కాగితాలపై కొనసాగిస్తూ రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!

‣ విశ్వమంతా సూక్ష్మరూపం!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.