• facebook
  • whatsapp
  • telegram

AP Group-1, 2: 20 రోజుల వ్య‌వ‌ధిలో గ్రూపు-1, 2 ప్రిలిమ్స్‌

* ఆందోళ‌న‌లో అభ్య‌ర్థులు

* సిలబస్‌ పరంగా వ్యత్యాసాలు

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్ర‌భుత్వం ఇష్టారాజ్యంగా నియామక నోటిఫికేషన్లు జారీ చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. గ్రూపు-2, గ్రూపు-1 పోస్టుల భర్తీ  నోటిఫికేషన్ల జారీ తీరును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2021లో జాబ్‌ క్యాలెండర్‌ కింద ప్రకటించిన గ్రూపు-2 నోటిఫికేషన్‌ను డిసెంబ‌రు 7న‌ విడుదల చేసింది. కొద్దినెలల కిందట ప్రకటించిన గ్రూపు-1 నోటిఫికేషన్‌ను డిసెంబ‌రు 8న‌ జారీచేసింది. ఇన్నాళ్లూ కుంటిసాకులతో కాలం గడిపేసి.. ఎన్నికలకు ముందు హడావుడిగా నోటిఫికేషన్లు ఇవ్వడం నిరుద్యోగులను ఇబ్బంది పెడుతోంది. గ్రూపు-2 ప్రిలిమ్స్‌ ఫిబ్రవరి 25, గ్రూపు-1 ప్రిలిమ్స్‌ మార్చి 17న నిర్వహించాలని నిర్ణయించడంతో నిరుద్యోగులపై ఒత్తిడి పెరిగింది. ఈ రెండింటికీ మెయిన్స్‌ కొత్త ప్రభుత్వంలోనే జరగనున్నాయి.
 

సన్నద్ధత ఎలా?


గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లకు డిమాండ్‌ బాగా ఉంది. నిరుద్యోగులు ఈ రెండింటికీ దరఖాస్తు చేస్తారు. వీటి సిలబస్‌లో తేడా ఉంది. గ్రూపు-2లో ఇండియన్‌ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్‌ సొసైటీ, కరెంట్‌ ఎఫైర్స్‌, మెంటల్‌ ఎబిలిటీ ఉంటాయి.  గ్రూపు-1 ప్రిలిమ్స్‌లో ఇండియన్‌ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ (ఇండియా-ఏపీ), జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ సైకాలజీ, కరెంట్‌ ఎఫైర్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి. గ్రూపు-2  ప్రిలిమ్స్‌ జరిగిన 20 రోజుల్లోనే అదనపు సబ్జెక్టులకు అభ్యర్థులు సిద్ధం కావడం చాలా కష్టం.


 

ఏపీపీఎస్సీకి ఏమైంది?

గ్రూపు-1 సిలబస్‌, పరీక్షల విధానంలో మార్పులు తెస్తామని ఈ ఏడాది సెప్టెంబరులో ఏపీపీఎస్సీ తెలిపింది. ‘గ్రూపు-1 కింద రెండు లేదా మూడు పేపర్లను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నాం. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లాంటి పేపర్ల మూల్యాంకనానికి ప్రొఫెసర్లు సరిపడగా లేరు. 50% ప్రశ్నలను వ్యాసరూపం, మిగిలిన 50% ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే విషయాన్నీ పరిశీలిస్తున్నాం. అభ్యర్థుల శక్తి, సామర్థ్యాల అంచనాకు అవసరమైన పేపర్లను వ్యాసరూపంలోనే నిర్వహిస్తాం’ అని ఏపీపీఏస్సీ వెల్లడించింది. ఏపీపీఎస్సీ సభ్యుడొకరు ఆగస్టు 30న గ్రూపు-1 సిలబస్‌ను హేతుబద్ధీకరిస్తున్నామని ఎక్స్‌ వేదికగా నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలను కోరారు. ఇలా అటు ఏపీపీఎస్సీ, ఇటు సభ్యులు చెప్పడంతో అభ్యర్థులు సన్నద్ధతలో మార్పులు చేసుకున్నారు. తాజాగా జారీచేసిన గ్రూపు-1 నోటిఫికేషన్‌లో.. 2018 నాటి సిలబస్‌ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. దీంతో అభ్యర్థులంతా మళ్లీ పాత సిలబస్‌కే సిద్ధం కావాలి. వారికి ఇదో పెద్ద సమస్యగా మారింది. ఎన్నికలు వస్తున్నాయని వెంటవెంటనే నోటిఫికేషన్లు ఇచ్చేయడంతో మార్పుల ప్రతిపాదనలు అటకెక్కాయి.


ఎందుకీ గోప్యత?

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను నెలాఖరులోగా విడుదల చేస్తామని నవంబరు 1న ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లనే గురు, శుక్రవారాల్లో జారీచేసింది. మిగిలిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల విషయాన్ని ఇంకా ఏమీ చెప్పలేదు. వాటి విషయం ఏమైందో చెప్పాల్సిన బాధ్యత ఏపీపీఎస్సీకి ఉంది.


 

ఏపీపీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్


పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌
 

చరిత్ర, సంస్కృతి

రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు

భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు

భూగోళశాస్త్రం


పేపర్ 2: జనరల్‌ ఆప్టిట్యూడ్‌
 

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు

శాస్త్ర, సాంకేతిక రంగాలు


ఏపీపీఎస్సీ గ్రూప్‌-II -స్క్రీనింగ్ టెస్ట్-సెక్షన్ - ఎ -జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
3. జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు
 
4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర
5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు
6. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళశాస్త్రం
7. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్టనివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా
8. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
9. తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం
10. దత్తాంశ విశదీకరణ:   ఎ) దత్తాంశానికి టేబుల్‌ రూపం, బి) దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం,    సి) ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం) 
11. ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు


సెక్షన్ - బి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం


సెక్షన్ - సి భారతదేశ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ


పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు  



నమూనా ప్రశ్నపత్రాలు 


 

మరింత సమాచారం... మీ కోసం! 

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు



















 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.